వేడెక్కిన కర్ణాటక- పార్టీల వ్యూహాలు.. నేతల తంత్రాలు

By KTV Telugu On 26 April, 2023
image

కర్నాటక ఎన్నికల్లో సవాలక్ష అంశాలు ప్రభావం చూపనున్నాయి. ఓటర్లను అయోమయంలోకి నెట్టేయనున్నాయి. ఒక్కో పార్టీదీ ఒక్కో వ్యూహం. ఒక్కో నేతదీ ఒక్కో రకమైన తంత్రం. ఉచిత హామీలు ఆకర్షిస్తున్నాయి. అవినీతి ఆరోపణలు జోరెత్తుతున్నాయి. తిరుగుబాటు అభ్యర్ధులు పార్టీలను భయపెడుతున్నారు. పాలు కూడా కంగారు పెడుతున్నాయి. ఏఅంశం ఏ పార్టీ కొంపలు ముంచుతుందో తెలీని పరిస్థితి. ఏ హామీ ఏ పార్టీని అందలం ఎక్కిస్తుందో చెప్పలేని స్థితి. మొత్తానికి కాంగ్రెస్ బిజెపిలతో పాటు జేడీఎస్ కూడా ఓటర్లకు గేలం వేయడానికి అంది వచ్చే ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కర్ణాటకలో రాజకీయం వేడెక్కుతోంది. ఈసారి ఎన్నికల్లో ఉచితాలు కీలకపాత్ర పోషించబోతున్నాయి. కాంగ్రెస్‌ బీజేపీ పోటాపోటీగా హామీల వర్షం కురిపించాయి. ప్రతి గృహిణికి నెలకు 2వేలు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటిస్తే దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు నెలకు 3వేల అందిస్తామంటోంది బీజేపీ. పేద మహిళలకు నెలకు 2వేలు జీవన భృతి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తదితర వాగ్దానాలు చేసింది జేడీఎస్‌. తొలిసారి రాష్ట్రంలో ఎన్నికల బరిలో దిగుతున్న ఆప్ కూడా ఏమీ వెనకబడలేదు. ఉచిత విద్యుత్ తాగునీరు సాగు రుణ మాఫీ పట్టణ ప్రాంత మహిళలకు ఉచిత బస్ పాస్ వంటి హామీలు గుప్పించింది.

బొమ్మై ప్రభుత్వ అవినీతే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద అంశం అంటోంది కాంగ్రెస్‌. 40శాతం కమిషన్ సర్కారు అంటూ బలంగా ప్రచారం చేస్తోంది. పేసీఎం వంటి క్యాంపెయిన్స్‌తో ప్రజల్లోకి వెళ్తోంది. దీనికి కౌంటర్‌గా కర్ణాటక కాంగ్రెస్ ATM అంటూ ఎదురుదాడి చేస్తోంది బీజేపీ. ఇక నందిని వర్సెస్ అమూల్ వివాదం కూడా కర్ణాటక ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది. కర్నాటక రైతులను దెబ్బ తీసేందుకే గుజరాత్ కు చెందిన అమూల్ పాలను తీసుకు వచ్చారని కాంగ్రెస్ జేడీఎస్ లు దుయ్య బడుతున్నాయి. పాలకి ఏ పాపం తెలీదని బిజెపి అమాయకంగా అంటోంది. దీనిని ఓట్లుగా మార్చుకునేందుకు గట్టిగానే పోరాడుతున్నాయి కాంగ్రెస్‌ జేడీఎస్‌. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ స్వయంగా నందిని పాల బూత్‌కు వెళ్లడం వైరల్ అయ్యింది. ఎన్నికల వేళ బీజేపీ సర్కారు వ్యూహాత్మకంగా రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిపింది. ముస్లింలకున్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేయడమే గాక బలమైన సామాజిక వర్గాలైన లింగాయత్లు ఒక్కలిగలకు చెరో 2 శాతం చొప్పున బదలాయించింది. ఊహించినట్టే ముస్లింల నుంచి దీనిపై భారీ నిరసన ఎదురైనా ఈ ఎత్తుగడ హిందూ ఓట్లను తనకు అనుకూలంగా సంఘటితం చేస్తుందని బీజేపీ నమ్ముతోంది. అయితే కేవలం ఎన్నికల సమయంలో ప్లే చేసిన ఈ ట్రిక్కును ప్రజలు నమ్ముతారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ అంశాలన్నీ ఒక ఎత్తైతే తాజా ఎన్నికల్లో రెబల్స్ అత్యంత కీలకంగా మారారు. బీజేపీ 20కి పైగా నియోజకవర్గాల్లో తిరుగుబాటును ఎదుర్కొంటోంది. సీనియర్లు సిట్టింగులను పక్కనపెట్టి కొత్తవారికి చాన్స్ ఇవ్వడం కమలదళాన్ని కష్టాల్లోకి నెట్టింది. కాంగ్రెస్‌కు కూడా కొన్నిచోట్ల రెబల్స్‌ ఉన్నారు. మొత్తం 918 మంది స్వతంత్రులుగా ఎన్నికల బరిలో ఉన్నారు. వీరి ఎవరు ఓటు చీలుస్తారో ఎవరి కొంప ముంచేస్తారో అర్థంకాక పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. రెబల్ అభ్యర్ధులు ఎవరిని ముంచుతారో తెలీదు. బిజెపిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ లో చేరిన వారిని ప్రజలు ఆశీర్వదిస్తారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అవినీతి పరులను పక్కన పెట్టి కొత్త అభ్యర్ధులకు అవకాశం ఇచ్చిన బిజెపినే అందలం ఎక్కిస్తారని బిజెపి వ్యూహకర్తలు నమ్ముతున్నారు. జేడీఎస్ కి మాత్రం తిరుగుబాట్ల బెడద లేదు. ఉన్న బెంగంతా ఒక్కటే వొక్కళిగ ఓట్లలో వాటాకి కాంగ్రెస్ తో పాటు బిజెపి కూడా పోటీ పడితే అది అంతిమంగా తన కొంపలు ముంచుతుందా ఏంటి అని జేడీఎస్ నాయకత్వం భయపడుతోంది. చూడాలి ఏం జరుగుతుందో.