మిషన్ – 2024.. బాబోయ్ బీఆర్ఎస్..

By KTV Telugu On 22 April, 2023
image

కేసీఆర్ పట్ల జాతీయ నేతలకు విశ్వాసం కలగడం లేదా. బీఆరెస్ఎస్ పార్టీ బీజేపీ వదిలిన బాణమా. కాంగ్రెస్ సహా పలు పార్టీలను సోదిలో కూడా లేకుండా చేసేందుకే  బీఆర్ఎస్ పుట్టిందా. అసలు దేశ రాజకీయాల్లో జరుగుతున్నదేమిటి. అంతన్నాడు ఇంతన్నాడే అని ఒక సినిమా పాట ఉంది. గులాబీ దళపతికి కూడా ఆ పాట వర్తిస్తుందనుకోవాలి. ఎందుకంటే ఆయన చెప్పేదొక్కటీ చేసేదొక్కటీ ఆయన ఎందుకు ఏం చేస్తున్నారో ఎవరికీ  అర్థం కాదు. ఆయన మనసులో ఒక మాట ఉంటుంది. బయట చెప్పేదొక్కటి ఉంటుంది. చివరకు చేసేది ఒకటి ఉంటుంది. మామూలు జనానికి అది అర్థం కావడానికి చాలా రోజులు పడుతుంది. అదే రాజకీయాల్లో ఉన్న వాళ్లకయితే కొంత తొందరగానే తెలుస్తోంది. ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ కేసీఆర్ అన్న ఆలోచనతో ఇతర నాయకులు ఆమడ దూరంగా ఉంటారు. అయినా బీఆర్ఎస్ లీడర్ తన అజెండాను సమర్థంగానే అమలు చేస్తారు. ఆయన ఎవరి కోసం ఆ అజెండాను అమలు చేస్తారో కేసీఆర్ కు తెలుసు. ఆ అజెండాను అర్థం చేసుకునే వాళ్లకూ తెలుసు.

జాతీయ నేతలకు కేసీఆర్ పై విశ్వాసం కలగడం లేదు. రాష్ట్రంలో ఉన్న కేవలం 17 లోక్ సభా స్థానాలతో దేశాన్ని పాలించాలన్న కోరక ఆయన ఎందుకు కలుగుతోందని ఉత్తరాది నేతలకు అనుమానం వచ్చింది. అందులో తెలంగాణలోని మొత్తం లోక్ సభా స్థానాలను ఆ పార్టీ గెలుచుకున్న సందర్భమూ లేదు. అంటే పట్టుమని  పది మంది లోక్ సభ సభ్యులతో 542 మంది ఉండే పార్లమెంటును శాసించాలన్న కోరిక ఎందుకు కలుగుతోందన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి. కేసీఆర్ అసలు అజెండా వేరే ఉందని కూడా మమత, నితీశ్, అఖిలేష్, మాయావతి, స్టాలిన్, సోరెన్ గ్రహించారు. మరి కేసీఆర్ అసలు అజెండా ఏమిటి. కేసీఆర్ రాజకీయాల్లో పండిపోయారు. రక్తపాత రహితంగా తెలంగాణ సాధించిన అనుభవాన్ని మెలికలు పెట్టగల నేర్పరితనాన్ని ఇప్పుడు జాతీయ రాజకీయల్లో ఉపయోగించాలనుకున్నారు. రాష్ట్రంలో కొంత వీక్  అయిపోతున్నానన్న అనుమానమూ ఆయనకు కలిగింది దానితో డైవర్షన్ కోసం జాతీయ పార్టీ పెట్టారు. భారత రాష్ట్ర సమితి టేకాఫ్ అంత గొప్పగా లేదు. అయినా ఆయన పట్టు వదలని విక్రమార్కుడిలా వదిలి పెట్టడం లేదు పొరుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తొలి అజెండాగా మహారాష్ట్రపై కన్నేశారు. మలి అజెండాలో ఆంధ్రప్రదేశ్ ఉండొచ్చు. అంతకుమించి అసలు అజెండా మరోకటి ఉంది. అదే జాతీయ పార్టీలను మట్టి కరిపించే అజెండా. మరి ఆ ప్రయత్నం ఎవరి కోసం.

కేసీఆర్ ది బహుముఖ వ్యూహం. జాతీయ పార్టీతో తెలంగాణలో గెలవాలన్నది తొలి వ్యూహం. ఆ వ్యూహం సమర్థంగా అమలు చేసే చర్యలు ఏప్పుడో మొదలయ్యాయి. కాంగ్రెస్ ను మట్టి కరపించడం కేసీఆర్ కు మిషన్ 2024 అని చెప్పక తప్పదు. ఈ దిశగా ఆయన బీజేపీకి ఏజెంట్. ఈ మాట చాలా మంది ప్రైవేటుగా అంటున్నదే. రోజుకు మూడు పూటలా మోదీని తిట్టినా ప్రధానమంత్రికి కేసీఆర్ రహస్య స్నేహితుడు. మోదీ ఆలోచనా విధానాన్ని అమలు జరిపే బీజేపీ మిత్రపక్షం. ఆ తిట్ల దండకం ఒట్టి అబద్ధాల పంచాంగమనే  చెప్పాలి.

బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పక్కలో బళ్లెమనే చెప్పాలి. ఎంత లేదన్న తెలంగాణలో కాంగ్రెస్ నెంబరు టూ పార్టీ బీజేపీ ఇప్పట్లో అభివృద్ధి చెందడం కుదరని పని. అందుకే కాంగ్రెస్ ను దెబ్బకొడితేనే బీఆర్ఎస్ మనుగడ సాధ్యం. తెలంగాణలో ఆ అజెండా అమలు జరిపితే సరిపోదు. కాంగ్రెస్ కు మరో చోట నుంచి ప్రాణవాయువు అందే అవకాశం  ఉంటుంది. అందుకే జాతీయ స్థాయిలో హస్తం పార్టీని దెబ్బకొట్టాలి. అందుకు అన్నిరకాల వనరులను ఉపయోగించాలి. బీజేపీ అజెండా కూడా అదేనని తెలుసు. అలాగని బీజేపీని కలుపుకుపోతే మళ్లీ బీఆర్ఎస్ కు భవిష్యత్తు ఉండదని కూడా కేసీఆర్ అర్థమైంది. ఎందుకంటే మిత్రపక్షాలను మింగేసే భస్మాసుర హస్తం మోదీ దగ్గర ఉందని కేసీఆర్ ఎప్పుడో గ్రహించారు. అందుకే మోదీకి దూరంగా మోదీ శత్రువుగా వ్యవహరిస్తూ బీజేపీ అజెండాను ఆయన అమలు చేస్తున్నారు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లుగా ఉంటుందీ కేసీఆర్ తీరు. దేశంలో కమ్యూనిస్టులను పడుకోబెట్టినట్లుగా కాంగ్రెస్ ను కూడా భూస్థాపితం చేయడమే కేసీఆర్ ప్రధాన లక్ష్యం. ఒకప్పుడు రెండు మూడు ప్రధాన రాష్ట్రాల్లో బలంగా ఉన్న వామపక్షాలను బీజేపీ మతవాద అజెండాతో పాటు ప్రాంతీయ శక్తులు పుంజుకోవడంతో దెబ్బకొట్టినట్లయ్యింది. అవే ప్రాంతీయ శక్తులు ఇప్పుడు కాంగ్రెస్ కు శాపంగా పరిణమించాయి.

కేసీఆర్ కదలికలను గమనిస్తున్న జాతీయ నేతలు ప్రాంతీయ పార్టీల నాయకులు ఆయనతో డేంజర్ అన్నట్లుగా వ్యవహరిస్తూ దూరం జరిగారు. అప్పుడెప్పుడో గల్వాన్ బాధితులకు సాయం అందించేందుకు కేసీఆర్ పాట్నా వెళ్లినప్పుడు కూడా ఆయనతో రాజకీయాలు మాట్లాడేందుకు నితీశ్ కుమార్ ఇష్టపడలేదు. కేసీఆర్ మీడియాతో మాట్లాడుతుండగానే నితీశ్ లేచి వెళ్లిపోయారు. గత ఏడాది వరకు హేమంత్ సోరెన్ లాంటి నేతలు కేసీఆర్ తో చెలిమికి ప్రయత్నించినా తర్వాత దూరం జరిగాయి. ఇటీవల చెన్నైలో స్టాలిన్ ఒక జాతీయ స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించినా కేసీఆర్ ను పిలవలేదు. ఎందుకంటే ఆయనపై నమ్మకం లేదనుకోవాలి. ఎక్కడో ఉన్న ఫరూక్ అబ్దుల్లాను ఆహ్వానించిన స్టాలిన్ . తెలంగాణ సీఎంను పిలవకపోవడంపై పెద్ద చర్చే జరిగింది. మరి తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి స్టాలిన్ వస్తారో  లేదో చూడాలి. మమతా, మాయావతి లాంటి వాళ్లయితే అసలు కేసీఆర్ ఒకరున్నారు అన్నట్లుగా కూడా ప్రవర్తించడం లేదు. ఎందుకంటే కేసీఆర్ అసలు అజెండాను వాళ్లు అర్థం చేసున్నారు. ఇక ఏపీ సీఎం జగన్ విషయంలోనూ అదే తీరు. కేసుల భయంతో ఆయన బీజేపీకి దాసోహమంటారని అందరికీ తెలిసిందే. అదన్నమాట అసలు సంగతి.