పెళ్లిళ్లకు ముందు ప్రెగ్నెన్సీ టెస్టా.. మతిచెడిందా

By KTV Telugu On 26 April, 2023
image

పెళ్లంటే నూరేళ్ల పంట జీవితంలో ఒక్కసారే జరిగే మరచిపోలేని అపూర్వ ఘట్టం కానీ పేదింటికి అదే భారం. పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు పూటగడవని కుటుంబాలకు గుండెలమీద కుంపట్లే. ఆడబిడ్డని ఓ అయ్యచేతిలో పెట్టేసరికి వారి తలప్రాణం తోకకొస్తుంది. ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబాల ఆడబిడ్డల పెళ్లిళ్లకు దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలు ప్రకటించాయి. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోనూ కళ్యాణలక్ష్మి లాంటి స్కీం ఉంది. అయితే నిస్సహాయ కుటుంబాల అవసరాన్ని అక్కడి అధికారయంత్రాంగం పరిహసిస్తోంది. ఆడబిడ్డల ఆత్మాభిమానంతో చెలగాటమాడుతోంది. మధ్యప్రదేశ్‌ అధికారుల నిర్వాకం సమాజం తలదించుకునేలా చేసింది. పెళ్లి చేయమని వచ్చిన పేదింటి పిల్లలకు ఏకంగా ప్రెగ్నెన్సీ టెస్టులు చేయడం వివాదాస్పదంగా మారింది.

సీఎం కన్యా వివాహ్ యోజన. మధ్యప్రదేశ్‌లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసేందుకు తీసుకొచ్చిన ఈ స్కీం 2006నుంచి అమల్లో ఉంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా వేలాది మందికి ఈ పథకం కింద పెళ్లిళ్లు జరిగాయి. సంప్రదాయబద్ధంగా పెళ్లిళ్లు చేసి 56వేల రూపాయల ఆర్థిక సాయం కూడా చేసేవాళ్లు. ప్రజలు మెచ్చిన ఈ పథకంలో ఉన్నట్లుండి అధికారులు రూల్స్‌ మార్చేశారు. ఎప్పటిలాగే సామూహిక వివాహాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ వధువు పెళ్లి పీటలు ఎక్కే ముందు చేసిన ఓ పరీక్ష ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీసింది. పెళ్లికూతుళ్లకు ఏకంగా ప్రెగ్నెన్సీ టెస్ట్ నిర్వహించారు. పెళ్లి పీటలెక్కాల్సిన వారికి గర్భపరీక్షలేంటో బుర్రచెడిన అధికారులకే తెలియాలి. నెగిటివ్ రిపోర్ట్‌ వచ్చిన వాళ్లనరి పెళ్లికి అనుమతిచ్చారు. డిండౌరి జిల్లా గాడాసరయీలో 219 జంటలకు సామూహిక వివాహాలు జరిపించి ప్రెగ్నెన్సీ పాజిటివ్‌ వచ్చిన ఐదుగురికి పెళ్లి చేసేందుకు నిరాకరించి అర్హుల జాబితా నుంచి తొలగించారు.

కాబోయే భర్తతో పెళ్లికి ముందునుంచి కలిసి ఉంటున్నానని అందుకే తాను గర్భవతినయ్యానంటోంది ఓ యువతి. కలిసి బతికేందుకు జంట పరస్పర అంగీకారంతో ముందుకొచ్చాక అమ్మాయిలకు ఇలాంటి పరీక్షలు అనైతికమే. అమ్మాయిలను వారి కుటుంబాలను సమాజం ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నమే. సాయం చేస్తున్నామని శల్యపరీక్షలు చేయడం న్యాయమా అన్నది పేద కుటుంబాలనుంచి వస్తున్న ప్రశ్న. వయసు ధృవీకరణ కోసం ఫిజికల్ ఫిట్‌నెస్ చెక్ చేసేందుకు కొన్ని పరీక్షలు నిర్వహిస్తామని తమ చర్యలను అధికారులు సమర్థించుకుంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో అనుమానం ఉన్నవారికే ప్రెగ్నెన్సీ టెస్టులు చేస్తామంటున్నారు. అనుమానించడమే అవమానం అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. మధ్యప్రదేశ్ ఆడబిడ్డలను అవమానించడమేనని అక్కడి విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎవరి పైత్యమోగానీ ఓ మంచి పథకాన్ని భ్రష్టుపట్టిస్తోందక్కడి అధికారయంత్రాంగం.