ప్రత్యర్థి ఆత్మరక్షణలో పడ్డప్పుడే దెబ్బతీయాలి. కాలూచేయి కూడదీసుకునేలోపు ముప్పేటదాడితో ఉక్కిరిబిక్కిరి చేయాలి. అదే సమయంలో తామే ప్రత్యామ్నాయం అన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. ఎలాగైనా ఈసారి అధికారపీఠం దక్కించుకోవాలి. తెలంగాణలో ఇదే టార్గెట్‌తో ఉంది కమలం పార్టీ. మరో ఆరేడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో తెలంగాణపై గట్టిగానే గురిపెడుతోంది బీజేపీ. అందులో భాగంగా తెలంగాణ బీజేపీ నేతలకు హైకమాండ్ కొత్త టార్గెట్ ఇచ్చింది. జన సంపర్క్ పేరుతో జనంలోకి వెళ్లేలా 160 రోజుల రోడ్ మ్యాప్ రెడీ అయింది. 160 రోజుల్లో తెలంగాణ బీజేపీ నేతలు ఏం చేయాలి ఏయే అంశాలతో ప్రజల్లోకి వెళ్లాలి సంస్థాగతంగా జరగాల్సిన మార్పులు చేర్పులపై రాష్ట్ర నేతలకు జాతీయనేతలు సూచనలు సలహాలు ఇచ్చారు. మే 15 నుంచి జూన్ 15 వరకు కేంద్ర ప్రభుత్వ విజయాలు బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు కమలనాథులు సిద్ధమయ్యారు. తెలంగాణలో మేమే ప్రత్యామ్నాయం అంటోంది బీజేపీ. బీఆర్ఎస్కి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కాదు కమలం పార్టీనేనన్న వాతావరణాన్ని సృష్టించగలిగింది. కానీ జంటనగరాలతో పాటు రెండుమూడు జిల్లాల్లో ఆ పార్టీకి ఇప్పటికీ బలమైన నాయకత్వం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇవ్వగల అభ్యర్థులు లేరు. అందుకే ఆపరేషన్ ఆకర్ష్‌పైనా తెలంగాణ బీజేపీ నేతలు గట్టిగానే ఫోకస్ చేస్తున్నారు. పార్టీలో చేరే అవకాశం ఉన్న నేతల లిస్ట్‌పై బీజేపీ కోర్ కమిటీ మీటింగ్‌లో చర్చ జరిగింది. జిల్లాల వారీగా నేతల జాబితాని రెడీ చేసినట్లు చెబుతున్నారు.
కొందరు నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నా రాష్ట్ర నాయకత్వంలో ఆధిపత్యపోరుతో ఆ కార్యక్రమానికి విఘాతం కలుగుతోంది. ఈ సమస్యను కూడా గుర్తించిన బీజేపీ కేంద్ర నాయకత్వం నేతల మధ్య తేడా రాకుండా ప్రత్యేక ఫార్ములాని కూడా రూపొందించింది. క్రెడిట్ ఎవరికనే సమస్య తలెత్తకుండా చేరికల విషయంలో ఎవరెవరు సంప్రదించాలో క్లారిటీ ఇచ్చేసింది. పార్టీలో సంస్థాగత మార్పులకు కూడా సిద్ధంగా ఉండాలని తెలంగాణ బీజేపీ నేతలకు హైకమాండ్ సూచించింది. రాష్ట్ర జిల్లా మండల పార్టీ కమిటీల్లో వెంటనే ఖాళీగా ఉన్న పదవుల్ని భర్తీ చేయాలని ఆదేశించింది. పదవుల్లో ఉండి కూడా పార్టీలో యాక్టివ్‌గా లేనివారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించబోతోంది. 23న అమిత్‌షా చేవెళ్ల సభతో తెలంగాణలో దూకుడు పెంచాలనుకుంటోంది బీజేపీ. వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పార్టీ మీద సహజంగానే కొంత వ్యతిరేకత ఉంటుంది. అదే సమయంలో ఇప్పటిదాకా తెలంగాణ సెంటిమెంట్‌తో గెలుస్తూ వచ్చిన టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారడం కూడా తనకు అనుకూలిస్తుందన్న అంచనాతో బీజేపీ ఉంది. కేసీఆర్ కూతురు లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కోవడం కుటుంబపాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను బలంగా ప్రచారం చేస్తే దక్షిణాదిలో మరో కీలకరాష్ట్రమైన తెలంగాణలో తన లక్ష్యం నెరవేరుతుందన్న నమ్మకంతో బీజేపీ ఉంది. మరి కమలం పార్టీ వ్యూహం తెలంగాణలో ఫలిస్తుందా లేదా ఇప్పుడే చెప్పలేకున్నా ఇప్పటిదాకా కాంగ్రెస్ ఒక్కటే ప్రత్యర్థి అనుకుంటున్న గులాబీపార్టీ మరో గట్టి ప్రత్యర్థితో కూడా తలపడాల్సి వచ్చేలా ఉంది.