యాక్టివ్ పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పేసిన మరాఠీ చాణక్యుడు శరద్ పవార్

By KTV Telugu On 3 May, 2023
image

మరాఠీ చాణక్యుడు అలసిపోయాడు. ఎనిమిది పదుల వయసు మీద పడటం ఆరున్నర దశాబ్ధాల రాజకీయ జీవితంలో అలసిపోవడంతో పార్టీ అధ్యక్ష పదవికి సెలవిచ్చారు శరద్ పవార్. ఇందిరా గాంధీ నుండి సోనియా గాంధీ వరకు కాంగ్రెస్ అధ్యక్షులందరితోనూ సన్నిహితంగా ఉన్న పవార్ కేంద్ర మంత్రి వర్గంలో కీలకపదవుల్లో తనదైన శైలిలో రాణించారు. రాజకీయ చదరంగంలో గ్రాండ్ మాస్టర్ గా పేరు గడించారు. ఆడిన రాజకీయాలు ఇక చాలులే అనుకున్న పవార్ గుడ్ బై అనేశారు. ఇది రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రజా జీవితానికి మాత్రం దూరం కావడం లేదని స్పష్టత ఇచ్చారు. రెండున్నర దశాబ్ధాల ఎన్సీపీ ప్రస్థానంలో శరద్ పవార్ ముద్ర మామూలుది కాదు. పవార్ నాయకత్వాన్ని వదులుకోవడం ఇష్టంలేని పార్టీ శ్రేణులు పవార్ రాజీనామాను అంగీకరించడం లేదు. మీరే మా నాయకుడు మీరు రాజీనామా చేయడానికి వీల్లేదు అంటూ అనుచరులు కార్యకర్తలు భావోద్వేగంతో విజ్ఞప్తి చేశారు.

మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీలో చోటు చేసుకుంటోన్న పరిణామాలకు తోడు మేనల్లుడు అజిత్ పవార్ బిజెపితో టచ్ లో ఉన్నారని ఎన్సీపీని వీడి బిజెపి సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. వీటికి తోడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న జాతీయ హోదాను ఈ మధ్యనే ఎన్నికల సంఘం రద్దు చేసింది. మరీ వీటన్నింటి ప్రభావమూ ఆయనపై పడిందా లేక వయోభారంతో నాయకత్వ బాధ్యతలు బరువుగా భావిస్తున్నారా అన్నవి తెలీదు కానీ పవార్ మాత్రం అధ్యక్ష పదవినుంచి తప్పుకోడానికి రెడీ అయిపోయారు. పవార్ ప్రకటనతో రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు పుట్టాయి. ప్రత్యేకించి 2024 ఎన్నికల్లో నరేంద్ర మోదీని నిలువరించడానికి విపక్షాలన్నింటినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ తో పాటు ఇతర పక్షాలు విశ్వ ప్రయత్నాలు చేస్తోన్న తరుణంలో పవార్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడంతో విపక్షాలు షాక్ కి గురయ్యాయి. 65ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతోన్న శరద్ పవార్ వంటి నేత సలహాలు సూచనలు విపక్ష కూటమికి ఉండాలని పలువురు నేతలు భావిస్తున్నారు. అటువంటి నేపథ్యంలో పవార్ యాక్టివ్ పాలిటిక్స్ కు దూరం జరగాలనుకోవడం విపక్షాలకు రాజకీయంగా నష్టమే అని చెప్పక తప్పదు.

