30 ఏళ్లు మేమే పాలిస్తాం అంటారో సీఎం. నేను నా తర్వాత కొడుకు కాలం కలిసొస్తే ఆ తర్వాత మనవడు అన్నట్లుంది మరో రాష్ట్ర రాజకీయం. తుదిశ్వాస కూడా ఆ సీట్లోనే అన్నట్లుంది జాతీయస్థాయి పార్టీ రాజకీయం కూడా. అంటే తాము తప్ప మరొకరు అధికారంలోకి రాలేరన్న ధీమా. తాము తప్ప మరొకరికి అధికారం దక్కకూడదన్న లక్ష్యం. దీన్ని ఆత్మవిశ్వాసం అనాలా ప్రజలను హిప్నటైజ్ చేస్తున్నారనుకోవాలా అంటే తాము తప్ప అంత జనరంజకంగా వేరెవ్వరూ పరిపాలించలేరనే పిచ్చి నమ్మకమా మంచైనా చెడయినా రాజ్యాధికారం తమ చేతుల్లోనే ఉండాలన్న నియంతృత్వ పోకడనా. తెలుగురాష్ట్రాల్లోనే కాదు జాతీయస్థాయిలో ఇదే తరహా రాజకీయం నడుస్తోందిప్పుడు. ప్రశ్నించే గొంతు లేకుండా చేసుకోవాలనుకుంటోంది రాజకీయం. విపక్షమనేదే లేకుండాపోతే తమకు నచ్చింది చేసుకుపోవచ్చన్న ధోరణి ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం.
నిజాయితీగా నిక్కచ్చిగా వ్యవహరించేవాడు జనంకోసమ ఏ త్యాగానికైనా సిద్ధపడేవాడు ఎన్నికల బరిలో నిలిచి ప్రజల ఓట్లతో గెలిచే పరిస్థితి దేశంలో ఏ మూలన కూడా లేదు. పవర్ పాలిటిక్స్ ప్రజాస్వామ్యానికి కొత్త నిర్వచనం చెబుతున్నాయి. మన దేశంలోనేనా మిగిలిన దేశాల్లోనూ ఈ పరిస్థితి ఉందా అంటే తుమ్మినా దగ్గినా శిక్షలేసే దేశాలు కూడా ఉండొచ్చు. అలాంటి నియంతృత్వ పోకడలున్న దేశాలతో పోల్చుకుని మనం బాగున్నామనుకుంటే అది ఆత్మవంచనే. అగ్రరాజ్యం అమెరికానే చూస్తే బుష్ అయినా క్లింటన్ అయినా ట్రంప్ అయినా ఇప్పుడున్న బైడన్ అయినా చచ్చేదాకా మేమే ఉంటామంటే కుదరదు. ఎంత శక్తిమంతుడైనా ఎంత గొప్ప నేపథ్యమున్నా అమెరికాలో రెండు పర్యాయాలు అది కూడా ఎనిమిదేళ్ల పదవీకాలానికే పరిమితం. నాలుగేళ్ల పాలన బాగుంటేనే మరో నాలుగేళ్లు అవకాశం. తర్వాత మరొకరికి అవకాశం ఇవ్వాల్సిందే. క్లింటన్‌ని తప్పించి ఒబామాని గెలిపించారు. చివరికి రాజకీయం కూడా వ్యాపారం అనుకునే డొనాల్డ్ ట్రంప్‌కి కూడా ఓసారి అవకాశం ఇచ్చారు. అభ్యర్థి ఎవరుండాలనేది కూడా ప్రజాభిప్రాయం ప్రకారం జరగాల్సిందే. మా ఇష్టమొచ్చినోడిని నిలబెట్టుకుంటామంటే కుదరదక్కడ.
మా తాతలు నేతులు తాగారని ఎవరూ అమెరికాలో మీసాలు మెలేయలేరు. ఎంత డబ్బయినా ఖర్చుపెడతామంటే ఒప్పుకోరు. అదే సాధ్యమైతే ట్రంప్‌ని మించిన మిలీయనీర్ ఎవరున్నారని. డబ్బుతో కొట్టే అవకాశం ఉంటే అమెరికా అధ్యక్షపీఠంమీద చివరిక్షణాలదాకా ట్రంప్ కంపునే భరించాల్సి వచ్చేది. ఆయా పార్టీల తరపున అభ్యర్థిత్వం కోరుకునేవారు ప్రజల ముందుకు రావాలి ప్రత్యర్థితో చర్చించాలి. తన వాదనతో ప్రజల్ని మెప్పించాలి. నలుగురైదుగురు రేసులో ఉంటే చివరికి ఆ పార్టీ తరపున సమర్ధుడైన అభ్యర్థి ఎవరో ప్రజలే నిర్ణయిస్తారు. డెమోక్రాట్లయినా రిపబ్లికన్లయినా ప్రజల అభిప్రాయాన్ని మన్నించాల్సిందే. ఇంటింటికీ తిరిగి తలుపులకు స్టిక్కర్లు అంటించడాలు బొట్టుపెట్టి చీరసారెలు సమర్పించుకోడాలూ అమెరికా ఎన్నికల వ్యవస్థలో ఉండవు. తమ భవిష్యత్తుకు ఎవరు సరైన నాయకుడో ప్రజలు స్వేచ్ఛగా నిర్ణయించుకుంటారు. పోలింగ్‌రోజున ఏ ఒత్తిడీ లేకుండా తమ తీర్పును వెలువరిస్తారు. మన దగ్గర అలాంటి రాజకీయాన్ని కల్లో కూడా ఊహించుకోలేం.
