మోదీని మళ్లీ గెలిపించాలా కేసీఆరే తెలంగాణ సీఎంగా కొనసాగాలా జనం ఏమంటున్నారు. చరిత్ర చెబుతున్నదేమిటి ఎంత మంది నేతలు తప్పులో కాలేశారు. మరి ఎంతమంది చివరిదాకా క్లీన్ ఇమేజ్ తో కొనసాగారు. నేతల తీరుపై జనం ఎందుకు అసంతృప్తి చెందుతున్నారు దీంట్లో ఉన్న లాజిక్ ఏమిటి. ఏడాది ఆఖరుకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్ లో లోక్ సభకు ఎన్నికలు జరుగుతాయి. కేంద్రంలో మోదీ రాష్ట్రంలో కేసీఆర్ మళ్లీ గెలుస్తారా వాళ్లు గెలవాల్సిన అనివార్యత ఉందా వాళ్లే గెలిస్తే రాజ్యం బాగుపడుతుందా. అలా ఎక్కువ కాలం అధికారంలో ఉన్న వాళ్లు సాధించిందేమిటి విశాల జనహితానికి ఆయా నేతలు చేసిందేమిటి. రాచరికాలు పోయాయి ప్రజారాజ్యం వచ్చింది. పాలనలో మార్పు మాత్రం కనిపించలేదు. భారత సహా పలు దేశాలు ప్రజాస్వామ్య నియంతృత్వంగానే కొనసాగుతున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన నేత నియంతగా మారడం రాజ్యాన్ని ఏకవ్యక్తి పాలనగా మార్చడం చూశాం. కొన్ని సందర్భాల్లో అదీ కుటుంబ పాలనగా మారిందని కూడా జనమూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నారు. నిజానికి చైనా కమ్యూనిజం కూడా ప్రజారాజ్యమే. కాకపోతే నేతలు దాన్ని నియంతృత్వంగానూ సుదీర్ఘకాలం ఏకవ్యక్తి పాలనగానూ మార్చేశారు.
ప్రాచీణ కాలంలోనూ మధ్యయుగంలోనూ రాచరికం ఉండేది. భారత్ లో ప్రాచీణ యుగమంతా హిందూ రాజ్యాలు ఏలేవి. పన్నులు కట్టే ప్రజలతో సంబంధం లేకుండా రాజులు యుద్ధాలు చేసేవారు. రాజులకు ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తులని పేరు తెచ్చుకోవడం ఇష్టంగా ఉండేది. అశ్వమేథ యాగాలు రాజశూయాగాలు అందుకే చేసేవారు. రామాయణ మహాభారతాలు కూడా చెప్పింది అదేనని మరిచిపోకూడదు. రాజుల కోసం ప్రజలు యుద్ధాలు చేసి ప్రాణాలు కోల్పోయేవారు వికలాంగులయ్యేవారు. రాజు మరణిస్తేనే ఆయన పదవీకాలం పూర్తయ్యేది. తర్వాత ఆయన కుమారుడో బంధువో లేకపోతే దండయాత్ర చేసిన పొరుగు రాజో సింహాసనాన్ని ఎక్కేవారు. అందులో ప్రజల ప్రమేయం ఏమీ ఉండేది కాదు. ప్రజల మనిషి ప్రజా బంధువని పిలిపించుకున్న రాజులు చాలా తక్కువ మంది. మనం చదువుకున్న గౌతమి పుత్రశాతకర్ణి శ్రీ కృష్ణదేవరాయలు మాత్రమే ప్రజారంజకులైన పాలకులని చెప్పాలి. అందరూ ఏకపక్ష నిర్ణయాలు, నియంతృత్వ పోకడలతోనే జనాన్ని వేపుకు తినేవాళ్లు. మధ్యయుగంలో సుల్తానుల తీరు కూడా అదే. జనాన్ని దోచుకుని ఖజానా నింపుకోవడమే వారి పని. ఢిల్లీ నుంచి దేవగిరికి మళ్లీ ఢిల్లీకి రాజధానిని మార్చిన తుగ్లక్ కథ అందరికీ తెలిసిందే. పైగా ప్రాచీణ యుగమైనా మధ్య యుగమైన మతమే రాజుకు మత్తుపదార్థంగా ఉండేది. తనకు నచ్చిన మతాన్ని జనం కూడా పాటించాలనే వారు. బలవంతపు మత మార్పిడులకు దిగేవారు.
