కంటతడితో రేవంత్ రెడ్డి మార్చిన రాజకీయం ఏమిటి

By KTV Telugu On 24 April, 2023
image

భాగ్యలక్ష్మి అమ్మవారి ముందు తడి బట్టలతో ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి ఆలయం బయ భావోద్వేగంతో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కంటతడి పెట్టుకున్నారు. వెంటనే తమాయించుకుని చేతకాక కాదు ఆవేదనతోనే కన్నీళ్లు వచ్చాయన్నారు. ఎందుకు ఆవేదన అంటే కేసీఆర్‌పై పోరాటానికి తాము జీవితాల్ని పణంగా పెడుతూంటే బీజేపీ నేత ఈటల రాజేందర్ మాత్రం తాను డబ్బులు తీసుకున్నానని ఆరోపిస్తున్నానంటున్నారు. అయితే ఈటల రాజేందర్ మాత్రం తాను అసలు రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని కాంగ్రెస్ పార్టీ అని అన్నానని రేవంత్ ఎందుకు ఇంత ఎమోషనల్ అయ్యాడని ఆశ్చర్యపోయారు. ఒక్క ఈటల రాజేందర్ మాత్రమే కాదు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఆశ్చర్యపోయారు. రేవంత్ రెడ్డి ఈటల చేసిన విమర్శలను ఎందుకంత సీరియస్ గా తీసుకున్నారు వెంటనే చాలెంజ్ చేశారు. ఆ వెంటనే భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర ఎందుకంత సీన్ చేశారని ఆశ్చర్యపోయారు. అయితే రేవంత్ చేసిన ఈ హడావుడి వెనుక అసలు కారణం వేరే ఉందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అది బీఆర్ఎస్‌ కాదు బీజేపీ కాదు. అంటే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో పైచేయి కోసం బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు అనే మాట వినిపించకుండా ఉండటం కోసం ఈటల రాజేందర్ కాంగ్రెస్ ను అన్న మాటల్ని తనకు అన్వయించుకుని రాజకీయం చేశారన్న అనుమానం ఎక్కువగా వినిపిస్తోంది.

మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ రూ. పాతిక కోట్లు ఇచ్చారని ఈటల రాజేందర్ ఆరోపించారు. అందుకే ఆ పార్టీ బలంగా ప్రయత్నించిందని ఆయన ఉద్దేశం. అయితే ఇక్కడ ఆయన రేవంత్ రెడ్డి ప్రస్తావన తీసుకురాలేదు కానీ రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. తాను కేసీఆర్ వద్ద రూ. పాతిక కోట్లు తీసుకున్నానని ఈటల ఆరోపించారని పైసా కూడా తీసుకోలేదని చాలెంజ్ చేసి ఆలయంలో ప్రమాణానికి సిద్ధమయ్యారు. రేవంత్ ఇలా తనను అనని మాటను తన మీద వేసుకోవడమే కాదు ప్రమాణానికి సిద్ధమయ్యారు. ఇది ఓ రకంగా క్లిష్టమైన రాజకీయ వ్యూహం కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకు మించి మార్గం లేదని రేవంత్ రెడ్డి అనుకుని ఉండవచ్చు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం ముందు రేవంత్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్‌లో కేసీఆర్‌పై తన పోరాటాన్నిబలంగా చెప్పారు. తనను ఎన్ని ఇబ్బందులు పెట్టారో చెప్పారు. భయం అనేది తన ఇంట్లోనే లేదని స్పష్టం చేశారు. తనన నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేశారని నొటొరియస్ క్రిమినల్స్ పెట్టె సెల్స్‌లో పెట్టారన్నారు. ఎన్ని కష్టాలు పడ్డామో ఆయన ఆవేదనా స్వరంగా గుర్తుచేసుకున్నారు. తనను కొనేవారు భూమిమీద పుట్టలేదని స్పష్టం చేయడమే కాదు చివరి రక్తపు బొట్టు వరకూ కేసీఆర్ ను గద్దె దించేందుకు పోరాడతానని స్పష్టం చేశారు.

తెలంగాణలో బీఆర్ఎస్‌తో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నాం అని మల్లిఖార్జున ఖర్గే ఓ ఇంగ్లిష్ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ నేరుగా ప్రకటించేశారు. కానీ అదే సమయంలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ పాతబస్తీలో భాగ్యలక్ష్మి ఆలయం వద్ద భీకరమైన ప్రకటనలు చేశారు. కేసీఆర్ పై పోరాటంలో జీవితాల్ని పణంగా పెడుతున్నామని గద్దె దించుతామని ప్రకటించారు. దేశ రాజకీయాల్లో ఇటీవల వస్తున్న మార్పుల ప్రకారం చూస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాహుల్ గాంధీపై అనర్హతా వేటు తర్వాత కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఐక్యతా సమావేశాల్లో బీఆర్ఎస్ నేతలు కూడా పాల్గొంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా బీఆర్ఎస్ పార్టీతో కలిసి వెళ్లడం గురించి ఆలోచిస్తోందని చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు చాలా మంది బీఆర్ఎస్ తో పొత్తు అవసరం అని వాదిస్తున్నారు. బీజేపీ గెలుపును అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కలవాలని అంటున్నారు. అందుకే ఆ రెండు పార్టీలు కలుస్తాయన్న ప్రచారం ఊపందుకుంటూడటంతో రేవంత్ రెడ్డికి ఉక్కపోత మొదలైంది. అందుకే ఈటల రాజేందర్ చేసిన ఆరోపణల్ని అడ్డం పెట్టుకుని ఆయన కేసీఆర్ పై పోరాటంలో తాము ఎంత తెగిస్తున్నామో హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఈటల మాటల్ని రేవంత్ వాడుకున్నారు. కేసీఆర్ తో పొత్తు అనే మాటలను రేవంత్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరు. ఆయన పోరాటం కేసీఆర్ తో ముడిపడి ఉంది. ఇటీవల తమ హైకమాండ్ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గుతోందని తెలిసి తాను పీసీసీ చీఫ్ గా ఉండగా పొత్తులు పెట్టుకునే అవకాశమే లేదని ప్రకటించారు. ఓ రకంగాఇది హైకమాండ్ ను బెదిరించడమే అంటున్నారు.

కేసీఆర్‌పై పోరాటంలో రేవంత్ రెడ్డిని ఎవరూ తక్కువగా అంచనా వేయలేరు. కేసీఆర్‌కు తెలంగాణలో ఎవరు ధీటైన నేత అంటే అత్యధిక మంది రేవంత్ రెడ్డి పేరే చెబుతారు. కానీ బీజేపీకి కేసీఆర్ ఇస్తున్న ప్రాధాన్యత వల్ల ఆ పార్టీ కూడా పోటీకి వచ్చిందన్న అభిప్రాయం ఉంది. అయినా రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో తనను కించపరుస్తున్నా పార్టీ గెలుపు కోసం ఆయన శ్రమిస్తున్నట్లుగా ఎవరూ కష్టపడటం లేదు. ఇవన్నీ ప్రజల ముందు ఉంచి కంటతడి పెట్టారు రేవంత్ రెడ్డి. అంటే సానుభూతి వ్యూహం కూడా అమలు చేశారన్నమాట. రేవంత్ రెడ్డి రాజకీయాల్ని ఊహించడం కష్టం. ఈటల తనను ప్రత్యేకంగా అనని మాటల్ని అన్నట్లుగా అన్వయించుకుని తన సందేశాన్ని ఇటు కాంగ్రెస్ హైకమాండ్‌కు ఇటు తెలంగాణ సమాజానికి పంపారని అనుకోవచ్చు.