550మంది సంతానం.. బాప్‌రే ఒక్క‌డే బాప్

By KTV Telugu On 30 April, 2023
image

ఎవ‌రికైనా ఎంత‌మంది పిల్ల‌లుంటారు. కుటుంబ‌నియంత్ర‌ణ పాటించేవాళ్ల‌కు ఇద్ద‌రు ముగ్గురు. పాత‌త‌రాల్లో ఏడెనిమిదిమందిదాకా ఓపికున్నోళ్లు డ‌జ‌నుమందిని కూడా కనుండొచ్చు. కానీ అంత‌కుమించి అయితే సాధ్యంకాదుగా. సాధ్యంకాద‌ని మ‌నం అనుకుంటే స‌రిపోతుందా సంక‌ల్పం ఉండాలేగానీ వంద‌ల‌మందిని పుట్టించ‌వ‌చ్చ‌ని నిరూపించాడో మ‌హానుభావుడు. అత‌ను ఎంత‌మంది పిల్ల‌ల‌కు తండ్రో తెలిస్తే గుండెలు ఆగిపోతాయ్‌. 550మంది అవును 550మంది పిల్ల‌లకు అతనే తండ్రి. తండ్రి ఒక్క‌డే కానీ త‌ల్లులు చాలామంది. అందుకే అత‌నికి ఈ రికార్డు సాధ్య‌మైంది. చాలామంది పిల్ల‌లు ఎదురుప‌డ్డా వాళ్లు త‌న సంతాన‌మ‌ని అత‌ను గుర్తుప‌ట్ట‌లేడు. ఎందుకంటే ఆ పిల్ల‌ల త‌ల్లుల్లో ఎంతోమందికి అత‌ని ముక్కుమొహం కూడా తెలీదు. అయినా ఎలా తండ్రి అయ్యాడంటారా అక్క‌డేఉంది అస‌లు కిటుకు. క‌నిపించివాళ్లంద‌రికీ వీర్య‌దానం చేసుకుంటూ పోయాడు నెద‌ర్లాండ్స్‌లో ఓ మ‌గ‌మ‌హారాజు. వీర్య‌దానానికి సంబంధించి కొన్ని నియ‌మ నిబంధ‌న‌లు ఉంటాయి. డచ్‌ చట్టాల ప్రకారం ఏ వ్య‌క్తి అయినా గ‌రిష్ఠంగా 12 మందికి వీర్యం దానం చేయొచ్చు. 25 మంది పిల్లలకు జన్మనిచ్చే అవకాశం ఉంది. కానీ జొనాథ‌న్ జాక‌బ్ మేజ‌ర్ అనే వ్య‌క్తి మ‌న‌ల్ని అడిగేవారు ఎవ‌ర‌నుకున్నాడు. అందుకే అడ్డ‌గోలుగా వీర్య‌దానం చేస్తూ చివ‌రికి 550మంది పుట్టుక‌కు కార‌ణ‌మ‌య్యాడు. దీంతో న్యాయ‌స్థానం దీన్ని తీవ్రంగా భావించింది. అతడిపై నిషేధం విధించింది. అత‌ను ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌ల్లిదండ్రుల్ని ప్ర‌భావితం చేస్తున్నాడ‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది.

జొనాథ‌న్ జాక‌బ్ మేజ‌ర్ ఇక నుంచి వీర్యాన్ని దానం చేసే అవకాశం లేకుండా కోర్టు నిషేధం విధించింది. 41 ఏళ్ల జాక‌బ్‌కు ల‌క్ష యూరోల ఫైన్ కూడా వేసింది. ఓ మ‌హిళ హేగ్ కోర్టులో వేసిన కేసుతో జొనాథ‌న్ వ్య‌వ‌హారం బ‌య‌టికొచ్చింది. దేశంలోని సుమారు 13 క్లినిక్‌ల‌కు జాక‌బ్ స్పెర్మ్ డొనేట్ చేశాడు. 2007 నుంచి 2017 వ‌ర‌కు ప‌దేళ్ల‌కాలంలో జాక‌బ్ వీర్య‌దానంతో ప‌దుల‌సంఖ్య‌లో మ‌హిళ‌లు గ‌ర్భందాల్చారు. 550మంది సంతానానికి జ‌న్మ‌నిచ్చారు. ఇప్ప‌టికే ఎక్కువైంది ఇక‌మీద ఒక్క బొట్టు దానం చేసినా వీపు విమానం మోత మోగుతుంద‌ని కోర్టు హెచ్చ‌రించింది. కోర్టు ఆదేశాల‌ను ఉల్లంఘిస్తే 90 లక్షల జరిమానా కట్టాల్సి ఉంటుందని డ‌చ్ కోర్టు వార్నింగ్ ఇచ్చింది. లోక‌ క‌ల్యాణం కోస‌మే త‌న క్ల‌యింట్ ఈ సేవ చేస్తున్నాడ‌ని వాదించ‌బోయాడు జొనాథన్ లాయ‌ర్‌. గర్భం ధరించలేని జంటలకు సాయం చేయాలన్న స‌త్సంక‌ల్పంతోనే ఈ ప‌నిచేశాడ‌ని వాదించాడు. అయితే విరాళాలు గర్భం దాల్చిన పిల్లల గురించి జొనాథ‌న్ ఉద్దేశపూర్వకంగానే తల్లిదండ్రులకు తప్పుడు సమాచారం ఇచ్చాడని కోర్టు గుర్తించింది. ఇంత‌మంది తోబుట్టువుల‌తో పిల్లలు ప్రతికూల మానసికప‌రిస్థితిని ఎదుర్కుంటార‌ని ఇదో సామాజిక స‌మ‌స్య‌గా మారుతుంద‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. మొత్తానికి జొనాథ‌న్ నిర్వాకం నెదర్లాండ్స్‌లో సంచ‌ల‌నంగా మారింది. నెద‌ర్లాండ్స్‌లో గ‌తంలోనే సంతానోత్ప‌త్తి కుంభ‌కోణాలు బ‌య‌ట‌ప‌డ్డా జాక‌బ్ ఆ రికార్డుల‌న్నీ బ‌ద్ద‌లు కొట్టేశాడు.