కన్నడ నాట స్టార్ క్యాంపెయినర్లతో ప్రచార హోరు

By KTV Telugu On 22 April, 2023
image

ఎన్నికల్లో అత్యంత కీలకమైనది ప్రచార ఘట్టమే. ఓటర్లను ఆకర్షించాలంటే ప్రజల ఆకాంక్షలేంటో ముందుగా తెలుసుకోవాలి. ఆచరణ సాధ్యమైన హామీలనే ఇవ్వాలి. ప్రజల్లో నమ్మకం కలిగితేనే ఏ పార్టీకైనా జనం ఓటు వేయాలనుకుంటారు. కర్నాటకలో ఇపుడు కాంగ్రెస్-బిజెపి-జేడీఎస్ లు అదే పనిలో ఉన్నాయి. ప్రచార పర్వాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్లడానికి  బిజెపి తరపున మోదీ షాలు కాంగ్రెస్ తరపున గాంధీలు సిద్ధమైపోయారు.
తమ జెండాయే తమకి స్టార్ క్యాంపెయినర్ అని జేడీఎస్ ధీమాగా ఉంది. ఇరవై రోజుల పాటు ఇక కన్నడ నాట ప్రచార భేరి మోగుతూనే ఉంటుంది. కర్నాటక ఎన్నికల పర్వం కీలక ఘట్టానికి చేరుకుంది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిపోయింది. ఇక ఓటర్ల మనుసులు కొల్లగొట్టేలా ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రధాన రాజకీయ పార్టీలు బిజెపి-కాంగ్రెస్ లు నిశ్చయించుకున్నాయి. రెండు జాతీయ పార్టీలు కూడా పార్టీ తరపున ప్రచారం చేయడానికి 40 మంది స్టార్ క్యాంపెయినర్లతో జాబితాలు రూపొందించి విడుదల చేశాయి. ప్రచారంలో దూకుడుగు ఉంటే పోలింగ్ రోజునా దూసుకుపోవచ్చని రెండు పార్టీలూ భావిస్తున్నాయి. అలాగని జేడీఎస్ ఏమీ ప్రయత్నించడం లేదని కాదు. జేడీఎస్ కు ఉండే క్యాంపెయినర్లంతా కర్నాటకకు చెందన వారే ఉంటారు. అంటే లోకల్ అన్నమాట. కానీ కాంగ్రెస్ బిజెపిలు కర్నాటకలోని పాపులర్ లీడర్స్ తో పాటు జాతీయ స్థాయిలో పార్టీలోని స్టార్ లీడర్స్ ను కూడా ప్రచారంలో వినియోగించుకుంటాయి. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులను ప్రచార బరిలో దింపుతాయి.

భారతీయ జనతా పార్టీ ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీయే స్టార్ అట్రాక్షన్. రాష్ట్రంలో 25కి పైగా భారీ ర్యాలీల్లో నరేంద్ర మోదీ పాల్గొంటారు. బిజెపిని గెలిపిస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని అపుడు కర్నాటక అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని నరేంద్ర మోదీ అంటున్నారు. వారం రోజుల పాటు కర్నాటకలోనే మకాం వేయనున్నరు నరేంద్ర మోదీ.
మోదీ చంద్రగుప్తుడు అయితే చాణక్యుడిగా వెలుగొందుతోన్న అమిత్ షా రెండు రోజుల పాటు కర్నాటకలో మకాం వేశారు. మోదీ-షా కాంబినేషన్ కు తిరుగులేదని చాలా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. అంత సక్సెస్ ఫుల్ జోడీ కర్నాటకపైనా ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మల సీతారామన్, స్మృతి ఇరానీ లతో పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ,మహారాష్ట్ర డిప్యూటీ సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ వంటి దిగ్గజాలు విస్తృతంగా ప్రచారం చేయనున్నారు.
బిజెపిలో మోదీ-షాలకు సమానంగా క్యాడర్ లో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పెషల్ అట్రాక్షన్ అంటున్నారు రాజకీయ పరిశీలకులు. వీరితో పాటు కర్నాటక బిజెపిలోని అగ్రనేతలు ఎడ్యూరప్ప, ఈశ్వరప్ప తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీ కూడా 40 మంది స్టార్ క్యాంపెయినర్స్ తోనే లిస్ట్ విడుదల చేసింది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రచార ఘట్టానికి నేతృత్వం వహిస్తారు. తనయుడు రాహుల్ గాంధీ గారాల పట్టి ప్రియాంక గాంధీలు రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసి ప్రచారానికి జోష్ తేనున్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ కేంద్ర మంత్రులు చిదంబరం, జై రాం రమేష్, శశిథరూర్, రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్, క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ లు ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తారు. కర్నాటకకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రులు వీరప్ప మొయిలీ, సిద్ధరామయ్య, పిసిసి అధ్యక్షుడు డి.కే.శివకుమార్, అగ్రనేతలు పరమేశ్వర, మునియప్ప, రేవణ్న తదితరులు విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. కర్నాటకలో తెలుగు ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉండే 40కి పైగా నియోజకవర్గాల్లో ప్రచారానికి కాంగ్రెస్-బిజెపిలు రెండూ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల నుండి నాయకులను పంపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రచారానికి ఏపీ మాజీ మంత్రి రఘువీరా రెడ్డి, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రచారంలో మెరవనున్నారు. బిజెపి తరపున మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు ఫోకస్ పెట్టనున్నారు.