పాలకుడికి అపరిమితమైన అధికారం రిటైర్మెంట్ లేని పదవీ కాలం ఉంటే అనర్థమేనని చాలా ఉదంతాలు నిరూపించాయి. ప్రజాస్వామ్యానికి బదులు అరాచకం ప్రబలుతుందని కూడా తేలిపోయింది. చైనాలో ఇప్పుడు జిన్ పింగ్ జీవితకాల అధ్యక్షుడయ్యారు. ప్రత్యర్థులందరినీ ఏరివేసే ప్రక్రియ కూడా మొదలైంది. చైనా లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. అక్కడకు వెళ్లిన కొత్తవారికి ఏమీ అర్థం కాదు. ఇడీ అమీన్ పాలన కంటే ఘెరంగా ఉందన్న వార్తలు కూడా వస్తున్నాయి. అందుకే అమెరికా తరహా టూ టర్మ్స్ దాటకూడదన్న చర్చ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ఓ నేతగా వరుసగా ముూడో సారి ఎన్నిక కాకూడదన్న సంప్రదాయం ఉంది. అందుకే అంత మంచి నాయకుడైనప్పటికీ బరాక్ ఒబామా మరో సారి పోటీ చేయకుండా తప్పకున్నారు ప్రజలకు తాను చేయాలనుకున్నదీ వచ్చిన రెండు అవకాశాల్లోనే పూర్తి చేశారు.
గల్ఫ్ దేశాల్లో సుల్తాన్, షేక్, అమీర్ పేరుతో రాజరికం నడుస్తోంది. అవి చమురు ఆర్థిక వ్యవస్థలు. ఇస్లామిక్ షరియాను తూచ తప్పకుండా పాటించే దేశాలు వారి పాలనా విధానమూ వేరు వారి వ్యవస్థలు వేరు. ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో అరాచకం ప్రబలింది. అక్కడ నియతృత్వమూ ఉంది. బలవంతుడితే రాజ్యమన్న అభిప్రాయమూ ఉంది. కొట్టి బతుకు చస్తే చావు అన్న ధోరణిలో అక్కడి నేతలు ప్రజలు జీవిస్తుంటారు. అదో ట్రైబల్ కల్చర్ దాన్ని మార్చడం కష్టం. ఇతర బ్రిటన్ సహా ఒకటి రెండు యూరప్ దేశాల్లో రాజ్యంగ రాచరికం అమలుల్లో ఉంది. అక్కడ రాజు రాణి నామ్ కే వాస్తే ఉంటారు. పాలనకు ఓ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రధానమంత్రి ఉంటారు. కాకపోతే అక్కడి రాజకీయ పరిస్థితుల్లో రెండు మూడు సార్లు అధికారం ఉండటం కష్టం.
ఒక నాయకుడు ఎక్కువ కాలం అధికారంలో ఉండేదీ భారత్ లోనే అని చెప్పాలి. జనంలో హీరో వర్షిప్ కారణంగా ఆ పరిస్థితి నెలకొంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నెహ్రూ బతికినంత కాలం ఆయనే ప్రధానమంత్రి. ఇందిరాగాంధీ కూడా మధ్యలో మూడు సంవత్సరాలు మినహా ఆమె బతికున్నంత కాలం పీఎంగానే కొనసాగారు. ఒకటి రెండు రాష్ట్రాల్లో అదే పరిస్థితి ఉండేది. పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టు దగ్గజం జ్యోతి బసు 23 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి తర్వాత స్వచ్ఛందంగా వైదొలిగారు. ప్రస్తుతం ఒడిశాలో నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి 23 సంవత్సరాలు దాటింది. మధ్యలో గ్యాప్ వచ్చినా ఎక్కువ కాలం ముఖ్యమంత్రులుగా చేసిన వారిలో కరుణానిధి జయలలిత కూడా ఉన్నారు.
