కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో బహిరంగసభ పెట్టారు. అందులో ఆయన బీఆర్ఎస్ సర్కార్ పై విమర్శలు చాలా చేశారు కానీ అందర్నీ ఓ అంశం మాత్రం విపరీతంగా ఆకర్షించింది. అదేమిటంటే ముస్లిం రిజర్వేషన్ల రద్దు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా ప్రకటించారు. ఇప్పటికే కర్ణాటకలో ఇలాంటి ప్రకటన చేశారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి ఇతర వర్గాలకు ఇస్తామని ప్రకటించారు. అధికారంలో ఉన్నారు కాబట్టి ఆదేశాలు కూడా ఇచ్చారు దీంతో కర్ణాటకలో గగ్గోలు రేగింది. మత రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. అయితే బీజేపీ వెనక్కి తగ్గలేదు. తెలంగాణలోనూ అదే ఫార్ములా వర్కవుట్ చేయడానికి రంగంలోకి దిగిపోయింది. అమిత్ షా తొలి బాణం వేశారు.
కర్ణాటకలో ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి కొద్ది రోజుల ముందు ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసింది. దాంతో పాటు రాష్ట్ర రిజర్వేషన్ కోటాలో కీలక మార్పులు చేసింది. ఎస్సీలకు 17శాతం రిజర్వేషన్లు పెంచడంతో పాటు లింగాయత్-వొక్కలిగ వర్గాలకు రిజర్వేషన్లు పెంచింది. ప్రభుత్వం రిజర్వేషన్ కోటాను 50 శాతం నుంచి 56 శాతానికి పెంచింది. ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేసి వారిని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అందించే పదిశాతం రిజర్వేషన్‌లో చేర్చింది. ముస్లింలకు కేటాయించిన రిజర్వేషన్ల స్థానంలో కొత్త వొక్కలిగ లింగాయత్ కేటగిరిలు సృష్టించి రెండుశాతం చొప్పున రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఎస్సీ రిజర్వేషన్లను 15 నుంచి 17 శాతానికి ఎస్టీ రిజర్వేషన్లు 3 నుంచి 7శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. కానీ ఈ అంశంపై సుప్రీంకోర్టులో పటిషన్లు దాఖలయ్యాయి. విచారణ జరిపిన సుప్రీంకోర్టు కొత్త రిజర్వేషన్ విధానం ఆధారంగా ఎలాంటి అడ్మిషన్ లేదా నియామకాలను కొనసాగించవద్దని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంటే అమలు చేయకూడదన్నమాటే.
తెలంగాణ సామాజిక స్థితిగతులకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలి అని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసంది. విద్యా పరంగా సామాజికంగా వెనుకబడిన ముస్లింలకు (బీసీ-ఈ) 4 శాతమే రిజర్వేషన్ అమలవుతున్నది. కానీ వారి జనాభా 12 శాతం కన్నా ఎక్కువ ఉన్నది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎస్టీల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి చెల్లప్ప కమిషన్‌ను ముస్లింల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి సుధీర్ కమిటీని బీసీల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి బీఎస్ రాములు నాయకత్వంలో బీసీ కమిషన్‌ను నియమించింది. ఆయా కమిషన్లు ఇచ్చిన నివేదికల ప్రకారం ఎస్టీలు వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వెనుకబడిన ముస్లింలకు 4 నుంచి 12 శాతానికి రిజర్వేషన్ పెంచుతూ తీర్మానం చేశారు. కానీ కేంద్ర ఏరిజర్వేషన్లనూ ఆమోదించలేదు కాబట్టి అమల్లోకి రాలేదు. ఇప్పటికీ ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని బీఆర్ఎస్ చెబుతూ ఉంటుంది. అయితే ఇటీవల ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతూ జీవో జారీ చేశారు కానీ ముస్లిం రిజర్వేషన్లను పెంచుతూ అలాగే జీవో మాత్రం జారీ చేయలేదు.
మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగపరంగా సాధ్యం కానప్పటికీ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను కల్పించారు. బీసీ–ఈ కేటగిరీలో ముస్లింలను చేర్చారు. నాలుగు శాతం రిజర్వేషన్లను 15 ముస్లిం ఉప కులాలకు వర్తింపజేశారు. అందులో ముఖ్యంగా అచ్చుకట్టల వాండ్లు, అత్తర్ సాయిబులు, ధోబీ ముస్లిం, ఫకీర్, గారడీ ముస్లిం, గోసంగి ముస్లిం, గుడ్డి ఎలుగువాళ్లు, హజామ్, నాయీ ముస్లిం, లబ్బి, పకీర్ల, ఖురేషీ, షేక్, సిద్ది, తురక కాశ, అగ్రవర్ణం కాని ఇతర ఉప కులాలను బీసీ–ఈ జాబితాలో చేర్చి రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. దీనిపై అప్పట్లో అనేక విమర్శలు వచ్చాయి. ఆ రిజర్వేషన్లు చట్ట విరుద్ధమని కోర్టుల్లో పిటిషన్లు పడ్డాయి. అయినప్పటికీ ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
ముస్లిం రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇతర వర్గాల్లో వ్యతిరేకతకు కారణం అవుతాయి. అయితే ముస్లింలలో అందరికీ రిజర్వేషన్లు అమలు కావడం లేదు. కొన్ని వర్గాలకు మాత్రమే ఆ అవకాశం ఉంది. ఇప్పటికీ ఓసీ ముస్లింలు ఉన్నారు. బాగా వెనుకబడిన వర్గాలను మాత్రమే రిజర్వేషన్ కేటగిరీలో చేర్చారు. ఇప్పుడు బీజేపీ ఈ మతపరమైన రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చింది. వారికి తగ్గించి ఇతరులకు ఇస్తామని చెప్పడం ద్వారా ఇతరులను ఆకట్టుకోవచ్చు. బీజేపీ మార్క్ హిందూత్వ వాదులనూ ఆకట్టుకోవచ్చు. అదే సమయంలో ఇప్పుడు బీఆర్ఎస్ ముస్లిం రిజర్వేషన్ల అంశంపై గట్టిగా మాట్లాడలేదు. మాట్లాడితే ముస్లింల ఓట్లు కొత్తగా వచ్చేది ఏమీ లేదు మజ్లిస్ పోటీ చేయకపోతే వచ్చే ఓట్లు మాత్రమే. అవి రిజర్వేషన్ వివాదం లేకపోయినా వస్తాయి కానీ అనుకూలంగా మాట్లాడితే మాత్రం మెజారటీ వర్గం దూరం అవుతుంది. బీజేపీ వస్తుందా రిజర్వేషన్లు తీసేస్తుందా అన్న విషయం పక్కన పెడితే ఈ అంశం వచ్చే ఎన్నికలకు హాట్ టాపిక్ అయితే బీజేపీకి మాత్రం ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుందని చెప్పక తప్పదు.