ఎంజీఆర్ ఎన్టీఆర్ సరే మరి కన్నడీగుల సంగతేంటి

By KTV Telugu On 28 April, 2023
image

దేశంలో రాజకీయాలకు సినిమాకు విడదీయరాని సంబంధం ఉంది. సినిమాల్లో పెద్ద హీరో అయ్యారంటే ఇక నెక్ట్స్ స్టెప్ రాజకీయాలేనని చెప్పుకుంటారు. నాటి హాలీవుడ్ నటుడు రోనాల్డ్ రీగన్ తర్వాత అమెరికా అధ్యక్షుడయ్యారు. అమెరికాలో చాలా మంది సినీ పెద్దలు రాజకీయ అనుభవం గడించారు. బాలీవుడ్ లోనూ అంతే అమితాబ్ బచ్చన్ సునీల్ దత్, ధర్మేంద్ర కుటుంబం వినోద్ ఖన్నా హేమమాలిని జయప్రద ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. సినీ కళామ్మతల్లికి సేవ చేసిన తర్వాత ఓసారి ప్రజా సేవలో కూడా తరిద్దామనుకును అడుగులు వేస్తూ ఉంటారు. దక్షిణాదిన తమిళం తెలుగు ఇండస్ట్రీల్లో ఎక్కువ మంది సినీ దిగ్గజాలా రాజకీయాల్లో రాణించారు. కన్నడ సినిమా మాత్రం అందుకు భిన్నంగా ఉంది. పాలిటిక్స్ బేడ అంటే రాజకీయాలు వద్దు అని కన్నడ సినీ పరిశ్రమ చాలా రోజులుగా చెబుతున్నట్లనిపిస్తోంది. రాజకీయ నాయకులతో రాసుకు పూసుకు తిరగడం వారిని సినిమా ఫంక్షన్లకు పిలవడం ఒకరిద్దరు నేతలకు మద్దతివ్వడం మినహా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు తక్కుువే. ఒకరిద్దరూ మాత్రమే రాణించారని చెప్పుకోవాలి.

సినిమా ఇండస్ట్రీ ప్రజా మాధ్యమంగా మారుతున్న రోజుల్లోనే తమిళ నిర్మాత కే. సుబ్రమణియమ్ రాజకీయ సందేశాలతో సినిమాలు తీశారు. అన్నారురై కరుణానిధి రాజకీయ సందేశాలతో సినిమా డైలాగులు కథలు రాశారు. ద్రవడ ఉద్యమ ఊపు తమిళ సినిమాల్లో కనిపించేది. ఎంజీఆర్ హీరోగా నటించిన ప్రతీ సినిమాలో పొలిటికల్ డైలాగ్స్ ఉండేవి. తెలుగు సినిమాల్లోనూ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ డైలాగ్స్ లో రాజకీయం ధ్వనించేది. సామాజిక న్యాయం కోసం పోరాడాలన్న తపన ఉండేది. ఎందుకనో కన్నడ సినిమాలో ఆ జోష్ కనిపించేది కాదు. రాజకీయాలను పెద్దగా పట్టించుకునే వారు కాదు. తమిళనాడులో ఎంజీఆర్ జయలలిత విజయకాంత్ కమల్ హాసన్ నెపోలియన్ సహా పలువురు సినీ దిగ్గజాల రాజకీయాల్లో రాణించారు. మఖ్యమంత్రులుగా తమిళ నేలను పాలించారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగువారి అన్నగారు నందమూరి తారకరామారావు ప్రభంజనం ప్రపంచం మొత్తానికి తెలుసు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే అధికారానికి వచ్చిన సంస్కరణలకు పితామహుడిగా పేరు తెచ్చుకున్నారు. అంతకుముందే కొంగర జగ్గయ్య ఎంపీ అయ్యారు. తర్వాతి కాలంలో సూపర్ స్టార్ కృష్ణ సత్యనారాయణ ఉర్వశి శారద లాంటి వాళ్లు తళుక్కున మెరిశారు. చిరంజీవి ప్రజారాజ్యాన్ని స్థాపించి తర్వాత కాంగ్రెస్ లో కలిపేశారు. కేంద్ర మంత్రి అయ్యారు. పవన్ కల్యాణ్ జనసేనతో సీఎం కావాలనుకుంటున్నారు. అలీ లాంటి వాళ్లు వైసీపీలో ఉన్నారు. కన్నడ సినిమాలో మాత్రం గుంపులు గుంపులుగా పాలిటిక్స్ కు వెళ్లిన వాళ్లు లేరు.

