బీజేపీతో టీడీపీకి అవసరమా.. టీడీపీతో బీజేపీకి అవసరమా

By KTV Telugu On 26 April, 2023
image

భారతీయ జనతా పార్టీకి ఆస్థాన చానల్ వంటి రిపబ్లిక్ టీవీ చంద్రబాబును తాము నిర్వహిస్తున్న సమ్మిట్‌లో మాట్లాడాల్సిందిగా పిలిచింది. ఆయన వర్చవల్‌గా వచ్చి మాట్లాడారు. ఆయనను ఆ టీవీ చానల్ యాంకర్లు దేశంలో మొదటి టెక్నోక్రాట్ సీఎం అని ప్రొరంభించి ఎన్నో విధాలుగా పొగిడారు. ఆ తరవాత చంద్రబాబు ప్రధాని మోదీని పొగిడారు. అసలు దేశానికి గుర్తింపు వచ్చింది ఆయనతోనే అన్నట్లుగా మాట్లాడారు. మోదీ విధానాలను సమర్థించారు. ఆ తర్వాత మోదీని సమర్థిస్తున్నారు కదా మరి ఎన్డీఏలో చేరుతారా అంటే మాత్రం చంద్రబాబు నేరుగా చెప్పలేకపోయారు. కాలం నిర్ణయిస్తుందన్నారు. ఒక వేళ చేరే ఉద్దేశం ఉన్నా చేరుతామని చెప్పడానికి అది సరైన వేదిక కాదు. అయితే ఇప్పుడు బీజేపీ వల్ల టీడీపీకి ఏంటి లాభం టీడీపీ వల్ల బీజేపీకి ఎంటీ లాభం అనే చర్చ సహజంగానే రాజకీయ వర్గాల్లో జరుగుతుంది.

దేశం మొత్తం మీద బీజేపీ అత్యంత బలహీనంగా ఉన్న రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పక తప్పదు. నోటా కంటే తక్కువ ఓట్లతో ఒక్క శాతం ఓట్లు కూడా తెచ్చుకోలేనంత దుర్భర పరస్థితిలో ఏపీ బీజేపీ ఉంది. లోకల్ ఎన్నికల్లో పట్టుమని పది పంచాయతీలు గెలిచేంత శక్తి లేదు. ఆ పార్టీతో పొత్తు వల్ల చంద్రబాబుకు టీడీపీకి వచ్చే లాభం ఏమీ లేదు. కానీ పొత్తు అంటే పెట్టుకుంటే టీడీపీ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ పొత్తును వ్యతిరేకించే వర్గాలు ఆ పార్టీకి దూరమవుతాయి. రెండు మూడు శాతం ఓట్లు తగ్గిపోయే ప్రమాదం ఉంది. అదే సమయంలో అర శాతం బీజేపీ ఓటర్లు కూడా టీడీపీ తో పొత్తు పెట్టుకున్నాం కదా అని టీడీపీకి ఓట్లు వేయరు. టీడీపీని సంస్థాగతంగా వ్యతిరేకిస్తారు ఆ పార్టీ ఓటర్లు. ఈ విషయం తెలియనంత అమాయకులేం కాదు టీడీపీ నేతలు. అందుకే ఏపీకి సంబంధించినంత వరకూ బీజేపీతో పొత్తుల గురించి వారు ఆలోచించకపోవచ్చు మరి చంద్రబాబు ఎందుకు మోదీని పొగుడుతున్నారు.

ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత చంద్రబాబు ఓ అంచనాకు వచ్చారు. అదేమిటంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరగకపోతే గెలవడం కష్టం అని. అలా జరగాలంటే వ్యవస్థలను భయపెట్టే అండ ఉండాలి ఆ అండ కేంద్ర ప్రభుత్వం. కేంద్రం తమకు మద్దతుగా ఉండకపోయినా వైసీపీకి సపోర్ట్ గా ఉండవద్దని కనీసం న్యూట్రల్ గా అయినా ఉండాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. తాము బీజేపీకి మోదీకి శత్రువులం అయితే అలా చూసే చాన్స్ లేదు. అందుకే తాము హితులమే అని చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్ లో ఆ వ్యాఖ్యలు చేశారు.

