థాయ్‌ల్యాండ్‌లో చీకోటి ప్రవీణ్ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ పట్టుబడ్డారు. వారి గ్యాంబ్లింగ్ విలువ రూ. వంద కోట్ల వరకూ ఉంటుందని అక్కడి పోలీసులు మీడియాకు సమాచారం ఇచ్చారు. అసలు గుట్టు ఏందో బయటకు వస్తుందా రాదా అన్న సంగతి తర్వాత కానీ ఇలా వందల కోట్లు గ్యాంబ్లింగ్ లో ఆడేంత పెద్ద మనుషులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారా అని మనం ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే కేసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ఇలాంటి గ్యాంబ్లింగ్ లు నిర్వహించడం ఇదే ప్రథమం కాదు. దొరికినా చివర కూడా కాదు. ఎప్పుడూ క్యాంప్ పెట్టినా వందల కోట్లు చేతులు మారుతూనే ఉంటాయి. ఈ డబ్బందా ఎవరిది ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి వెళ్తుంది.
చీకోటి ప్రవీణ్ హైదరాబాద్ స్టార్ హోటళ్లలో కూడా ఇలాంటి గ్యాంబ్లింగ్‌లు నిర్వహించారు. దొరికినప్పుడు దొంగ అయ్యాడు. దొరకనప్పుడు దొరగా గ్యాంబ్లింగ్‌లు నిర్వహించారు. కమిషన్లు వెనకేసుకున్నారు. ఏపీలో ఓ సంక్రాంతి పండుగకు ఆయన నిర్వహించిన గ్యాంబ్లింగ్ సంచలనం అయింది. గత సంక్రాంతికీ నిర్వహించారు కానీ అక్కడ పెద్దలు సంపూర్ణ అండదండలు ఉండటంతో బయటకు రాలేదు. అలాంటి క్యాంపే థాయిలాండ్‌లోనూ ఏర్పాటు చేసి దొరికిపోయారు. ఇలా దొరికిపోయిన వారిలో 14 మంది మహిళలు ఉన్నారు వీరు గ్యాంబ్లర్లు కాదు వారిని సంతృప్తి పరచడానికి వచ్చిన వారై ఉంటారు. అరెస్టయిన వారి వద్ద నుంచి భారీగా నగదు గేమింగ్ చిప్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో రూ. వంద కోట్ల మేర గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇంత భారీగా గ్యాంబ్లింగ్ నిర్వహించేంత ధైర్యం చీకోటికి ఎలా వచ్చిందన్నది పెద్ద సస్పెన్స్.
థాయ్ ల్యాండ్‌లో గ్యాంబ్లింగ్ లీగల్ కాబట్టే ఆయన అక్కడ క్యాంప్ పెట్టారు కదా అని చాలా మంది అనుకున్నారు. కానీ విషయం ఏమిటంటే థాయ్‌ల్యాండ్ గ్యాంబ్లింగ్ ఇల్లీగల్ అందుకే అరెస్ట్ చేశారు. విదేశాల్లో నేరం చేస్తే కఠిన శిక్షలు ఉంటాయి. ఆయా రాష్ట్రాల్లో వ్యవస్థల్ని మేనేజ్ చెయడం కష్టమే. ఎందుకంటే అక్కడ పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. ముఖ్యంగా విదేశీయులు నేరాల్లో దొరికినప్పుడు ఇంకా కఠినంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అలాంటి నేతలు తమ అంతర్గత భధ్రత వ్యవస్థకు ముప్పు తెస్తాయని అనుకుంటారు. భారత్‌లో గ్యాంబ్లింగ్ ఇల్లీగల్. అయితే గోవాలో పర్మిషన్ ఉంటుంది వెళ్తే అక్కడికే వెళ్లవచ్చు. లేదా లీగల్ అయిన మరో దేశానికి వెళ్లవచ్చు. కానీ ఇల్లీగర్ అయిన థాయ్ ల్యాండ్‌కే చీకోటి ప్రవీణ్ అంత మందిన ఎందుకు తీసుకెళ్లాడు అలాంటి రిస్క్ ఎందుకు తీసుకున్నాడన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. గ్యాంబ్లింగ్ కన్నా మించిన స్కెచ్ చీకోటి ప్రవీణ్ వ్యవహారంలో ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రూ.