1951కి ముందు అమెరికాలో పదవీకాల పరిమితి లేదు. ఎవరు ఎన్నిసార్లయినా పోటీచేయొచ్చు. ఎన్నేళ్లపాటైనా అధికారంలో ఉండొచ్చు. ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ నాలుగుసార్లు అమెరికా అధ్యక్షుడిగాఎన్నికయ్యారు. 1932 నుంచి 1945 వరకు శ్వేతసౌధ అధిపతిగా ఉన్నారు. అయితే 52 ఏళ్ల క్రితం అక్కడి రాజ్యాంగానికి 22వ సవరణతో రెండుసార్లే పదవి అన్న నియమం అమల్లోకి వచ్చింది. ఎంత పాలనాదక్షుడైనా తిమ్మిని బమ్మిని చేసే చావు తెలివితేటలున్నా రెండు పర్యాయాలు ఎనిమిదేళ్లు మాత్రమే అధ్యక్షబాధ్యతల్లో ఉండొచ్చు. తర్వాత గౌరవంగా తప్పుకుని మరో నాయకుడికో కుటుంబానికో అవకాశం ఇవ్వాల్సిందే. ప్రపంచంలో 200 దేశాల్లో ఎన్నికల పద్ధతిని పరిశీలిస్తే మనదేశంలో ఉన్న పద్ధతిని అనుసరించిన దేశాలు సుమారు 89దాకా ఉన్నాయి. దామాషా ఎన్నికల పద్ధతిని అనుసరించే దేశాలు దాదాపు 105దాకా ఉన్నాయి. ఓ నాయకుడు తానో లేదంటే తన పార్టీనో జీవితకాలం అధికారంలో ఉండాలనుకుంటే చివరికి అది నియంతృత్వానికి దారితీస్తుంది. రష్యా అధినేత పుతిన్ 2000 సంవత్సరం నుంచి పదవిలో కొనసాగుతున్నారు. తానే అధికారంలో ఉండేందుకు పుతిన్ పలుమార్లు రాజ్యాంగాన్ని మార్చారు. అధ్యక్షుడిగా ప్రధానిగా పదవులు మారుస్తూ దేశంలో తాను తప్ప మరొకరు ఉండకూడదన్నట్లు అధికారం చెలాయిస్తున్నారు. ప్రతిపక్షాలు గొంతు నులిమేస్తున్నారు.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా ఇదే దోవలో పోతున్నారు. డెంగ్ జియావో పింగ్ 1982లో రాజ్యాంగానికి చేసిన సవరణ ప్రకారం ఏ నాయకుడూ రెండుసార్లకు మించి అధ్యక్ష పదవిలో కొనసాగరాదు. కానీ జిన్‌పింగ్ 2035దాకా తానే అధికారంలో ఉండేలా నియమనిబంధనలను తనకు అనుకూలంగా మార్చేసుకుంటున్నారు. ప్రపంచంలో మనదే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశం. కానీ మేడిపండులాంటి ఎన్నికల వ్యవస్థలో బలమున్నవాడిదే రాజ్యమవుతోంది. 50శాతం ఓట్లు రాని పార్టీ కూడా అధికారంలోకొస్తోంది. ఎన్నికల వ్యయం కరెన్సీ కట్టలు తెంచుకుంటోంది. అధికార దుర్వినియోగం ఓట్ల జాబితాల్లో గందరగోళం ఫిరాయింపులు ఒక్కటేంటి సకల అవలక్షణాలు మన వ్యవస్థలో ఉన్నాయి. డబ్బు కులం మతం కండబలం ఎన్నికల్లో పోటీకి ప్రధాన అర్హతలవుతున్నాయి. ప్రస్తుత ఎన్నికల వ్యవస్థలో సమూల మార్పులు రావాలని అంతా కోరుకుంటున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకంపై ఈమధ్యే సుప్రీంకోర్టు సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. కానీ ఈ సంస్కరణ సరిపోదు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనేలా ఎంత గొప్పోడయినా పరిమితకాలమే అధికారంలో ఉండేలా రాజ్యాంగ సవరణ జరగాలి. అభివృద్ధి చెందుతున్న దేశంగా ఎన్నికల సంస్కరణల విషయంలో ఇతరదేశాలకు ఆదర్శంగా ఉండాలి. కానీ పదవి లేకపోతే ఊపిరి ఆగిపోతుందనుకునే మన రాజకీయం అందుకు ఒప్పుకుంటుందా.