రాజకీయాల్లో మొహవాటాలు దాపరికాలు అస్సలు పనికిరావు. రేప్పొద్దున ఉపయోగం ఉంటుందనుకుంటే ఎవరి గడపయినా తొక్కాలి. అవసరమైతే మనమే ఓ మెట్టు దిగాలి. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబుది ఇప్పుడిదే పాలసీ. ఆయన కోరుకున్నదే పవన్‌కళ్యాణ్ కూడా చేస్తున్నారు కాబట్టి ఇద్దరి మధ్యా బంధం బలపడుతోంది. ఆమధ్య హోటల్‌కి వెళ్లి పవన్‌కళ్యాణ్‌ని కలసుకున్నారు టీడీపీ అధినేత. ఈసారి చంద్రబాబు నివాసానికి వెళ్లారు జనసేన. గంటన్నర మీటింగ్‌లో లోకాభిరామాయణం ఏమీ చెప్పుకోరుగా ఫక్తు పాలిటిక్సే మాట్లాడుకున్నారు. సాంకేతికంగా బీజేపీతో కలిసున్నా ఆ పార్టీతో ఇష్టంలేని సంసారమే చేస్తున్నారు పవన్‌కళ్యాణ్. వైసీపీతో ఒంటరిపోరుతో నెగ్గలేమని అర్ధమైన చంద్రబాబు జనసేనతో దోస్తీకి ప్రయత్నిస్తున్నారు. భావసారూప్యం చంద్రబాబు పవన్కళ్యాణ్లని కలుపుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదు కలిసిపోటీచేసి వైసీపీని గద్దదించాలన్నదే ఆ ఇద్దరి ఏకాభిప్రాయం. కాకపోతే బీజేపీకే ఈ ప్రతిపాదన నచ్చడం లేదు. జనసేనని ప్రేమిస్తున్న బీజేపీ ఎందుకో చంద్రబాబుని ద్వేషిస్తోంది. ఆయన గతంలో ప్లేటు ఫిరాయించి మోడీనే తిట్టిపోశారన్న కోపం ఆ పార్టీకి ఇంకా ఉన్నట్లుంది. అందుకే వైసీపీ-టీడీపీలకు సమదూరం పాటించాలన్న పాలసీతో ఉంది బీజేపీ. అయితే ఆ పార్టీ దూరం జరుగుతున్నా దగ్గరయ్యేందుకే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నారు. రిపబ్లిక్ టీవీ డిబేట్లో ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తటం బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాల్లో భాగమే. బీజేపీతో దోస్తీకి ప్రయత్నిస్తూనే అటు పవన్‌కళ్యాణ్‌తో ఆ పార్టీపై ఒత్తిడి పెంచాలన్న వ్యూహంతో ఉన్నారు చంద్రబాబు.
మోడీకి ప్రశంసలపై చర్చ జరుగుతుండగానే చంద్రబాబుతో భేటీ అయ్యారు పవన్‌కళ్యాణ్. కొన్ని నెలల వ్యవధిలోనే వాళ్లిద్దరి మధ్య ఇది మూడో సమావేశం. తెలంగాణతో పాటే ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో పొత్తులపై ఓ అవగాహనకోసమే చంద్రబాబు-పవన్‌కళ్యాణ్ సమావేశమయ్యారని భావిస్తున్నారు. పోయినేడాది అక్టోబరు 18న విజయవాడలో పవన్‌కళ్యాణ్ బసచేసిన హోటల్‌కి వెళ్లి ఆయనతో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలపై కలిసిపోరాడతామని ఇద్దరూ ప్రకటించారు. ఈ సంవత్సరం జనవరి 8న చంద్రబాబు ఇంటికి వెళ్లి పవన్‌కళ్యాణ్ సంఘీభావం తెలిపారు. ఇప్పుడు తాజా మీటింగ్‌తో రెండుపార్టీల మధ్య పొత్తు ఖాయమన్న విషయం తెలిసిపోయింది. మరి బీజేపీని పవన్‌కళ్యాణ్ ఒప్పిస్తారా కాదూ కూడదంటే ఆ పార్టీకి దూరమై టీడీపీతోనే కలిసి కదులుతారా అన్నదే సస్పెన్స్. చంద్రబాబు పవన్‌కళ్యాణ్ భేటీపై ఊహాగానాలకు అధికారికంగానే తెరదించారు జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదండ్ల మనోహర్. ఇద్దరి మధ్యా మరిన్ని సమావేశాలు జరుగుతాయని చెప్పారు. వైసీపీ పాలన నుంచి ఏపీకి విముక్తి కల్పించడమే రెండు పార్టీల లక్ష్యమని ఈ సమావేశాలు అందులో భాగమంటున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వమని పవన్ కళ్యాణ్ ఇదివరకే చెప్పారు. భవిష్యత్తు రాజకీయం ఈ స్ట్రాటజీతోనే ఉంటుందంటున్నారు నాదెండ్ల. మరిన్ని మీటింగ్‌లు ఉంటాయన్న ప్రకటనతో వైసీపీ ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తోంది.