దేశంలో మళ్లీ కోటా చర్చ.. రిజర్వేషన్లు కొనసాగించాలా వద్దా

By KTV Telugu On 27 April, 2023
image

తెలంగాణలో అధికారానికి వస్తే ముస్లింలకున్న నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఒవైసీ చేతిలో కేసీయార్ కీలుబొమ్మగా మారి రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం సందర్భంగానూ షా అదే మాట చెప్పారు. ముస్లిం రిజర్వేషన్లను తెలంగాణ ప్రభుత్వం 12 శాతానికి పెంచాలని భావిస్తున్న తరుణంలో షా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పైగా కర్ణాటక ప్రభుత్వం ముస్లిం కోటాను రద్దు చేసిన నేపథ్యంలో కేసు సుప్రీం కోర్టు పరిశీలనలో ఉంది. మే 9 వరకు కర్ణాటకలో 4 శాతం ముస్లిం కోటాను రద్దు చేయకూడదని సుప్రీం కోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అమిత్ షా ప్రకటన ముస్లిం రిజర్వేషన్ రద్దు కోసం కాదని, మొత్తం రిజర్వేషన్ వ్యవస్థనే రద్దు చేయాలన్న సంకల్పం అందులో ఉందని చాలారోజులుగా వినిపిస్తున్నదే. రిజర్వేషన్ రద్దు బీజేపీ ఆరెస్సెస్ రహస్య అజెండాలో భాగమేనని దళిత్ సోషన్ ముక్తి మంచ్ ఉపాధ్యక్షురాలు సుభాషినీ అలీ తరచూ ఆరోపిస్తున్నారు. పైగా ఇంతవరకు పార్లమెంటు చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు నోచుకోలేదు.

అమలు చేసిన ఏడు దశాబ్దాల తర్వాత కూడా రిజర్వేషన్లు అవసరమా అన్న ప్రశ్న తరచూ వినిపిస్తున్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలో సామాజిక న్యాయం కోసం రిజర్వేషన్లు అమలు చేశారు. నిజానికి 19వ శతాబ్దంలోనే కొల్హాపూర్ జమీందర్ బ్రాహ్మణేతరుల కోసం రిజర్వేషన్లు పెట్టారు. స్వాతంత్య్రం తర్వాత 1950లో ఎస్సీ ఎస్టీలకు కలిపి 20 శాతం రిజర్వేషన్ ఉండొచ్చని రాజ్యాంగ అధికరణం 15లో పొందుపరిచారు. తర్వాత దాన్ని ఎస్సీలకు 15 శాతం ఎస్టీలకు 7.5 శాతంగా సవరించారు. తర్వాతి కాలంలో ఓబీసీ రిజర్వేషన్ వచ్చి చేరింది. వెనుకబడిన తరగతులకు రాష్ట్రాల్లో రిజర్వేషన్ అమలు చేసుకునే అధికారం ఉందని కేంద్రం 1950ల్లోనే ప్రకటించింది. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సుప్రీం కోర్టు 1992లో ప్రకటించింది. ఆర్థికంగా వెనుకబడిన వారికి పది శాతం రిజర్వేషన్ కల్పించే 103వ రాజ్యాంగ సవరణను సుప్రీం కోర్టు గతేడాది నవంబరు 7న ఆమోదించింది. మరో పక్క తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో రిజర్వేషన్ 50 శాతం దాటిపోయి 69 శాతం వద్ద కొనసాగుతోంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ కర్ణాటకలో మాత్రమే ముస్లిం రిజర్వేషన్ ఉంది. అంటే అది దక్షిణాదికే పరిమితమైందని కూడా అనుకోవచ్చు. నిజానికి రిజర్వేషన్లకు సంబంధించిన వ్యాజ్యాలు వేర్వేరు కోర్టుల్లో విచారణలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్ తో పాటు ఎస్సీ వర్గీకరణ కూడా ఒక చర్చనీయాంశంగానే కొనసాగుతోంది. పొరుగు రాష్ట్రంలో మరాఠా రిజర్వేషన్ కూడా ఒక సమస్యగానే ఉంది.

మరాఠా కులాన్ని ఓబీసీల్లో చేరుస్తూ విద్య,ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం 2019లో చట్టం చేసింది. దీని వల్ల ఆ రాష్ట్రంలో రిజర్వేషన్లు 60 శాతం దాటాయి. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పుకు ఇది విరుద్ధమంటూ కొన్ని బీసీ సంఘాలు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాయి. దీనిపై ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిగినప్పుడు అనేక ఆసక్తికర ప్రశ్నలు తలెత్తాయి. 70 ఏండ్లుగా ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా ఏ ఒక్క బీసీ కులం కూడా అభివృద్ధి చెందలేదా అని ధర్మాసనం ప్రశ్నించినప్పుడు న్యాయవాదులు సమాధానం చెప్పలేకోపోయారు. అభివృద్ధి చెంది ఉంటే ఆ కులాలను కోటా నుంచి తప్పించాల్సిన అవసరం ఉందని 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తూ పోతే సమాజంలో అసమానతలు రావన్న గ్యారెంటీ ఏమిటని కోర్టు ప్రశ్నించింది.పైగా రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని 1992లో ఇందిరా సహానీ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కూడా గుర్తుచేసింది.