ఎక్కువ కాలం పదవిలో ఉంటే అనర్థాలు రాష్ట్రానికి దేశానికి చేటు సంభవిస్తుందని అనేక ఉదంతాలు నిరూపించాయి. నిజానికి బెంగాల్లో జ్యోతిబసు పాలన తొలి నాళ్లలో స్వర్ణయుగం కనిపించింది. భూ సంస్కరణలను అమలు చేశారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేసి గ్రామస్థాయి నుంచి అభివృద్ధికి అవకాశమిచ్చారు. ప్రజల స్థితిగతులను మెరుగు పరిచాయి. రెండు టర్మ్స్ పూర్తయిన తర్వాత మూడో సారి అధికారానికి వచ్చే సరికి జ్యోతి బసు తీరు మారిపోయింది. కమ్యూనిస్టు పార్టీలోనే తానొక్కడే శక్తిమంతుడైన నాయకుడిగా ఉండాలన్న కోరిక ఆయనలో పెరిగింది. కాంగ్రెస్ సహా పలు పార్టీలను దెబ్బకొట్టే ప్లాన్లు వేశారు. తొటి కమ్యూనిస్టు భావజాల పార్టీలను కూడా ఎదగనివ్వలేదు. మార్క్సిజం పోయి కేపిటలిజం ఆయనలో ప్రవేశించిందన్న ఆరోపణలు వచ్చాయి. ప్రధాని కావాలన్న కోరికతో రాష్ట్రాన్ని వదిలేశారని కూడా చెప్పుకున్నారు. ప్రజల తలసరి ఆదాయాలు పెరుగుతున్న తరుణంలో జ్యోతిబసు తిరోగమన విధానాల కారణంగా వ్యక్తిగత సంపద బాగా తగ్గింది. సంస్కరణలకు అవకాశం లేక విద్యుత్, ఇంధన సంక్షోభం ఏర్పడింది. జనరేటర్లే జనానికి దిక్కయ్యాయి. తర్వాతి కాలంలో జనం కమ్యూనిస్టులకు పూర్తిగా దూరం జరిగి తృణమూల్ ను అక్కున చేర్చుకోవడానికి కారణం కూడా జ్యోతి బసు పాలనేనని చెబుతారు.
ప్రధానంగా గిరిజన రాష్ట్రం ఒడిశాకు నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి 23 సంవత్సరాలు దాటింది. విద్యాధికుడైన పట్నాయక్ కు గ్రౌండ్ రియాల్టీ తెలియదని అనేక సందర్భాల్లో నిరూపితమైంది, ఆయన తండ్రి బిజు పట్నాయక్ సీఎంగా ఉన్నప్పుడు కూడా నవీన్ చాలా మందికి తెలీదు. తండ్రి వారసత్వంగా సీఎం అయిన నవీన్ తన పాలనను సుస్థిరం చేసుకున్నారు. పట్నాయక్ పాలన తొలినాళ్లలో తలసరి ఆదాయం బాగా పెరిగినా తర్వాతి కాలంలో వృద్ధి రేటు మందగించింది. జాతీయ సగటు కంటే ఎక్కువ వర్షపాతం ఉన్న ఒడిశాలో నీటి పారుదల వసతులు మాత్రం అభివృద్ధి చెందక వ్యవసాయం కుంటి నడకలు నడుస్తోంది. హెక్టారుకు 2 వేల కిలోల పంట జాతీయ సగటు అయితే ఒడిశా సగటు 17 వందల కిలోలు మాత్రమే అన్నది మరిచిపోకూడదు. పట్నాయక్ పాలనలో వ్యవసాయ విస్తరణ జరగలేదు. దేశంలో వ్యవసాయ భూమి 51 శాతం ఉంటే ఒడిశాలో అది 43 శాతం మాత్రమే.
