ఆఫ్రికాదేశం సూడాన్ లో సైనిక నియంతల మధ్య ఆధిపత్యపోరు పెను సంక్షోభానికి దారి తీసింది. దేశాన్ని యుద్ధభూమిగా మార్చేసిన ఆర్మీలోని రెండు వర్గాలు బాధ్యతారహితంగా కాల్పులకు తెగబడుతున్నాయి. ఈ హింసలో వందలాది మంది తలలు వాల్చేశారు. వేలాది మంది క్షతగాత్రులయ్యారు. వివిధ దేశాల ప్రజలు ప్రాణాలరచేతుల్లో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. అమెరికా జోక్యంతో సైన్యంలోని రెండు వర్గాలూ మూడురోజుల పాటు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి. ఈలోపు పరిస్థితిని చక్కదిద్దాలని ఐక్యరాజ్యసమితి భావిస్తోంది. ఆఫ్రికా ఖండంలోనే మూడో అతి పెద్ద దేశం సూడాన్. ఆఫ్రికాలో అత్యంత పేద దేశం సూడానే. అటువంటి నిరుపేద దేశంలో ఇపుడు యుద్ధ వాతావరణం సామాన్య ప్రజల జీవితాలను దుర్భరం చేసేసింది. సైన్యంలోని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు దేశంలో అంతర్యుద్ధాన్ని తలపిస్తోంది. నిజానికి ఇది అంతర్యుద్ధం కాదు. సైనిక నియంతల్లోనే ఇద్దరి భేషజాల మధ్య ఇద్దరి అధికార దాహం మధ్య రగులుతోన్న యుద్ధకాంక్ష మాత్రమే ఇది.
కొద్ది రోజులుగా సూడాన్ రాజధాని ఖర్టోమ్ తో పాటు పలు నగరాలు హింసాయుత ఘటనలతో మార్మోగుతున్నాయి.
సూడాన్ ఆర్మీ ఫోర్స్-రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య యుద్దం రెండు దేశాల ఆర్మీల మధ్య యుద్ధంగా సాగుతోంది.
అది పెను విధ్వంసాలు సృష్టిస్తోంది. ఇద్దరికీ అధికారోమే కావాలి. ఇద్దరికీ పెత్తనం తప్ప ఇంకేమీ అవసరం లేదు. అందుకోసం ఎంతమంది బలైపోయినా ఫర్వాలేదనే ఇద్దరూ అనుకుంటున్నారు. రాకాసి నియంతల దుర్మార్గ ఆకాంక్షలు సూడాన్ ప్రజల పాలిట శాపాలుగా మారాయి. ఏ క్షణంలో ఎటు వైపు నుండి ఏ బాంబు మీద పడుతుందో తెలీదు. ఏ గ్రనేడ్ ఏ ఇంటిని పేల్చేస్తుందో తెలీదు. ఎప్పుడు ఎవరు తలలు వాల్చేస్తారో తెలీదు. సైనిక వర్గాల మధ్య యుద్ధంలో ఏమీ తెలీని అమాయకులు నలిగిపోతున్నారు. నియంత సైనికాధికారులు చెరో వైపు నుండి యుద్దాన్ని రాజేసి దేశాన్ని వల్లకాడుగా మారుస్తున్నారు. ఉన్న సంక్షోభం చాలదన్నట్లు మరింత విపత్తును కొని తెస్తున్నారు. మంటలు రాజేసి చలి మంటలు కాచుకుంటున్నారు. రెండు వర్గాల మధ్య కాల్పుల ఘటనల్లో ఇంత వరకు 420మందికి పైగా మరణించారు. నెత్తుటి గాయాలతో వేలాది మంది ఆసుపత్రుల పాలయ్యారు. దాదాపు 3700 మంది తీవ్ర గాయాలతో మూలుగుతున్నారు.
ఆర్మీ బాధ్యతారహితంగా పేట్రేగిపోవడంతో చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తాగు నీరు అందడం లేదు. ఔషధాలు అందుబాటులో లేవు. ఆహార పదార్ధాలు లేవు. ఎక్కడ చూసినా ఆకలి కేకలే. చిన్న జబ్బు వచ్చినా గాల్లో దీపం పెట్టి దేవుడా నీదేభారమని ఓ దండం పెట్టి ఊరుకోవడమే. ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. బయటకు వెళ్తే తిరిగి ప్రాణాలతో ఇంటికి వెళ్తామన్న గ్యారంటీ లేదు. రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ కమాండర్ చీఫ్ మహ్మద్ హందాన్ డగాలో ఒక వైపు ఆర్మీ చీఫ్ అబ్దెల్ ఫతా అల్ బుర్హాన్ మరో వైపు నిలబడి దేశాన్ని నిప్పుల కొలిమిలోకి నెట్టేస్తున్నారు. జనం పెడబొబ్బలు పెడుతోంటే తమాషా చూస్తున్నారు. సూడాన్ లో సంక్షోభం మొదలు కావడంతోనే ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. సూడాన్ లో నివసిస్తోన్న తమ పౌరుల క్షేమం కోసం తపించాయి. యుద్ధభూమిగా మారిన సూడాన్ నుండి తమ తమ పౌరులను తమ దేశాలకు సురక్షితంగా తరలించేందుకు ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. సముద్ర మార్గం భూమార్గాల ద్వారా తమ పౌరులను వెనక్కి తీసుకెళ్తున్నాయి.
