మాన ర‌క్ష‌ణ‌కోసం రోడ్డెక్కిన మ‌హిళా రెజ్ల‌ర్లు.. సిగ్గు సిగ్గు

By KTV Telugu On 3 May, 2023
image

బేటీ ప‌డావ్‌ బేటీ బచావ్‌ ఇదీ కేంద్ర‌ప్ర‌భుత్వ నినాదం. మ‌రి అలాంటి బేటీ అన్యాయం జ‌రిగింద‌ని గొంతెత్తితే త‌క్ష‌ణం స్పందించాలి. ఆరోప‌ణ‌లు ఎదుర్కున్న‌వారిని బోనులో నిల‌బెట్టాలి. కానీ కేంద్రం చెవులు రిక్కించి వినేందుకే ఐదునెల‌ల స‌మ‌యం ప‌ట్టింది. లైంగిక‌వేధింపుల‌పై అమ్మాయిలు గొంతెత్తితే వారికి భ‌రోసా ఇవ్వ‌డానికి కేంద్రం మీన‌మేషాలు లెక్కించింది. అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై ప‌త‌కాలు సాధించిన అమ్మాయిల‌ను పిలిచి భేష్ అని పొగిడిన ప్ర‌ధాని మోడీకి వారి ఆవేద‌న‌పై స్పందించేందుకు ఐదునెల‌ల స‌మ‌యం ప‌ట్టింది. త‌మ‌ను లైంగింకంగా ఎవ‌ర‌యినా వేధిస్తున్నార‌ని ఏ అమ్మాయి అయినా ఫిర్యాదుచేస్తే గంట‌ల వ్య‌వ‌ధిలో పోలీసులు స్పందించాలి. అభియోగాలు ఎదుర్కుంటున్న వ్య‌క్తిని చ‌ట్టం ముందు నిల‌బెట్టాలి. కానీ జంత‌ర్‌మంత‌ర్‌లో దీక్ష‌కు కూర్చున్న మ‌హిళా రెజ్ల‌ర్ల‌కు భ‌రోసా ఇవ్వ‌లేక పోవ‌డం కంటే అవ‌మాన‌క‌ర‌మైన విష‌యం ఇంకేముంటుంది.

ఢిల్లీ జంతర్ మంతర్ ద‌గ్గ‌ర ధర్నాలో కూర్చున్న ఒలింపియన్ పతక విజేతలతో సహా రెజ్లర్లకు మేం అండ‌గా ఉన్నామ‌న్న న‌మ్మ‌కాన్ని క‌లిగించేందుకు కేంద్రానికి దాదాపు ఐదునెల‌ల స‌మ‌యం ప‌ట్టింది. దశాబ్ద కాలంగా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారని వారు డిమాండ్ చేస్తున్నారు. వారు ఆరోప‌ణ‌లు చేసింది భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌మీద‌. అత‌ను స‌చ్చీలుడ‌ని కేంద్రం అనుకున్నా ముందు కేసు న‌మోదుచేసి ఆరోప‌ణ‌ల‌మీద విచార‌ణ‌కు ఆదేశించాల్సింది. ఒక‌వేళ అత‌ను స‌చ్చీలుడే అయితే విచార‌ణ‌లోనే అత‌న్ని త‌న నిజాయితీ నిరూపించుకోమ‌ని చెప్పాల్సింది. కానీ మ‌హిళా రెజ్ల‌ర్లు త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ట్లు కేంద్రం వారి ఆవేద‌న‌ని పెడ‌చెవిన పెట్ట‌డం దారుణం. చివ‌రికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నాకే లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లుపై పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదుచేశారంటే ఆ ఎంపీ మీద ఎందుకంత ప్రేమ‌ ఆయ‌న‌మీద ఎందుకంత గుడ్డిన‌మ్మ‌కం.

