“మే”లోనే వానాకాలం.. ఎందుకీ వైపరీత్యం

By KTV Telugu On 3 May, 2023
image

అబ్బా ఎండా కాలమా వర్షాకాలమా అనే మాట ఇప్పుడు అందరూ ఒక్క సారి అయినా అనుకుని ఉంటారు. ఎందుకంటే వర్షాకాలంలో పడినట్లుగా దడ పుట్టించే వర్షాలు పడుతున్నాయి. చలి కాలంలో ఇవేం ఎండలురా బాబోయ్ అని అనుకోని వాళ్లు లేరు. ఎందుకంటే రాత్రికి చలి ఉన్నా తెల్లవారేసరికి ఎంట మంటలు పుట్టించింది. మరి వర్షాకాలంలో అతి వర్షాలే కాదు. మంచి ఎండలు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ సహజంగా కాదు ఎక్స్ ట్రీమ్‌గా ఉంటున్నాయి. సాధారణం కన్నా ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే అందరిలోనూ ఓ రకమైన చర్చ జరుగుతోంది. రుతువులు మారిపోయాయా వర్షాకాలం సమయం మారిపోయిందా అసలు అన్ని కాలల్లోనూ ఎండా వాన చలి ఎందుకు వదలడం లేదు. ఎందుకు వాటి తీవ్ర పెరుగుతోంది.

గత కొన్నేళ్ల నుంచి ఫిబ్రవరి నెల పూర్తికాకముందే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎండలు మండుతున్నాయి. ఫిబ్రవరిలో 35 నుండి 39 సెల్సియస్‌ డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే నెలకు వచ్చే సరికి వర్షాలు పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పుల ప్రభావం కనిపిస్తోంది. ఈ సాధారణంగా ఎండాకాలం, వానాకాలం, చలికాలం సైకిల్ ఉంటుంది. కానీ ఓ కాలం పూర్తి కాక ముందే మరొకటి వచ్చి పడుతోంది. ఇందులోనూ కొని అతి వృష్టి మరికొన్ని అనావృష్టిగా ఉండటంతో ప్రజల జీవన విధానంలోనూ స్పష్టమైన మార్పులు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

1986 నుంచి 2015 వరకు 29ఏళ్లలో భారతదేశం సగటు ఉష్ణోగ్రత పెరుగుతూనే ఉంది. అలాగే అకాల వర్షాలూ పెరిగిపోయాయి. దీనికి ప్రధానంగా ఎక్కువ మంది గ్లోబల్ వార్మింగ్ ప్రభావం అని చెప్పుకుంటూ వస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలలో సముద్ర మట్టాలు పెరగడం ఎడారుల విస్తరణ సహా సముద్రాల్లో వస్తున్న మార్పులు కూడా ఈ మార్పులకు కారణం అన్న అంచనాలను వాతావరణ శాస్త్రవేత్తలు వేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం “భారత్‌పై వాతావరణ మార్పుల అంచనా” అనే నివేదికను పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరాలజీ శాస్త్రవేత్తలు విడుదల చేశారు. అందులో వాతావరణ మార్పులకు సంబంధించిన కీలకమన అంశాలు ఉన్నాయి. గత రెండు మూడేళ్లుగా మేలో విపరీతమైన ఎండలు కాయాల్సి ఉన్న కాలంలో విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. గత ఏడాది మేలో కూడా హైదరాబాద్‌లో వరదలు వచ్చాయి. వాతావరణ నిపుణులు కూడా వీటిని అంచనా వేయలేకపోతున్నారు. ఎప్పుడు వర్షాలు వస్తాయో ఎప్పుడు ఎండలు దంచుతాయో అంచనా వేయలేకపోతున్నారు.

సాధారణంగా రైతులు పంటలను ప్రకృతికి అనువుగా ఉండేలా చూసుకుంటారు. అంటే వరదలు వచ్చే సమయానికి పంట చేతికొచ్చేలా చూసుకుంటారు. క్యూములో నింబస్ లేదా ఇతర కారణాల వల్ల వచ్చే అకాల వర్షాలు పడే సమయాల్లో ఎక్కువగా నష్టం జరగని పంటలు వేసుకుంటారు. రైతులకు ఈ అంశాలపై స్పష్టమైన అవగాహన ఉంటుంది. కానీ వాతారవరణ మార్పుల వల్ల అసలు సైకిల్ దెబ్బతినడంతో అకాల వర్షాలు పూర్తిగా మీద పడిపోతున్నాయి. ఫలితంగా రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది ప్రస్తుతం అదే జరుగుతోంది. రైతుల కన్నీరే ఎటు చూసినా కనిపిస్తోంది. పదిహేను రోజుల కిందట వడగళ్ల వాన ఇప్పుడు దంచికొట్టిన వానలతో చేతికొచ్చిన పంట నీటి పాలైంది. ప్రభుత్వాలు ఆదుకుంటాయా లేదా అన్న విషయం పక్కన పెడితే అసలు ఈ విపరీత వాతావరణం వల్ల దారుణమైన నష్టం మాత్రం జరుగుతోంది. అందులో ప్రధానంగా వ్యవసాయం ఉంటోంది.

ఏ దేశ ఆర్థిక వ్యవస్థలో అయినా వాతావరణం చాలా కీలకం. ఈ ఏడాది సాధారణ వర్షపాతం పడుతుందని అంచనాలు వస్తే స్టాక్ మార్కెట్లు పరుగులు పెడతాయి. ఎందుకంటే మన దేశంలో వ్యవసాయం బాగుంటే దేశం బాగుంటుంది. అది బాగుండాలంటే వానలు సమయానికి కురవాలి. ముందూ వెనుకా కురిసినా కష్టమే. వానాకాలం వర్షాలు పడే సీజన్ కు తగ్గట్లుగా రైతులు పంటలు వేసుకుంటారు. ముందే వచ్చే వానలు లేదా ఆలస్యంగా పడే వాటి వల్ల ప్రయోజనం ఉండదు. ఈ వాతావరణ మార్పుల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం పడుతోంది. అందుకే ఈ అకాల వర్షాలు విపరీత వాతావరణం ప్రజలకు ఆందోళనకరంగా మారుతోంది. అసలు ఎందుకు ఇలా మారుతోంది.