ఒడిశాలో పాలన మొత్తం ఒక వ్యక్తి చేతిలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. అసలు పరిపాలనను పట్టించుకున్న దాఖలాలు కనిపించవు. నేషలన్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం అక్కడ అవినీతి ఎక్కువ. మహారాష్ట్ర తర్వాత అత్యధిక అవినీతి ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు ఒడిశాలోనే ఉన్నాయట. ఇదీ ఒక సంవత్సరం గణాంకాలు కాదు. ప్రతీ సంవత్సరం అదే పరిస్థితి కనిపిస్తోంది. ఒడిశాలో నిరుద్యోగం ఎక్కువ . వేలాది మంది యువకులు చిన్న చిన్న ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారు. 30 ఏళ్ల లోపు వారిలో నిరుద్యోగం 32 శాతం ఉందని గణాంకాలు తేల్చిచెప్పాయి. ఒడిశాకు స్కాముల రాష్ట్రంగా కూడా పేరు ఉంది. అతి పెద్ద మైనింగ్ స్కాం అక్కడే జరిగింది. రెండు లక్షల కోట్ల రూపాయలు ఇనుము ఉక్కు మ్యాంగనీస్ స్కాముల రూపంలో తీరం దాటింది. ఒడిశా చిట్ ఫండ్ స్కామ్ దేశ వ్యాప్తంగా సంచనలమైన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇలా చెప్పుకుంటూ పోతే త్రిపురను మాణిక్ సర్కారు 20 ఏళ్లు పాలించిన తర్వాత బీజేపీ చేతిలో ఓడిపోయారు. ఆయన పాలనలో త్రిపురకు ఒరిగిందేమీ లేదు. సిక్కింలో చామ్లింగ్ దాదాపు 24 సంవత్సరాలు ఏలారు. అక్కడ టూరిజం తప్పితే ఏమీ కనిపించదు. 2019లో ఆయన ఓడిపోయి ఇంటికే పరిమితమయ్యారు. పశ్చిమ బెంగాల్లో మమత బెనర్జీ మూడో సారి అధికారాన్ని చేజిక్కించుకుని రెండేళ్లు కావొస్తోంది. ఉచితాలపైనే ఎక్కువ హామీలు ఇచ్చి ఆమె గెలిచిన మాట వాస్తవం కాకపోతే తృణమూల్ కూడా స్కాముల పార్టీ అని నిరూపితమైంది. పోంజీ స్కీములతో జనాన్ని మోసగించిన శారదా స్కామ్ లో ఎన్ని ఆరోపణలు వచ్చినా మమత తన మంత్రివర్గ సహచరులపై చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే రోజ్ వ్యాలీ స్కామ్ నారదా స్కామ్ కూడా జనంలో ప్రభుత్వం పట్ల అపనమ్మకాన్ని పెంచాయి. మమత ప్రతీ అంశానికి కేంద్రంతో పేచీ పెట్టుకుంటారన్న ఆరోపణలున్నాయి. ఆమెకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని చెబుతారు. కొవిడ్ మేనేజ్ మెంట్ లో కూడా మమత ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. హిందూ ముస్లిం ఓట్లను చీల్చి లబ్ధి పొందడంలో మమత సిద్ధహస్తురాలని కూడా తేల్చారు.