ఎంతమంది ప్రచారం చేసినా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ప్రచారం పార్టీకి కొత్త ఊపు తెస్తుందని నమ్ముతున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ నిర్వహించిన జోడో యాత్ర సూపర్ హిట్ కావడంతో పాటు రాహుల్ గ్రాఫ్ పెరిగిందంటున్నారు రాజకీయ పండితులు. దానికి తోడు ఆయనపై లోక్ సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేయడంతో ఆయన పట్ల సానుభూతి కూడా బానే ఉందంటున్నారు. ఈ రెండు ఫ్యాక్టర్లతో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం చేకూర్చిపెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు.n ఇక ప్రియాకం గాంధీ ప్రచారం యువతను ఆకట్టుకునే అవకాశాలున్నాయి. నాయనమ్మ ఇందిరా గాంధీ పోలికలతో ఉన్న ప్రియాంక గాంధీ పార్టీకి తిరుగులేని గ్లామర్ తెస్తారని అంటున్నారు. ఇక మల్లికార్జున ఖర్గే స్థానికుడు కావడం దళిత నేత కావడం కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశమే అంటున్నారు. దళిత ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేలా చేయగలిగితే ఖర్గే సగానికి పైగా విజయం సాధించినట్లే అంటున్నారు రాజకీయ పండితులు. బిజెపికి అయితే నరేంద్ర మోదీయే వన్ మ్యాన్ షోతో అదరగొడతారని అంటున్నారు. అమిత్ షా ప్రచారాని కన్నా కూడా ఎన్నికల వ్యూహాలు ఎత్తుగడల్లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశనం చేస్తారని అంటున్నారు.
ఇక దేవెగౌడ సారధ్యంలోని జేడీఎస్ కు కాంగ్రెస్, బిజెపిల తరహాలో పొరుగు ప్రాంతాల నుంచి క్యాంపెయినర్లు రారు. జేడీఎస్ తరపున ప్రచారం చేసేవారంతా స్థానికులే. దేవెగౌడకు ప్రజల్లో తిరుగులేని ఆదరణ ఉంది. కాకపోతే ప్రస్తుతం ఆయన అంత ఆరోగ్యంగా లేరు. ఓపిగ్గా సుడిగాలి పర్యటనలు చేసే పరిస్థితి లేదు. మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామే పార్టీ ప్రచారాన్ని భుజాలకెత్తుకోవాలి. దానికి ఆయన సిద్ధంగానే ఉన్నారు.

అయిదేళ్ల పాటు అధికారంలో ఉన్న బిజెపి పై తీవ్ర వ్యతిరేకత కనపడుతోంది. దీన్ని అధిగమించాలంటే బిజెపి చాలా పకడ్బందీగా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ  ప్రభుత్వ వ్యతిరేకతను అంది పుచ్చుకునే అవకాశం ఇవ్వకూడదంటే అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా ప్రచార పర్వం ఉండాలని బిజెపి పట్టుదలగా ఉంది. ఏ ఎన్నిక అయినా సరే బిజెపి అంత తేలిగ్గా వదిలి పెట్టదు. కర్నాటక అందుకు మినహాయింపు కాదు. ప్రాంతాలు, కులాల వారీగా సమీకరణలను కూడా బిజెపి బేరీజు వేసుకుంటూనే వ్యూహాలు సిద్దం చేసుకుంటూ ఉంటుంది. బిజెపికి సంబంధించి చాణక్య చంద్రగుప్తులుగా పేరు తెచ్చుకున్న అమిత్ షా  మోదీలు కర్నాటకపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను మాయం చేయగల ఇంద్రజాలం మోదీ దగ్గర ఉందని కమలనాధులు అంటున్నారు. మోదీ ప్రచారం మొదలైతే మొత్తం సమీకరణలు అంచనాలు అన్నీ మారిపోతాయని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దేశంలో మోదీని మించిన జనాకర్షక నేత మరొకరు లేరన్నది బిజెపి వాదన. అది నిజమే అయినా  తీవ్ర స్థాయిలో ఉన్న వ్యతిరేకతను అధిగమించడం అంత తేలికా అన్నది ప్రశ్న. మాజీ ప్రధాని  దేవెగౌడ నాయకత్వంలోని జనతాదళ్ ఎస్ కి పెద్ద పెద్ద అంచనాలు ఆశలు లేవు. పైకి వాళ్లు ఏం మాట్లాడినా కూడా పాత మైసూర్ ప్రాంతంలోని 89 నియోజకవర్గాల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పాగా వేయడమే వారి లక్ష్యంగా కనిపిస్తోంది. 30 పై చిలుకు సీట్లు సంపాదిస్తే కింగ్ మేకర్ కావచ్చు. కాలం కలిసొస్తే కింగ్ మేకరేం ఖర్మ కింగే కావచ్చు అని కుమార స్వామి ఆశావహ దృక్పథంతో ఉన్నారు. ప్రస్తుత సర్వేలు ఏ పార్టీకీ మ్యాజిక్ ఫిగర్ ఇవ్వడం లేదు. ఇక అంతిమ ఫలితం వస్తేనే కానీ కన్నడ పీఠాన్ని అధిరోహించేది ఎవరో చెప్పలేం.