సినిమా ఇండస్ట్రీపై ఇన్‌కంట్యాక్స్ డిపార్టెమెంట్ డేగకన్నేసింది. లెక్కలకు అందకుండా పోగేసిన బ్లాక్ మనీ అంతా సిన్మా ఇండస్ట్రీలోకి వస్తున్నట్లు ఐటీ అనుమానిస్తోంది. సినిమా డబ్బులను రియల్ ఎస్టేట్‌కి మళ్లించికి అక్కడి లాభాలను సినిమాలకు చూపిస్తూ భారీగా ఆస్తులు కూడబెడుతున్నారన్న ఆరోపణలతో ఆదాయపన్నుశాఖ రంగంలోకి దిగింది. మైత్రీ మూవీస్ ఎర్నేని నవీన్, రవి శంకర్ ఇళ్లల్లో ఐటీ సోదాలతో టాలీవుడ్‌లో నెక్ట్స్ ఎవరన్న చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లూ సినిమా నిర్మాణ ఖర్చుల గురించి ఆరా తీసిన ఐటీ అధికారులు ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులపై లెక్కలుతేల్చే పనిలో పడ్డారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుష్ప సినిమా తీసింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే. ఇందులో వచ్చిన లాభాలను ప్రొడ్యూసర్లు రియల్ ఎస్టేట్ కి తరలించారని ఐటీశాఖ అనుమానిస్తోంది. ఇన్‌కంట్యాక్స్ తగ్గించుకునేలా ఖర్చుల లెక్కలు ఎక్కువ చూపించారనే అనుమానంతో డైరెక్టర్ సుకుమార్ ప్రొడ్యూసర్స్ ఎర్నేని నవీన్, రవిశంకర్ ఇళ్లల్లో ఆఫీసులలో సోదాలు జరిపారు. ఐటీ రైడ్స్ దెబ్బతో పుష్ప-2 సినిమా షూటింగ్‌ని కూడా డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ తాత్కాలికంగా ఆపేయాల్సి వచ్చింది.
శంకర్‌పల్లిలో బినామీ పేర్లతో భారీగా వెంచర్లు వెలిశాయి. వీటిలో పెట్టుబడి పెట్టింది సినిమా ఇండస్ట్రీ పెద్దలేనని ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. వైల్డ్ వాటర్స్, థీమ్ పార్క్‌ల పేరుతో దాదాపు 200 ఎకరాలను శంకర్‌పల్లిలో డెవలప్‌చేశారు. ఇండస్ట్రీ డైరెక్టర్లు హీరోలు ప్రొడ్యూసర్లు భారీగా ఈ ల్యాండ్ పూలింగ్ చేశారన్న సమాచారంతోనే ఐటీ అధికారులు రంగంలోకి దిగారని సమాచారం. మైత్రీ సంస్థ సినిమా నిర్మాణాల్లో కొందరు పొలిటికల్ లీడర్లకు పార్ట్‌నర్‌షిప్ ఉన్నట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల సొమ్ము సిన్మా ప్రొడక్షన్‌లో ఉందని గుర్తించారు. ఏపీకి చెందిన ఒక ఎమ్మెల్యే తెలంగాణకు చెందిన మరో ఎమ్మెల్యే నుంచి సినిమాల నిర్మాణానికి బడ్జెట్ అందుతున్నట్లు ఆధారాలతో ఐటీ శాఖ లోతుగా విచారిస్తోంది. మైనింగ్ బిజినెస్‌లో ఉన్న ఏపీ ఎమ్మెల్యేతో మైత్రీ సంస్థకు లింక్స్ ఉన్నాయని మరో ఎమ్మెల్యే హైదరాబాద్ సిటీలో కోటీశ్వరులుండే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలియటంతో ఈ లింక్‌ల లెక్కతేల్చే పనిలో ఉంది ఆదాయపుపన్నుశాఖ.
మైత్రి మూవీ మేకర్స్ ముంబై ఫైనాన్సర్ నుంచి డబ్బు తీసుకొని బాలీవుడ్ సినిమాలు నిర్మించేందుకు కూడా మేకర్స్ సిద్ధమైనట్లు గుర్తించారు. ఎలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని ఇద్దరూ గతంలో అమెరికాలో వ్యాపారాలు చేసి స్వదేశానికి తిరిగొచ్చాక సిన్మాల నిర్మాణంలోకి దిగారు. దీంతో వారి వ్యాపార లావాదేవీల వెనుక మనీ లాండరింగ్ కోణం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా ఎంక్వైరీ జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సంక్రాంతికి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చింది. వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య సినిమాలు సూపర్ హిట్ కావడంతో పాటు ఇప్పుడు పుష్ప-2 సినిమాను కూడా ఆ సంస్థ బడ్జెట్‌కి వెనుకాడకుండా నిర్మిస్తోంది. పుష్ప పార్ట్ టూలో డైరెక్టర్ సుకుమార్ కూడా పార్ట్‌నర్‌గా ఉన్నారు. ఎప్పుడూ జరిగే రొటీన్ రైడ్స్‌గానే సిన్మా ఇండస్ట్రీ చూస్తున్నా పన్ను ఎగవేత లెక్కలపై ఆధారాలు దొరికితే ఐటీ డిపార్ట్‌మెంట్ విడిచిపెట్టేలా లేదు. సిన్మాకి 100 కోట్లు తీసుకుంటానని పవన్‌కల్యాణ్ లాంటి హీరో పబ్లిక్‌గానే చెబుతుంటారు. తమ కలెక్షన్లు ఇంతని ప్రొడ్యూసర్లే చంకలు గుద్దుకుంటుంటారు. మరి ఇవన్నీ లెక్కల్లో పక్కాగా ఉన్నాయా లేదా అన్నది ఐటీ లెక్కతేల్చబోతోంది.