దేశ రాజధాని ఖార్టోమ్ లో వివిధ దేశాల రాయబార కార్యాలయాల వద్ద అధికారులు తమ పౌరుల తరలింపునకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ప్రత్యేక విమానాలు ఓడలను సైతం ఆ దేశాలు సిద్ధం చేశాయి. తమ పౌరులను రక్షించి తరలించేందుకు అమెరికా ఇంగ్లాండ్ దేశాలు యుద్ధ విమానాలతో పాటు ప్రత్యేక ఆర్మీ దళాలను పంపాయి. సౌదీ అరేబియా ఫ్రాన్స్ వంటి దేశాలు తమ దేశ పౌరులతో పాటు వివిధ దేశాలకు చెందిన పౌరులను సురక్షితంగా సూడాన్ నుండి బయటకు తరలించాయి. అందులో కొద్దిమంది భారతీయులు కూడా ఉన్నారు. సూడాన్ లో నాలుగు వేల మందికి పైగా భారతీయులు ఉన్నారు. వారిని సురక్షితంగా భారత్ కు తరలించేందుకు మోదీ ప్రభుత్వం అన్ని విధాలా సమాయత్తమైంది. ఇందుకోసం ఉన్నతాధికారులతో భేటీ అయిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రతీ ఒక్క భారతీయునీ క్షేమంగా దేశానికి తీసుకురావాలని సూచించారు. భారతీయులను తరలించేందుకు ఆపరేషన్ కావేరిని రూపొందించారు. బుర్హాన్- డగాలో వర్గాలు రెండూ కూడా 72 గంటల పాటు కాల్పుల విరమణకు ఒప్పుకున్నారని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ప్రకటించారు. ఏప్రిల్ 24 అర్ధరాత్రి తో ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిందని ఆయన చెబుతున్నారు.
సూడాన్ సంక్షోభానికి 2019లోనే బీజం పడింది. సూడాన్ లో 1989 నుండి పాలనా పగ్గాలను తన గుప్పెట్లో ఉంచుకుని ఒమర్ అల్ బషీర్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది. ఆర్మీ బ్రిగేడియర్ గా 1989లో అవతరించిన నాటి నుండి దేశాన్ని శాసిస్తూ వచ్చాడు బషీర్. ఎన్నో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి బషీర్ మీద. ఆర్మీలో కొందరు అధికారులను గుప్పెట్లో పెట్టుకుని సాదిక్ అల్ మెహదీ ప్రభుత్వాన్ని గద్దె దించి ఆ సింహాసనంపై తాను కూర్చున్నాడు బషీర్. బషీర్ గద్దె దిగాల్సిందేనంటూ ప్రజలు ఆందోళనలకు దిగారు. అవి కాస్తా ఉధృత రూపు దాల్చాయి. ఆ సమయంలోనే సైనికాధికారులు ఒక కుట్ర ప్రకారం తిరుగుబాటు చేసి 2019లో బషీర్ ను గద్దె దింపారు. సూడాన్ ప్రజలు కోరుకున్నది కేవలం బషీర్ ను గద్దె దింపడం ఒక్కటే కాదు. అతని స్థానంలో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నాలుగు నెలల తర్వాత సైనికాధికారులు ఆందోళనకారుల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం మిలటరీ ప్రతినిథులు పౌర ప్రతినిథులతో కూడిన ఒక సార్వభౌమధికార కౌన్సిల్ ను ఏర్పాటు చేశారు. పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించే బాధ్యతను కౌన్సిల్ కు అప్పగించారు. 2023 ముగిసే లోపు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు తాత్కాలిక ప్రధానిగా అబ్దల్లా హందాక్ ను నియమించారు.
అయితే ఈ ఒప్పందం కేవలం మూణ్నాళ్ల ముచ్చటే అయ్యింది. 2021 అక్టోబరులో సైనికాధికారి బుర్హాన్ ఆర్మీని తన గుప్పెట్లో పెట్టుకుని హందాక్ ను పదవి నుంచి తప్పించి తానే పాలకుడి అవతారం ఎత్తాడు. ఈ ఆపరేషన్ లో బుర్హాన్ కు భాగస్వామిగా ఉన్న మరో సైనికాధికారి డగాలో కొత్త ప్రభుత్వంలో నెంబరు టూగా అవతరించాడు. కాల క్రమంలో సూడాన్ ఆర్మీకి రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ కి మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. 2019లో మానవ హక్కులు ఉల్లంఘించి 120 మందికి పైగా ఆందోళన కారులను హతమార్చారన్న ఆరోపణలపై ఆర్మీకే చెందిన రెండువర్గాల మధ్య తేడాలు వచ్చాయి. 2021 కుట్ర తర్వాత తేడాలు పెరుగుతూ వచ్చాయి. 2021 నుండి సూడాన్ లో ప్రజాస్వామిక వాదులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఆర్మీలోని రెండు వర్గాల మధ్య నెలకొన్న సంఘర్షణ పెను సవాళ్లను విసురుతోంది. పరిస్థితి మరింతగా దిగజారితే భారీ మూల్యం చెల్లించక తప్పదని మేథావులు ఆందోళన చెందుతున్నారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న సూడాన్ ఆర్ధిక వ్యవస్థ దీంతో కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆర్ధికంగా మరింత పతనం చెందితే కోలుకోవడానికి కొన్ని దశాబ్ధాలు పడుతుందని వారు అంటున్నారు. అందుకే అందరూ సంయమనం పాటించాలని వారు సూచిస్తున్నారు.