రజినీకాంత్. వరల్డ్‌వైడ్ పాపులర్ ఈ తమిళ సూపర్‌స్టార్. ఆయన కనిపిస్తేనే స్క్రీన్‌మీద పూనకాలు లోడింగ్ అన్నట్లు ఉంటుంది సీన్. వ్యక్తిగతజీవితంలోనూ ఆయన వివాదాలకు దూరం. పార్టీ పెడుతున్నారని రాజకీయాల్లోకి వస్తారని గతంలో చాలాసార్లు ప్రచారం జరిగినా ఆయన ఆ సాహసం చేయలేదు. కొన్నిసార్లు టెంప్ట్ అయినా ఆ రొంపిలోకి దిగకుండా ఏ పార్టీని భుజాన వేసుకోకుండా బ్యాలెన్స్ మెయింటెన్ చేస్తూ వస్తున్నారు అందుకే ఆయన అందరివాడు. అన్ని పార్టీలు అలానే అనుకుంటాయి. ఇంత జాగ్రత్తగా ఉండే రజినీకాంత్ ఇప్పుడు ఏపీ నేతల నోట్లో నానుతున్నారు. సాధారణంగా చంద్రబాబుని దుమ్మెత్తిపోసే వైసీపీ ఇప్పుడు రజినీకాంత్‌ని కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకుంటోంది. టీడీపీ కార్యక్రమానికి వచ్చి చంద్రబాబుని ఆకాశానికెత్తేశారు రజినీకాంత్. సంయమనంతో దేన్నీ శృతిమించనీయని తమిళ సూపర్‌స్టార్ చంద్రబాబుని ఆ రేంజ్‌లో పొగుడుతారని ఎవరూ అనుకోలేదు. అలాగని ఆయనొచ్చింది టీడీపీ పార్టీ ప్రోగ్రామ్‌కేమీ కాదు. ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమానికి రజినీకాంత్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కాకపోతే ఆ కార్యక్రమాన్ని నిర్వహించింది టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన వియ్యకుడు కమ్ బావమరిది బాలయ్య. ఎన్టీఆర్ నట జీవితాన్ని ముఖ్యమంత్రిగా ఆ పెద్దాయన ప్రజాసేవని పొగిడేసినా ఎవరూ పెద్ద ఫీలయ్యేవారు కాదు. కానీ చంద్రబాబుని ఆకాశానికెత్తేసి అధికారపార్టీకి టార్గెట్ అయ్యారు రజినీకాంత్.
ఎన్టీఆర్‌తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. నట జీవితంలో ఎన్టీఆర్ ప్రస్థానాన్ని ప్రస్తుతించారు. అక్కడితో ఆగిపోయిన బాగుండేదేమో. చంద్రబాబు నాయుడుని అసామాన్యుడనీ అనితర సాధ్యుడని పొగడ్తలతో ముంచెత్తారు. సభకు హాజరైన జనాలు జెండాలు చూస్తుంటే రాజకీయం మాట్లాడాలని అనిపిస్తోందని టెంప్ట్ అయ్యారు. చంద్రబాబుతో తనకు మూడు దశాబ్దాల అనుబంధం ఉందని అన్నారు. జాతీయ రాజకీయాలే కాదు ప్రపంచ రాజకీయం కూడా ఆయకు తెలుసు ఆయన గొప్పతనం దేశంలోనే ప్రముఖ నాయకులందరికీ తెలుసంటూ చంద్రబాబుని ఆకాశానికెత్తేశారు. విజన్ 2020ని గుర్తుచేస్తూ హైదరాబాద్ ఈరోజున హైటెక్ సిటీలా మారిందంటే కారణం చంద్రబాబేనన్నారు రజినీకాంత్. చంద్రబాబు దూరదృష్టితో అభివృద్ధి చెందిన హైదరాబాద్‌లో తిరుగుతుంటే ఇండియాలో ఉన్నానో న్యూయార్క్‌లో ఉన్నానో అర్థం కాలేదంటూ రజినీకాంత్ పొగుడుతుంటే చంద్రబాబు పొంగిపోయారు.
అక్కడితోనే ఆగలేదు రజినీకాంత్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు దేవుడు ఆయనకు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరుకున్నారు. ఆయన నాయకత్వం రాష్ట్రానికి అవసరమని అంత పెద్ద సెలబ్రిటీ కూడా ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చేశారు. రజినీకాంత్ అంతటోడే వచ్చి అంతసేపు పొగిడేసరికి చంద్రబాబు ఫుల్ ఖుషీ. బావ కళ్లల్లో ఆనందంతో బాలయ్య డబుల్ ఖుషీ. కాకపోతే ఎవరితో ఎప్పుడూ మాటపడని రజినీకాంత్‌ని కొడాలినాని నుంచి ఆర్కే రోజా దాకా మాటలతో కుళ్లబొడిచేస్తున్నారు. బుద్ధీ జ్ఞానం లేదన్నట్లు తిట్టిపోస్తున్నారు ఎన్టీఆర్ శతజయంతిలో ఆ మహానటుడిని ప్రజానాయకుడిని గుర్తుచేసుకుంటూ నాలుగు మాటలు మాట్లాడి కూర్చుంటే గౌరవంగా ఉండేదేమో. చంద్రబాబుని పొగిడి బ్యాలెన్స్ తప్పారు రజినీకాంత్. మాట్లాడేముందు తన అంతరంగం వద్దు రజినీ జాగ్రత్త ఇక్కడ రాజకీయం మాట్లాడొద్దని చెబుతోందంటూనే టెంపోలో అన్నీ మాట్లాడేశారు. వైసీపీకి టార్గెట్ అయ్యారు. వణక్కం అంటూ తొణక్కుండా మాట్లాడేసినా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది పాపం.