ఎన్నికలకు ముందే చత్తీస్‌ఘడ్‌ నక్సల్స్ దాడులు – ప్రజల తీర్పును మార్చడానికేనా

By KTV Telugu On 27 April, 2023
image

దేశంలో నక్సలైట్ల దాడులు చాలా వరకూ తగ్గిపోయాయి. అదేం విచిత్రమో కానీ చత్తీస్ ఘడ్‌లో మాత్రం ఎన్నికలకు ముందు భారీ దాడులకు పాల్పడుతూంటారు. ఆ దాడుల్ని బలగాలు గుర్తించలేవు ఆపలేవు ప్రాణాలు బలైపోతూంటాయి ఎందుకిలా జరుగుతోంది. తెర వెనుక ఏమైనా కుట్ర ఉందా అన్న విషయాలపై రకరకాల ఊహాగానాలు వస్తాయి కానీ నిజమేంటో ఎప్పటికీ తెలియదు. కానీ ఎన్నికలకు ముందే జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలను ప్రభావితం చేయడానికే ఇలాంటివి చేస్తున్నారన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తూ ఉంటారు. నక్సల్స్ ఇలాంటి భీకర దాడులకు పాల్పడటం వల్ల ఏ రాజకీయ పార్టీకి లాభం జరుగుతుంది ఓటర్ల మనసుల్లో మార్పు వస్తుందా.

పదేళ్ల కిందట అంటే మే 2013లో చత్తీస్ ఘడ్‌లో ఎన్నికల వాతావరణ ఉంది. అక్కడ మళ్లీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు చత్తీస్ ఘడ్ అంతా విస్తృతంగా తిరుగుతున్నారు. అలా సుక్మా జిల్లాలోని జిరామ్ ఘాటి దర్భా వ్యాలీకి వెళ్లిన కాంగ్రెస్ ముఖ్య నేతలపై నక్సల్స్ దాడి చేశారు. ఆ దాడిలో మాజీ మంత్రి మహేంద్ర కర్మ ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ చీఫ్ నంద్ కుమార్ పటేల్ విద్యా చరణ్ శుక్లా సహా 27 మంది మరణించారు. సుమారు 200 మంది కాంగ్రెస్ నాయకులు ఉన్న కాన్వాయ్‌పై ఈ దాడి జరిగింది. ఈ ఘటన సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ తర్వాత ఐదేళ్లకు అంటే మార్చి 2018లో మళ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో సుక్మా జిల్లాలో మావోయిస్టులు దాడులకు తెగబడ్డారు. IED పేలుడులో తొమ్మిది మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది మరణించారు. నిజానికి అప్పటికే మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గిపోయాయి. కానీ ఎన్నికల హడావుడిలో ఉన్న బలగాలపై దాడులకు తెగబడ్డారు. మళ్లీ కరెక్ట్ గా ఐదేళ్లకు అంటే ఏప్రిల్ 2023లో మరోసారి మావోయిస్టులు పంజా విసిరారు. ఈ సారి పదకొండు మంది జవాన్లు వీరమణం పొందారు. ఇప్పుడు కూడా చత్తీస్ ఘడ్‌లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.

ఎన్నికలకు ముందు భారీ దాడులు చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందో లేదో ఎవరూ చెప్పలేరు కానీ ఖచ్చితంగా ఈ దాడులు ఎన్నికల ప్రభావిత అంశంగానే చూస్తారు. 2013లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలందర్నీ నక్సల్స్ హతమార్చినప్పటికీ అక్కడ భారతీయ జనతా పార్టీనే అధికారాన్ని నిలబెట్టుకుంది. ఆ ఘటన జరిగినప్పుడు చత్తీస్ ఘడ్ సీఎంగా రమణ్ సింగ్ ఉన్నారు. ఆ నరమేధం జరిగిన తర్వాత కూడా ఆయన అధికారాన్ని నిలబెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్న స్థానాలకు ఒక్కటి మాత్రమే అదనంగా తెచ్చుకుంది. అంటే అంత మంది చనిపోయినా ప్రజల సానుభూతి దక్కలేదన్నమాట. ఆ సానుభూతిని భయం మింగేసి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక గత ఎన్నికలకు ముందు భారీ దాడి జరిగిదింది. అందులో జవాన్లు చనిపోయారు కానీ ఆ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయాన్ని సాధించింది. అజిత్ జోగి సొంతపార్టీ పెట్టుకున్నా కాంగ్రెస్ పార్టీ 68 స్థానాలు సాధించింది. ఈ సారి నక్సల్స్ దాడుల వల్ల బీజేపీ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగి కాంగ్రెస్ కు ఓటేశారని అనుకోవచ్చు. ఏడాది చివరిలో మరోసారి చత్తీస్ ఘడ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి ఇంకా ఏమైనా దాడులు జరుగుతాయా ఎ పార్టీ గెలుస్తుందన్నది కాలమే నిర్ణయించాలి.

ఏ రాష్ట్రానికైనా శాంతిభద్రతలు ముఖ్యం. ప్రశాంతమైన జీవితాన్ని ప్రజలు కోరుకుంటారు. ప్రశాంతత లేకపోతే పాలకులపై వ్యతిరేకత చూపిస్తారు. కానీ చాలా మంది పాలకులు భయంతో ఓట్లు వేసేలా చేసుకుని అధికారాన్ని నిలబెట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు. అదే తేలిక అని వారి అభిప్రాయం కావొచ్చు. లా అండ్ ఆర్డర్ విషయంలో నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలు అనేక సవాళ్లను ఎదుర్కొంటాయి. నక్సలైట్లు దాడులు పెరిగితే ఆటోమేటిక్‌గా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. వారిని కంట్రోల్ చేయలేకపోతున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. కానీ అది భయం స్థాయికి వెళ్తే మాత్రం అధికార పార్టీకే మేలు జరిగే చాన్స్ ఉంటుంది. 2013లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలందర్నీ నక్సల్స్ చంపేసిన తర్వాత అక్కడ బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇలాంటి దాడుల్లో రాజకీయ కుట్రలను ఎవరూ కాదనలేరు కానీ సాక్ష్యాలు మాత్రం లభించవు. అయితే అత్యధిక సమయాల్లో నక్సల్స్ దాడులు ప్రభుత్వానికి మైసన్ అవుతాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చత్తీస్ ఘడ్‌లో పరిపాలిస్తోంది. ఇప్పుడు జవాన్లు బలయ్యారు. ఇంకా ఆరు నెలల్లో ఎలాంటి దాడులు జరుగుతాయో చెప్పలేం కానీ నక్సల్స్ హింస ఎన్నికల వరకూ పెరుగుతూనే ఉంటుందని అనుకోవచ్చు.

నక్సల్స్ ఉద్యమం వైపు యువత ఆకర్షితులు కాకపోవడం అందులో ఉన్న నేతలు వృద్ధులైపోవడంతో చాలా వరకూ నక్సల్ ఉద్యమం నీరసించిపోయింది. దాడులు తగ్గిపోవడంతో పాటు ఒకప్పుడు నక్సల్స్ కంచుకోటల్లా ఉన్న ప్రాంతాల్లోనూ వారి ఉనికి కనిపించడం లేదు. కానీ చత్తీస్ ఘడ్‌లో మాత్రం ఇలాంటివి తరచూ చోటు చేసుకుంటున్నాయి. అదీ ఎన్నికలకు ముందే జరుగుతూండటం ఖచ్చితంగా ఓటర్లను ప్రభావితం చేసే వ్యూహమే. అయితే ఇది ఏ వైపు నుంచి జరుగుతుందన్న అంచనా వేయడం సాధ్యం కాదు.