వంద కోట్లు చిన్న మొత్తం కాదు. గతంలో చీకోటి ప్రవీణ్ ఇలాంటివి నిర్వహించాడు. కోట్లకు పడగలెత్తాడు దీనిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ కూడా విచారణ జరిపింది కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది. బహుశా ఎలాంటి ఆధారాలు దొరకలేదమో కానీ మొత్తంగా వ్యాపారం అయితే మూడు పువ్వులు ఆరు కాయలుగా నిర్వహిస్తూనే ఉన్నారు. వందల కోట్ల టర్నోవర్ నిర్వహిస్తూనే ఉన్నారు. అదంతా హవాలా మనీనే. విదేశాల్లో నిర్వహించిన గ్యాంబ్లింగ్ వల్ల బ్లాక్ మనీని వైట్‌గా మార్చి ఇండియాకు పంపించే నెట్ వర్క్ ఏమైనా చీకోటి ఏర్పాటు చేసుకున్నాడేమో అన్న సందేహాలు ఈడీకి కూడా గతంలోనే వచ్చాయి. ఇలా హవాలా మనీని రూటింగ్ చేసే బిజినెస్ కూడా ఉందని గతంలోనే ప్రచారం జరిగింది. లీగల్ గా పర్మిషన్ ఉన్న దేశాలకు క్లయింట్స్ ను తీసుకెళ్లకుండా పట్టాయకే వారిని తీసుకెళ్లి రిస్క్‌లో పడేయడం కూడా దీనిపై అనుమానాలు కలిగేలా చేస్తున్నాయి. చీకోటి ప్రవీణ్‌కు రాజకీయ నేతలతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. విజయసాయిరెడ్డి దగ్గర్నుంచి అనేక మంది ఆయన ఫామ్ హౌస్‌కు వెళ్లారు. రహస్యంగా ఎంత మంది ఆయనకు మిత్రులో చెప్పాల్సిన పని లేదు. గుడివాడలో గ్యాంబ్లింగ్ నిర్వహణలో కొడాలి నాని వంశీల ప్రమేయం ఉందని గతంలోనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు కూడా గ్యాంబ్లింగ్ ను మించిన హవాలా వ్యాపారం కోసమే థాయిల్యాండ్ను ఎంచుకున్నారన్న అనుమానాలువస్తున్నాయి.
రాజకీయ నేతలు అడ్డగోలుగా ప్రజల్ని దోచుకుని ఆ బ్లాక్ మనీని ఏం చేయాలో తెలియక ఇలా వ్యసనాలకు ఖర్చుపెడుతూ ఉంటారు. ఇలాంటి నేతలు ఎంతో మంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. పట్టాయలో పట్టుబడిన వారిలో మెదక్ డీసీసీబీ చైర్మన్ కూడా ఉన్నారు. పూర్తి లిస్ట్ బయటకు వస్తే ఎంత మంది ఉన్నారా అన్నది స్పష్టత రానుంది. మరి వీరందరికి కోట్లు పెట్టి గ్యాంబ్లింగ్ చేయడానికి సొమ్ము ఎక్కడ వస్తుంది. విలాసాలు పోవడానికి జల్సాలు చేయడానికి అయ్యే డబ్బంతా ఎవరిది అంతా ప్రజలదే. రాజకీయంలో ఉన్న అపరిమితమైన అధికారంతో దోపిడీకి పాల్పడి వారీ పనులు చేస్తున్నారు. దోచుకోవడం ఎంత వచ్చిన వాడికి ప్రజాస్వామ్యంలో అన్ని అవకాశాలు వస్తున్నంత కాలం ఇలాటి చీకోటి ప్రవీణ్‌ల చీకటి వ్యవహారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తూనే ఉంటాయి.