వేర్పాటువాది అరెస్ట్‌.. ఖ‌లిస్తాన్ వాద‌న ఆగుతుందా

By KTV Telugu On 24 April, 2023
image

న‌కిలీనోట్లు ఆయుధాలు దొంగ‌చాటుగా చొర‌బాటుదారులు స్వ‌తంత్ర‌భార‌తాన్ని విచ్ఛిన్నం చేసేందుకు విదేశీశ‌క్తులు ఉగ్ర‌మూక‌లు ఏళ్లుగా కుట్ర‌లు ప‌న్నుతూనే ఉన్నాయి. ఇందిరాగాంధీ హ‌యాంలో కూక‌టివేళ్ల‌తో పెకిలించేశారనుకున్న ఖ‌లిస్తాన్ వేర్పాటువాదం స‌జీవంగానే ఉంద‌ని అవ‌కాశం కోసం ఎదురుచూస్తోంద‌న్న విష‌యం అమృత్‌పాల్ వ్య‌వ‌హారంతో నిర్ధార‌ణ అయింది. వేల‌మంది పోలీసుల‌ను వారాల త‌ర‌బ‌డి మూడుచెరువుల నీళ్లు తాగించిన ఖ‌లిస్తాన్ వేర్పాటువాద నాయ‌కుడు అమృత్‌పాల్ ఎట్ట‌కేల‌కు అరెస్ట్ కావ‌టంతో కేంద్ర‌రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఊపిరిపీల్చుకున్నాయి. పంజాబ్‌లోని రోడె గ్రామ గురుద్వారాలో అమృత్‌పాల్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జాతీయ‌భ‌ద్ర‌తాచ‌ట్టం కింద ఇప్ప‌టికే అమృత్‌పాల్ ముఖ్య అనుచ‌రులు ఎనిమిదిమందిని పోలీసులు అస్సాంలోని డిబ్రూగ‌ర్ జైల్లో పెట్టారు. అమృత్‌పాల్‌ని కూడా అక్క‌డికే త‌ర‌లించారు.

ఖ‌లిస్తాన్ ఉద్య‌మం ఒక్క‌సారిగా వేడెక్క‌టంతో కేంద్రం అప్ర‌మ‌త్త‌మైంది. పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్‌సింగ్ మాన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యాక అమృత్‌పాల్ సింగ్ కోసం సీరియ‌స్‌గా వేట మొద‌లైంది. పాకిస్తాన్ ఐఎస్ఐ అండ‌తో చెల‌రేగిపోయాడు అమృత్‌పాల్‌సింగ్‌. సిక్కుల‌కోసం ప్ర‌త్యేక దేశం అనేది పైకి క‌నిపించే డిమాండ్ అయినా భార‌త్‌నుంచి పంజాబ్‌ని వేరుచేసి పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో క‌లిపేయాల‌న్న కుట్ర‌లో కలిపేయాలన్న‌ది అస‌లు కుట్ర. పాకిస్తాన్‌తో పాటు బ్రిట‌న్‌ కెనడా అమెరికా దేశాల ఖలిస్తానీ మద్దతుదారుల సహకారం ఉండ‌టంతో మ‌రో భింద్ర‌న్‌వాలేలా మారిపోయాడు అమృత్‌పాల్‌సింగ్‌. అందుకే అమృత్‌పాల్‌కోసం పోలీసుల వేట సాగుతున్న స‌మ‌యంలో బ్రిట‌న్‌ అమెరికా దేశాలలో భారత రాయబార కార్యాలయాలపై ఖలిస్తానీ మద్దతు దారులు దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. శాన్‌ఫ్రాన్సిస్కో రాయ‌బార కార్యాల‌యంపై దాడిని అక్క‌డి పోలీసులు ప‌ట్టించుకోలేదు. లండ‌న్‌లోనూ అదే జ‌రిగింది. అక్క‌డి భారత రాయబార కార్యాలయంపై దాడి చేసి భారత జాతీయ పతాకాన్ని దించేసి ఖలిస్తానీ జెండా ఎగ‌రేసినా పోలీసులు మౌనం వ‌హించారు.

భార‌త్ ఈ ఘ‌ట‌న‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకున్నాకే అమెరికా బ్రిట‌న్ రాయ‌బార కార్యాల‌యాల‌పై దాడుల‌ను అక్క‌డి ఉన్న‌తాధికారులు ఖండించారు. విదేశీ మ‌ద్ద‌తు కూడా ఉండ‌బ‌ట్టే అమృత్‌పాల్ మార్చి 18 నుంచి పోలీసుల క‌ళ్లుగ‌ప్పి త‌ప్పించుకోగ‌లిగాడు. నెల‌రోజుల త‌ర్వాత త‌నంత‌ట తానే లొంగిపోయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 29ఏళ్ల అమృత్‌పాల్‌సింగ్ దుబాయ్‌లో తన కుటుంబానికి చెందిన ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారంలో కొంతకాలం పనిచేసి ఖలిస్థాన్ కార్య‌క‌లాపాలు కొన‌సాగించే ల‌క్ష్యంతో భార‌త్‌కి తిరిగొచ్చాడు. వారిస్ పంజాబ్ దే సంస్థ చీఫ్ దీప్ సిధు 2022 ఫిబ్రవరిలో మరణించడంతో ఆయ‌న స్థానంలో కీల‌క నేత‌గా ఎదిగాడు అమృత్‌పాల్‌సింగ్‌. ఖలిస్థాన్ ఉద్యమాన్ని నడిపి ఆపరేషన్ బ్లూస్టార్‌లో హతమైన భింద్రన్‌వాలే పోలికల‌తో క‌నిపిస్తాడు అమృత్‌పాల్‌సింగ్‌. ఇందిరాగాంధీకి పట్టిన గతే హోం మంత్రి అమిత్‌షాకు పడుతుందని హెచ్చ‌రించి అంద‌రి దృష్టిలో ప‌డ్డాడు అమృత్‌పాల్‌. దీంతో అత‌న్ని ఇలాగే వ‌దిలేస్తే ఖ‌లిస్తాన్ ఉద్య‌మం బ‌ల‌ప‌డేలా ఉండ‌టంతో కేంద్రం కూడా సీరియ‌స్‌గా తీసుకుంది. కానీ అత‌ని అరెస్ట్‌తో వేర్పాటువాద భావ‌న పోతుంద‌నుకోలేం. దేశాన్ని విచ్ఛిన్నం చేయాల‌నుకునే శ‌క్తుల‌కు అమృత్‌పాల్‌లాంటి ఆట‌బొమ్మ‌లు దొర‌క‌డం పెద్ద క‌ష్ట‌మేం కాదు.