మ‌హిళా సాధికారిత గురించి మ‌న్‌కీబాత్ చెప్పిన ప్ర‌ధాని దేశ‌రాజ‌ధానిలో మ‌హిళా రెజ్ల‌ర్లు ఎందుకు నిర‌స‌న‌కు దిగాల్సి వ‌చ్చిందో స్పందించాల్సింది. ఎంత వేద‌న‌కు గురి కాక‌పోతే వారు దీక్ష‌కు దిగి ఉంటారో గుర్తించాల్సింది. త‌న‌కు రెండోసారి అధికారం క‌ట్ట‌బెట్ట‌టంలో మ‌హిళ‌లు చూపించిన చొర‌వ‌కు కృత‌జ్ఞ‌త‌గానైనా ప్ర‌ధాని మోడీ ఈ విష‌యాన్ని తీవ్రంగా తీసుకుని ఉండాల్సింది. క‌ర్నాట‌క ఎన్నిక‌లు ముంగిట్లో ఉన్న స‌మ‌యంలో మ‌హిళ‌లు ఆత్మాభిమానంతో రోడ్డెక్క‌టం బీజేపీ ప‌రువును బ‌జారున ప‌డేసింది. అదేదో రాజ‌కీయ ప్రేరేపిత‌మ‌నో దురుద్దేశ‌పూరిత‌మ‌నో ముందే కేంద్ర ప్ర‌భుత్వం ఓ అభిప్రాయానికి రావడం చారిత్ర‌క త‌ప్పిదం. మ‌హిళా రెజ్ల‌ర్ల పోరాటానికి అత్యున్న‌త న్యాయ‌స్థానం స్పందించాక ఢిల్లీ ముఖ్య‌మంత్రి ఆ వేదిక‌కు వెళ్లి సంఘీభావం తెలిపారు. ఇది బీజేపీని నైతికంగా దెబ్బ‌తీసే విష‌య‌మే. బ్రిజ్‌భూష‌ణ్‌ని కాపాడేందుకు బీజేపీ త‌న ప‌రువును ఎందుకు తాక‌ట్టుపెట్టింద‌న్న‌దే ఇప్పుడు అంద‌రినోటా వ‌స్తున్న ప్ర‌శ్న‌.

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగే కాదు హర్యానా మంత్రి సందీప్ సింగ్ కూడా మహిళా కోచ్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మ‌హిళా రెజ్ల‌ర్లు వేలెత్తి చూపించిన బ్రిజ్‌భూష‌ణ్ న‌య‌వంచ‌కుడ‌న్న విష‌యాన్ని ఎవ‌రూ దాచిపెట్ట‌లేరు. ఎందుకంటే అత‌నిపై 40 కేసులు ఉన్నాయి. యూపీ మాజీ మంత్రి వినోద్ కుమార్ సింగ్‌పై హత్యాయత్నం చేసిన 29 ఏళ్ల నాటి కేసులో న్యాయ‌స్థానం ఆయ‌న్ని నిర్దోషిగా విడుదల చేసింది. అయితే సాక్ష్యాలను సేకరించే ప్ర‌య‌త్నం చేయ‌నందుకు విచారణాధికారులకు కోర్టు అక్షింత‌ లేసింది. త‌న చేతుల‌మీదుగా ఓ హ‌త్య జ‌రిగింద‌ని ఆ బ్రిజ్‌భూష‌ణ్ ఇదివ‌ర‌కే కెమెరా సాక్షిగా ఒప్పుకున్నాడు. 1990 ప్రాంతంలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మనుషులకు సహాయం చేశాడనే ఆరోపణపై టాడా చట్టం కింద జైలుజీవితం కూడా గ‌డిపిన మ‌హానుభావుడు ఇప్పుడు రెజ్లింగ్ ఫెడ‌రేష‌న్‌ అధ్య‌క్షుడిగా లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్నాడు.