కారణం ఏమైనా కానీ నమ్మకమైన మిత్రపక్షాలు బీజేపీకి లేకుండా పోయారు. ఎన్డీఏ అనేది ఉన్నా లేనట్లే ఉంది. ముఖ్యగా సౌత్ నుంచి నమ్మకమైన మిత్రులు ఆ పార్టీకి అవసరం. బీజేపీ రెండు సార్లు పూర్తి మెజార్టీతో అధికారంలోకి రావడానికి కారణం ఉత్తరాది హిందీ రాష్ట్రాలు. అక్కడ 95 శాతం సీట్లు సాధించడం ద్వారానే ఢిల్లీ పీఠం దక్కింది. దక్షిణాదిపై ఆ పార్టీకి ఆశలు లేవు. కర్ణాటకలోనూ ఎదురుగాలి వీస్తోంది. అందుకే ఇప్పుడు బీజేపీకి నమ్మకమైన మిత్రపక్షం కావాలి. వైసీపీతో ఇప్పుడు బీజేపీ అంట కాగుతోంది. వైఎస్ఆర్‌సీపీ ప్రాధాన్యాలు వేరుగా ఉంటాయి. నేరుగా కలవదు నేరుగా వైసీపీ బీజేపీతో పొత్తులు పెట్టుకుంటే ఆత్మహత్యా సదృశమే. ఎందుకంటే జగన్ ఓటు బ్యాంక్ పూర్తిగా దూరమైపోతుంది. అలాగే ఎన్నికలైన తర్వాత మద్దతు కూడా ఖచ్చితంగా అవసరం అయితే జగన్ ఈక్వేషన్స్ వేరుగా ఉంటాయి. వారి ప్రయోజనాలు నెరవేర్చే వారి వైపే ఉంటుంది. అదే టీడీపీ అయితే నేరుగా ఎన్డీఏలో చేరిపోతుంది.

2014లో బీజేపీతో కలిసి గెలిచిన చంద్రబాబు 2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్ తో కలిసి ఘోర పరాజయం పాలయ్యారు. తర్వాత చంద్రబాబు భారతీయ జనతా పార్టీ విషయంలో పూర్తిగా సైలెంట్ అయ్యారు. జాతీయ రాజకీయాల జోలికి కూడా వెళ్లలేదు ఇప్పుడు బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే చర్చా కార్యక్రమానికి పిలిచి మాట్లాడించిన టీవీచానల్ చర్చ తర్వాత గ్యాప్ పిల్ చేసుకోవడానికి అవకాశం కల్పించారంటూ ఇంగ్లిష్ చానల్‌కు కృతజ్ఞతలు కూడా చెప్పారు. ప్రత్యేకహోదా విషయంలో మాత్రమే విబేధించాం ఇక అన్ని విషయాల్లోనూ మోదీ విధానాలను సమర్థిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నేరుగా ప్రకటించారు. ఇప్పుడు ఎన్డీఏలో చేరితే ఆ హోదా గురించి మాట్లాడలేరనే అర్థం. అందుకే బీజేపీ టీడీపీ విషయంలో కాస్త సాఫ్ట్ గా ముందుకెళ్తున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇటీవల అండమాన్‌లో మేయర్ పోస్టును పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించి బీజేపీ. అక్కడ టీడీపీకి ఉంది రెండే రెండు సీట్లు. అయినా మేయర్ సీటు ఇచ్చింది. బీజేపీ అధ్యక్షుడు నడ్డా ట్విట్టర్‌లో టీడీపీ బీజేపీ కూటమికి శుభాకాంక్షలు అని ప్రకటించేశారు.

రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు లేదా శత్రువులు ఉండరు. రాజకీయాలు ఉన్నంత వరకూ ఈ నానుడి నిజమవుతూనే ఉంటుంది. టీడీపీ బీజేపీ విషయంలోనే కాదు. ఏ విషయంలో అయినా సరే. మరోసారి ఎన్నికలకు ముందు ఇది పలుమార్లు నిరూపితం అయ్యే అవకాశం కనిపిస్తోంది.