శతాబ్దాలుగా సామాజిక అన్యాయానికి గురైన కొన్ని కులాల అభ్యున్నతికి వారిని అందరితో సమానంగా ఉంచేందుకు రిజర్వేషన్ వ్యవస్థను ప్రవేశ పెట్టారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. తొలుత పది సంవత్సరాల వరకే రిజర్వేషన్ అమలులో ఉంటుందని ప్రకటించారు. తర్వాత పొడిగిస్తూ వెళ్లారు. వీపీ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు 1989లో మండల కమిషన్ సిఫార్సుల ఆధారంగా రిజర్వేషన్లను దాదాపుగా శాశ్వతం చేయడంతో పాటు సరికొత్త రిజర్వేషన్లు కూడా పుట్టుకు వస్తున్నాయి. వాస్తవానికి గ్రామీణ పేదరికం అంటరానితనం ప్రజల్లో అసమానతలు పోగొట్టేందుకు రిజర్వేషన్లు అమలు చేశారు. దేశం స్వాతంత్య్రం పొందిన రోజుల్లో ఉన్న వెనుకబాటుతనం వేరు. మారిన పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు దేశం అభివృద్ధి చెందిన తర్వాత కూడా రిజర్వేషన్లు అమలు చేయడం సహేతుకం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకప్పుడు పేద సామాజిక వర్గాలకు శక్తిసామర్థ్యాలు లేవు. అభివృద్ధి దిశగా అడుగులు వేసే మార్గాలు వారికి తెలీదు. విద్యాసంస్థలు అందుబాటులో లేవు. ఇప్పుడు సీన్ మారింది. ప్రజలు తమను తాము అభివృద్ధి చేసుకునేందుకు అవసరమైన సాధనాలు ఇప్పుడు బాగానే అందుబాటులో ఉన్నాయి.

ప్రస్తుతం రిజర్వేషన్ల కంటే స్కాలర్ ఫిప్స్ కోచింగ్ క్లాసెస్ రవాణా సౌకర్యాలు మెరుగు పరచడం లాంటి చర్యలు అందుబాటుకు తెస్తే రిజర్వేషన్లతో పనే ఉండదని విద్యా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పైగా రిజర్వేషన్ ఒక తిరోగమన విధానమని పలు సందర్భాల్లో నిరూపితమైంది. సామాజిక దూరాన్ని పెంచేవిగా మాత్రమే ఉన్నాయని జనం ఒకరితో ఒకరు కలిసిపోలేకపోతున్నారని చర్చ జరుగుతోంది. రిజర్వేషన్ల కారణంగా ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ ఐఐటీల్లో చోటు దొరక్క ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ప్రవేశ పరీక్షల కోచింగ్ కోసం రాజస్థాన్ నగరం కోటా వెళ్లి చదువుకునే విద్యార్థుల్లో కమాన్ కేటగిరిలో సీటు రాదన్న భయంతో ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అలాంటి పరిస్తితి లేకుండా చూడాలంటే ఉన్న సీట్లలన్నింటికీ ఓపెన్ కాంపిటీషన్లో ఎంపిక జరగాలని కొందరు వాదిస్తున్నారు. అసలు ప్రస్తుత దశాబ్దంలో రిజర్వేషన్లే అవసరం లేదన్న చర్చ కూడా కొన్ని వర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్లు వెళ్లిపోయే నాటికి ఇండియాలో అన్ని క్లరికల్ జాబ్సే ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు అన్ని టెక్నికల్ జాబ్స్ వచ్చాయి. ప్రభుుత్వోద్యోగాలు తగ్గి ప్రైవేటు రంగంపై ఆధారపడాల్సిన అనివార్యత ఏర్పడింది. ఇంజనీరింగ్, టెక్నాలజీ, స్టార్టప్ రంగాల్లో ఉద్యోగావకాశాలు బాగా పెరిగాయి. అక్కడ ఇప్పటి వరకు రిజర్వేషన్ లేదు.

ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్ అమలు జరపాలని రాజకీయ పార్టీలు కోరడం కూడా అందుకేనని కొందరి వాదన. ఎందుకంటే నేతలకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం కదా. విద్యా ఉపాధి రంగాల్లో గణనీయమైన మార్పు వచ్చింది. చదువులు అంటే ఇంజనీరింగేనన్న అభిప్రాయమూ వచ్చేసింది. ఒకప్పుడు విద్యార్థుల్లో డ్రాపవుట్స్ ఎక్కువగా ఉండేవి. ఇప్పుడా పరిస్థితి లేదు అందరూ కనిష్టంగానైనా చదువుకుంటున్నారు. ఆన్ లైన్ బోధన ద్వారా త్వరగా చదువు పూర్తి చేసే అవకాశాలసు మెరుగు పడ్డాయి. రాళ్లు కొట్టే నీళ్లు మోసే ఉపాధి తగ్గిపోయి టెక్నాలజీ ఆధారిత ఉద్యోగాలు వచ్చేశాయి. పైగా మనిషి తక్కువగా పనిచేసి యంత్రాలు ఎక్కువగా పనిచేస్తూ అందరికీ వెసులుబాటు కలిగించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా విస్తరిస్తోంది. రోబోలు చక చకా పనిచేసుకుంటూ పోతే దానికి తగ్గట్టుగా మనిషి మేథస్సుకు పదును పెట్టే ప్రక్రియ చాలా అవసరం .అలాంటి సందర్భాల్లో ఉపాధి ఉద్యోగాలు మెరిట్ ఆధారంగా కల్పించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం ప్యక్తమవుతోంది.

చాలా రోజులుగా ఒక వాదన ప్రచారంలో ఉంది. ఒక కుటుంబానికి ఒక సారి మాత్రం రిజర్వేషన్ వర్తింపజేయాలన్న చర్చ పారలల్ గా జరుగుతున్నదే కాకపోతే జనం ఓప్పుకోరంతే. ఒక వ్యక్తి ఉద్యోగంలో ఉన్నత శిఖరాలకు చేరుకున్న తర్వాత ఆయన కుటుంబానికి రిజర్వేషన్ ఎందుకని కొందరు ప్రశ్నిస్తుంటారు. అదీ వెనుకబడిన కుటుంబం ఎందుకు అవుతుందనే చర్చ ఉత్పన్నమవుతుంది. కాకపోతే అలాంటి కుటుంబాలు దేశంలో అతి స్వల్పంగా ఉంటాయి. ఒక వ్యక్తి బాగుపడినంత మాత్రాన తర్వాతి తరాలకు ఇబ్బందులు లేవని కూడా చెప్పలేం. ఎందుకంటే ఇప్పటికీ కులాల కుమ్ములాటలు కొన్ని కులాలను వేరుగా చూడటం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. పైగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ నేటికీ బీసీ కులాలు వెనుకబడే ఉన్నాయి. రిజర్వేషన్లు సక్రమంగా అమలై ఉంటే కొన్ని కులాలైనా బాగా అభివృద్ధి చెంది ఉండాలి. బీసీల్లో ఒక్క కులం కూడా ఓసీ స్థాయికి చేరిందని చెప్పలేని పరిస్థితి. ముస్లింలలోనూ అదే దీనస్థితి కనిపిస్తుంది. దూదేకులతో పాటు చర్మకారులు అత్తరు విక్రయించే వారు లాంటి ఉప కులాలు బాగా వెనుకబడి ఉన్నాయి. మరో పక్క ఆదాయ పెరుగుదల విషయంలో ఎస్సీ ఎస్టీల కంటే ముస్లింలు మెరుగ్గా ఉన్నట్లు తెలిసినప్పటికీ ఓటు బ్యాంకు రాజకీయాలతో వారికి రిజర్వేషన్ కల్పించాలన్న ప్రతిపాదన కొనసాగుతోంది.

ఒకే సామాజిక వర్గంలోని ఉప కులాల మధ్య కూడా ఆదాయ అసమానతలు ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి నివేదిక నిగ్గుతేల్చింది. ఆదాయాలు పెంచుకునే విషయంలో చొరవ లేకపోవడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. ఏదోక రోజున రిజర్వేషన్ల ఉపసంహరణ అనివార్యమని అందరికీ తెలిసిందే. మరి జనాన్ని కూడా ఆ దిశగా సమాయత్తం చేయాలంటే తొలుత ప్రభుత్వాల చెప్పుడు మాటలు వినడం మానెయ్యాలి. మరి ఇప్పుడేం చేయాలి ఇదీ పెద్ద ప్రశ్నే. రిజర్వేషన్ విధానం మొత్తాన్ని పునస్సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఇకపై ఫలానా కులాన్ని వెనుకబడినది గుర్తించి రిజర్వేషన్ కల్పిస్తామన్న హామీలు ఇకపై గుప్పించకూడదు. అమెరికా తరహాలో పాయింట్స్ సిస్టమ్ ఉంటే ఇంకా బాగుటుందని కొందరి సూచన. జనంలో సామాజిక మార్పును తీసుకొచ్చే దిశగా చర్యలు చేపట్టాలి. ప్రభుత్వమిచ్చే రిజర్వేషన్లు ఉచితాల కోసం వెంబర్లాడకుండా స్వశక్తితో ముందుకు సాగే లక్షణం అలవాటుచేసుకోవాలి. అప్పుడు నిరుపయోగమైన ఉద్యమాల కంటే. సహేతుకమైన పనులకు అవకాశం ఉంటుందని ఖచితంగా చెప్పగలం.