రాజ‌కీయంగా ప‌లుకుబ‌డి ఉండ‌బ‌ట్టే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ని బీజేపీ అంత‌గా వెన‌కేసుకొస్తోంది. అత‌ను నోట్లో వేలుపెడితే కొర‌క‌లేని అమాయ‌కుడిలా బీజేపీ పెద్ద‌ల‌కు క‌నిపిస్తున్నాడు. ఒలింపిక్స్‌లో జాతీయ‌ప‌తాకాన్ని చూసి భావోద్వేగంతో కంట‌త‌డిపెట్టిన మ‌హిళారెజ్ల‌ర్లు ఆ కీచ‌కుడి వేధింపుల‌ను త‌లుచుకుని జంత‌ర్‌మంత‌ర్‌లో భావోద్వేగానికి గురికావ‌డం కంటే సిగ్గుచేటైన విష‌యం మ‌రొక‌టి ఏముంటుంది. గోండా, బల్రాంపూర్, కైసర్‌గంజ్ నియోజకవర్గాల నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలిచిన బ‌ల‌వంతుడు ఆ బ్రిజ్‌భూష‌ణ్‌. రామజన్మభూమి ఉద్యమంలో భాగమైన బ్రిజ్‌భూష‌ణ్ బాబ్రీ కూల్చివేత కేసులో నిందితుడిగా ఉన్నారు. అందుకే ఆయ‌నంటే బీజేపీకి వ‌ల్ల‌మాలిన ప్రేమ‌. ఆయ‌న‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నా అది రాజ‌కీయంగా న‌ష్టంచేస్తుంద‌ని బీజేపీ ఆలోచించిందేగానీ త‌మ నైతిక‌త బోనులో నిల‌బ‌డింద‌న్న విష‌యాన్ని గుర్తించ‌లేక‌పోయింది.

లైంగిక వేధింపులపై ఆరోప‌ణ‌లు చేస్తున్న కొంద‌రు మ‌హిళా మ‌ల్ల‌యోధులు త‌మ ఓటుబ్యాంక్‌ని ఏమాత్రం ప్ర‌భావితం చేయ‌లేర‌న్న‌ది బీజేపీ ధీమా కాబోలు. అందుకే సుప్రీం స్పందించేదాకా బ్రిజ్‌భూష‌ణ్‌పై బీజేపీ ఈగ‌వాల‌నివ్వ‌లేదు. చివ‌రికి అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆదేశాల‌తో ఢిల్లీ పోలీసులు భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న‌ బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌పై రెండు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేశారు. ఇంత దూర‌మొచ్చినా ప‌ద‌విని వ‌దులుకోవడానికి బ్రిజ్‌భూష‌ణ్ సిద్ధంగా లేరు. ఆయ‌న‌తో రాజీనామా చేయించ‌డానికి బీజేపీ అస్స‌లు సుముఖంగా లేదు. రాజీనామా పెద్ద విష‌యం కాదంటూనే తానేమీ క్రిమిన‌ల్‌ను కాదంటున్నారు బ్రిజ్‌భూష‌ణ్‌. తాను ప‌ద‌విని వ‌దులుకుంటే మ‌హిళా రెజ్ల‌ర్ల ఆరోప‌ణ‌లు అంగీక‌రించిన‌ట్లేన‌ని బుకాయిస్తున్నాడు. ఒక అకాడ‌మీకి చెందిన ఒక కుటుంబం నిర‌స‌న‌లు చేప‌డుతోంద‌ని ఉల్టా ఆరోపిస్తున్నాడు. రంకునేర్చిన‌మ్మ బొంకు నేర్చింద‌న్న‌ట్లే ఉంది బీజేపీ ఎంపీ వ్య‌వ‌హార‌శైలి. ఇదే ప‌ని ఏ ప్ర‌తిప‌క్ష‌నేతో చేసుంటే ఈపాటికి ఊచ‌ల్లెక్క‌పెడుతూ ఉండేవాడే.