ప్రస్తుతం ప్రధాని మోదీ తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు టర్మ్స్ పూర్తి చేసుకోబోతున్నారు. మూడో సారి అధికారం కోసం ప్రయత్నిస్తున్నారు. గులాబీ దళపతికి తెలంగాణ మోనార్క్ అని కూడా పేరు ఉంది. చరిత్ర అడక్కు చెప్పింది చేయి అనే తీరు ఆయనది. ఎన్నికల్లో గెలవడం గెలిచిన తర్వాత ఇతర పార్టీల వారిని లాక్కుని మరింత బలోపేతం కావడం కేసీఆర్ కు తెలిసినట్లుగా మరెవ్వరికీ తెలియకపోవచ్చు. కేసీఆర్ పాలనలో స్కాములు ఎక్కువగా జరుగుతున్నాయని అవినీతి సొమ్మును ఓటర్లకు వెదజల్లి ఎన్నికల్లో గెలుస్తున్నారని కూడా ఆరోపణలున్నాయి. కాళేశ్వరం నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకూ ప్రతీదీ స్కామేనని విపక్షాలు అంటున్నాయి. పైగా కుటుంబ పాలన ఆశ్రిత పక్షపాతంలో కేసీఆర్ పెట్టింది పేరని చెబుతారు. రాజకీయాల్లో కుటుంబాన్ని ప్రోత్సహించడం వల్లనే వాళ్లు రెచ్చిపోతున్నారని ఇప్పుడు వారి స్కాములు ఢిల్లీ దాకా విస్తరించాయని తేలింది. అపరిమితమైన అధికారంతో ఇష్టానుసారం వ్యవహరించడం వల్ల అభివృద్ధి కూడా కేంద్రీకృతమై జిల్లాలో తూ తూ మంత్రం అభివృద్ధి మాత్రమే కనిపిస్తోందని గణాంకాలు చెబుతున్నాయి.
ఇక కేంద్రంలో మోదీ భజన ఎక్కువైంది. మోదీ సొంతం పబ్లిసిటీకి ఎక్కువ ప్రాధాన్యమిస్తూ దేశాభివృద్ధిని విస్మరించారన్న వాదన రోజురోజుకూ పెరుగుతోంది. ఉదయం లేస్తే కాంగ్రెస్ పై విరుచుకుపడే మోదీ ఆర్థికరంగంలో దేశానికి ఒరిగించిందేమీ లేదు. మేకిన్ ఇండియా ఒట్టి డొల్ల స్కీమ్. అన్ని విదేశీ వస్తువులతోనే రోజు గడిచిపోతుంది. తయారీ రంగం కుదేలై చాలా కాలమైంది ఎగుమతులు తగ్గిపోయాయి. రూపాయి విలువ రోజురోజుకు పతనమవుతోంది. ఉపాధి హామీ పథకం వేతనాల కోసం పేదలు వెంపర్లాడాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వ విధానాలతో పాటు ప్రకృతి వైపరీత్యాల కారణంగా వ్యవసాయం దెబ్బతిన్నది. పేదరికం పెరిగింది వినియోగం తగ్గింది. మోదీ పాలనలో గుజరాత్ కు లభించిన ప్రాధాన్యం ఎవరకీ దక్కలేదు. రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధింపే లక్ష్యంగా మోదీ పనిచేస్తున్నారన్న వాదనా రోజురోజుకు బలపడుతోంది. విపక్షాలు బలంగా లేని కారణంగా మోదీ ప్రభ వెలిగిపోతుందని చెబుతున్నారు.
అధికారానికి వచ్చిన తొలినాళ్లలో రెండు సార్లకు మించి ప్రధాని కావాలన్న కోరిక తనకు లేదని మోదీ చెప్పుకున్నారు. ఇప్పుడు మాత్రం ముచ్చటంగా మూడో సారి అధికారం కోసం ప్రయత్నిస్తున్నారు. తన పార్టీలో కూడా బలమైన నేతలను ఆయన పక్కన పెట్టేశారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ పేరుతో ఊరు పేరు తెలియని వారిని తీసుకొచ్చి సచీవులను చేశారు. అందుకే అన్ని చోట్ల ఇప్పుడు వినిపిస్తున్నమాట ఒక్కటే. రెండు సార్లకు మించి అందలం ఎక్కిస్తే నాయకుడు నియంత అవుతాడు. ప్రజాస్వామ్యాన్ని మరిచి ఇష్టానుసారం వ్యవహరిస్తాడు. మరి దేశ ప్రజలు ఆ సంగతి అర్థం చేసుకుంటే బావుంటుందేమో.