ఎంఆర్ తమిళ సినిమాను ఎన్టీఆర్ తెలుగు ఇండస్ట్రీని ప్రేమ నజీర్ మళయాళ సినీ ప్రపంచాన్ని ఏలిన రోజుల్లోనే కన్నడ నాట ఓ మహానటుడు ఉండేవారు. కన్నడ కంఠీరవుడిగా పేరు పొందిన జన హృదయ నటుడు రాజ్ కుమార్ ఎప్పుడూ రాజకీయాల జోలికి పోలేదు. అదేమంటే తనకు తెలియని వృత్తిలో అడుగుపెట్టే ప్రసక్తే లేదన్నారు. 1977లో చిక్ మగళూరులో ఇందియాగాంధీ పోటీ చేసినప్పుడు జనతాపార్టీ తరపున పోటీ చేసి ఆమెను ఓడించాలని రాజ్ కుమార్ ను సోషలిస్టు నేత జార్జ్ ఫెర్నాండెజ్ అభ్యర్థించారు. తన వల్ల కాదని ప్రకటించిన రాజ్ కుమార్ ఎక్కడ వత్తిడి చేస్తారోనన్న భయంతో నామినేషన్ సమయం ముగిసే వరకు జనానికి కనిపించకుండా దాక్కున్నారు. కన్నడనాడు పక్ష అనే పార్టీకి నాయకత్వం వహించాలని కొందరు ఆహ్వానించినప్పటికీ రాజ్ కుమార్ పట్టించకోలేదు. రాజ్ కుమార్ ఫ్యాన్స్ 1985 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వారికి తనకు సంబంధం లేదని ఆయన ప్రకటించి చేతులు దులుపుకున్నారు. రాజకీయాలకు తాను దూరమన్నారు. రాజ్ కుమార్ ను చందనం స్మగ్లర్ వీరప్పన్ కిడ్నాప్ చేసి విడిచిపెట్టిన తర్వాత కూడా రాజకీయాల్లోకి రావాలని ఆయన్ను కొందరు అభిమానులు ఒత్తిడి చేశారు. అయినా ఆయన వైపు నుంచి సారీ అన్న సమాధానమే వినిపించింది.

రాజ్ కుమార్ రాలేదని మిగతా వాళ్లేమీ చేతులు ముడుచుకుని కూర్చోలేదు. వీరప్పన్ కిడ్నాప్ డ్రామాలో రాజ్ కుమార్ కుటుంబానికి అండగా ఉన్న నటుడు అంబరీష్ రాజకీయాల్లో రాణించారు. గెలుస్తూ ఓడుతూ కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన భార్య సుమలత 2019 లోక్ సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. 1985 ప్రాంతంలో అనంతనాగ్ శంకర్ నాగ్ సోదరులు రామకృష్ణ హెగ్డే నేతృత్వంలోని జనతా పార్టీలో చేరారు. ప్రచారం చేసి పార్టీని గెలిపించారు. శంకర్ నాగ్ చనిపోయిన తర్వాత 1991 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అనంతనాగ్ ఓడిపోయారు. 1994లో మల్లేశ్వరం అసెంబ్లీకి గెలిచి మంత్రి అయ్యారు 2004లో ఓడిపోయారు. ఎం. చంద్రూ శశి కుమార్ లాంటి నటులు ఎన్నికల్లో గెలిచినా తరచూ పార్టీలు మారారు. వాళ్లకి రాజకీయ సిద్ధాంతాలు ఉన్నట్లుగా కనిపించలేదు. బహుభాషా నటుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయికుమార్ కూడా పెద్దగా రాణించలేదు.

తెలుగులో కూడా ఫేమస్ అయిన బహుభాషా నటుడు ఉపేంద్ర కూడా రాజకీయాల్లో రాణించలేదు. ఉత్తమ ప్రజాకీయ పార్టీని స్థాపించిన ఆయన రాజకీయంగా ఏం చేస్తున్నారో ఎవరికీ తెలీదు. ప్రస్తుతం ఈగ సుదీప్ కూడా అర్థం లేని రాజకీయాలే చేస్తున్నారనుకోవాలి. ముఖ్యమంత్రి బొమ్మాయ్ తనకు ప్రియమైన అంకుల్ అయినందున మద్దతిస్తున్నానని బీజేపీ పార్టీకి తనకు సంబంధం లేదని సుదీప్ చెప్పుకుంటున్నారు. అది విశ్లేషణలకు అందని లాజిక్ అనే చెప్పాలి. ఇప్పుడాయన బీజేపీ తరపున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సుదీప్ ను చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇప్పుడు కన్నడ నటుడు దర్శన్ కూడా బీజేపీ తరపున ప్రచారానికి సిద్ధమవుతున్నారు. మే ఒకటి నుంచి వారం రోజుల పాటు ఆయన వేర్వేరు ప్రాంతాల్లో ప్రచారం చేస్తారు. సుమలత ఇప్పుడు బీజేపీకి ప్రచారం చేస్తున్నారు. మాండ్యా మాజీ ఎంపీ రమ్య అలియాస్ దివ్య స్పందన మళ్లీ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్నారు. ఆప్ లో చేరిన చంద్రూ ఆ పార్టీ క్యాంపైన్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు ఇదిలా ఉండగా మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ కుమారస్వామి రామనగర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆయన సుమలత చేతిలో ఓడిపోయారు. ఏదేమైనా పొరుగు రాష్ట్రాల రాజకీయాల్లో కన్నడ సినీ పరిశ్రమ పాత్ర పది శాతం కూడా లేదని చెప్పాలి.