పవార్ రాజీనామాతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలవర పడుతూ ఉంటే పవార్ మేనల్లుడు అజిత్ పవార్ వారికి భరోసా ఇచ్చారు. శరద్ పవార్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినప్పటికీ పార్టీని నడిపించేది ఆయనే అని అజిత్ పవార్ చెప్పుకొచ్చారు. మరాఠా రాజకీయాలపై చెరగిపోని ముద్ర వేశారు శరద్ పవార్. అంతే కాదు సహకార చక్కెర మిల్లుల వ్యవస్థపై పవార్ వేసిన ముద్ర అనితర సాధ్యమైనది. ఎప్పటికైనా భారత ప్రధాని కావాలని శరద్ పవార్ కలలు కన్నారు. రెండు సార్లు ఆ పదవికి దగ్గరదాకా వెళ్లినట్లే వెళ్లి పదవికి అల్లంత దూరంలో ఆగిపోక తప్పలేదు. బహుశా ఇపుడు కూడా విపక్షాల కూటమికి బిహారు ముఖ్యమంత్రి నితిష్ కుమార్ ను తెరపైకి తీసుకురావడం వల్లనే శరద్ పవార్ ఇక తనకు జీవితంలో ప్రధాని అయ్యేయోగం లేదని నిరాశకు గురై ఉండచ్చంటున్నారు. ఆ కారణంతోనే యాక్టివ్ పాలిటిక్స్ పట్ల అనాసక్తి ఏర్పడి ఉండచ్చని అంటున్నారు. మహారాష్ట్రలో గత అసెంబ్లీ ఎన్నికల్లో భిన్న ధృవాల్లాంటి పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చిన చాణక్యం శరద్ పవార్ దే. శివసేన కాంగ్రెస్ లను మొదటి సారి కలిసిన పవార్ అఘాడీ కూటమి ప్రభుత్వం ఏర్పటులో కీలక పాత్ర పోషించారు. ఉద్ధవ్ థాకరేని ముఖ్యమంత్రిని చేశారు. అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో శివసేనలో షిండే తిరుగుబాటు జెండా ఎగరేసి ఉద్ధవ్ ను గద్దె దింపారు. ప్రభుత్వం చేతులు మారింది.

ఆ తర్వాత కొద్ది రోజుల ముందే షిండేని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టిన బిజెపి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీపై దృష్టి సారించినట్లు వార్తలు వచ్చాయి. బిజెపి అగ్రనేతలతో శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి భేటీ అయ్యారని వార్తలు వచ్చాయి. త్వరలోనే అజిత్ పవార్ బిజెపి సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్న పుకార్లూ షికార్లు చేశాయి. అయితే వాటిని శరద్ పవార్ తో పాటు అజిత్ పవార్ కూడా ఖండించారు. అటువంటిదేమీ లేదన్నారు. 2019లోనే మహావికాస్ అఘాడీ కూటమిని అస్థిర పాలు చేసే ప్రయత్నం జరిగిందని తన ఆత్మకథలో శరద్ పవార్ చెప్పుకొచ్చారు. అప్పట్లో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పాటుకు తాను పనిచేస్తోన్న సమయంలో తన మేనల్లుడు అజిత్ పవార్ బిజెపి మాజీ సిఎం దేవేండ్ర ఫడ్నవీస్ తో భేటీ అయినట్లు ప్రచారం జరిగిందని దాని వెనుక తన ప్రమేయమే ఉన్నట్లు ప్రచారం చేశారని పవార్ గుర్తు చేసుకున్నారు. అయితే దాంతో తనకు సంబంధం లేదని ఉద్ధవ్ థాకరేకు స్వయంగా ఫోన్ చేసి చెప్పానని పవార్ అన్నారు. తన పేరును వాడుకుని అఘాడీ కూటమిని దెబ్బతీసేందుకు బిజెపి నేతలే ఆ డ్రామా ఆడారని తర్వాత ఉద్ధవ్ కు కూడా అర్దమైందని పవార్ వివరించారు.

కొద్ది రోజుల క్రితం శరద్ పవార్ కూతురు సుప్రియా శూలే ఓ సంచలన ప్రకటన చేశారు. అతి త్వరలో దేశంలో రెండు కుదుపులు చూస్తారని సుప్రియ అన్నారు. అందులో ఒకటి ఢిల్లీలోనూ రెండోది మహారాష్ట్రలో చూడబోతున్నారని అన్నారామె. ఆమె చెప్పిన కుదుపు శరద్ పవార్ రాజీనామాయే కావచ్చునని భావిస్తున్నారు. 83 ఏళ్ల వయసున్న శరద్ పవార్ 18 ఏళ్ల వయసులోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. విద్యార్ధి దశ నుండే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. 38 ఏళ్ల వయసులో అతి పిన్ని వయసులో మహారాష్ట్రకు ముఖ్యమంత్రి అయ్యి చరిత్ర సృష్టించారు. మొత్తం మీద నాలుగు సార్లు మరాఠా గడ్డకు ముఖ్యమంత్రి అయ్యారు. కాకపోతే ఏ ఒక్కసారీ కూడా పూర్తి కాలం పదవిలో లేరు. అలాగే దివంగత పి.వి.నరసింహారావు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్ లో మంత్రి పదవులు నిర్వర్తించారు. మరాఠా రాజకీయాలపై  చెరిగిపోని సంతకం పవార్ ది. ఉన్నట్లుండి శరద్ పవార్ ఎందుకు రాజీనామా చేసినట్లు ఆయనకు హఠాత్తుగా ఏమీ అనారోగ్యం రాలేదు. ఎనిమిది పదులు దాటినా యాక్టివ్ గానే ఎత్తులు వేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ నాయకత్వంతో స్నేహంగా ఉంటూనే అటు బిజెపి అగ్రనేతలతో మంతనాలు జరుపుగూ ఉంటారు. వీటి వెనుక ఆయన వ్యూహం ఏమిటన్నది ఎవ్వరికీ అంతు చిక్కదు.

కొంతకాలంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో పవార్ మాట చెల్లుబాటు కావడం లేదని ప్రచారం జరుగుతోంది. మేనల్లుడు అజిత్ పవార్ సొంత వ్యూహాల అమలుకు పావులు కదుపుతోన్నట్లు అనుమానిస్తున్నారు పవార్. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామాస్త్రాన్ని సంధించారు. 2019 ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎవరికీ పూర్తి మెజారిటీ రాలేదు. తమని ఖాతరు చేయడం మానేసిన శివసేనపై  కమలనాథులు గుర్రుగా ఉన్నారు. ఆ సమయంలో శరద్ పవారే చక్రం తిప్పారు. కాంగ్రెస్-శివసేనల మధ్య తానే వారధిగా నిలిచారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేశారు. అయితే శివసేనపై కక్షతో ఉన్న బిజెపి కొంతకాలం తర్వాత షిండేని ట్రాప్ చేసి ఉద్ధవ్ పై తిరుగుబాటు జెండా ఎగరేయించి శివసేనను చీల్చింది. ఉద్ధవ్ ఉద్యోగం ఊడబీకింది. ఇపుడు షిండేని పక్కన పెట్టి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని చీల్చడానికి బిజెపి కొత్త ఎత్తుగడ వేస్తోన్నట్లు రాజకీయ పండితులు అనుమానిస్తున్నారు. ఆ క్రమంలో భాగంగానే పవార్ మేనల్లుడు అజిత్ ను బిజెపి టచ్ లో ఉంచుకుందని అంటున్నారు. శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీకి పాత కాపు. ఆ పార్టీలో తనకున్న సీనియారిటీకి కచ్చితంగా ప్రధాని కావలసిందే అనుకున్నారు. అయితే అది కుదరలేదు. పార్టీ అధ్యక్ష పదవి కూడా దక్కలేదు.

తనను కాదని సీతారాం కేసరిని అధ్యక్షుణ్ని చేయడం వెనుక సోనియా ప్రమేయం ఉందని భావించిన పవార్ ఆమెపై కోపం పెంచుకున్నారు.  ఆ కారణంతోనే 1999లో ప్రధాని పదవికి సోనియా గాంధీ సిద్ధం అవుతున్నారని తెలిసి పార్టీలో తనలాగే ఆలోచించే సంగ్మా, తారిఖ్ అన్వర్ లను కలుపుకుని పవార్ ఓ బాంబు పేల్చారు. కాంగ్రెస్ తరపున ప్రధాని అభ్యర్ధిగా భారతీయులనే ప్రకటించాలి తప్ప విదేశీ మూలాలు ఉన్నవారిని  ప్రకటించకూడదని నినదించారు పవార్. ఇటలీకి చెందిన సోనియా గాంధీ ప్రధాని కావడానికి అర్హులు కారని పట్టుబట్టారు. దీంతో పవార్ తో పాటు సంగ్మా, తారిఖ్ లను పార్టీ నుండి ఆరేళ్ల పాటు బహిష్కరించారు. అప్పుడే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నెలకొల్పారు పవార్. ఒక పక్క మహారాష్ట్రలో కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు పవార్. మరో పక్క చీటికీ మాటికీ బిజెపి అగ్రనేతలతో మంతనాలు జరుపుతూ ఉండడంతో విపక్షాలు పవార్ ను పూర్తిగా నమ్మలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే విపక్షాల సారధిగా నితిష్ కుమార్ ని ఎన్నుకున్నారు విపక్ష నేతలు. ఇక తనకు జీవితంలో ప్రధాని పదవి అన్నది దక్కే యోగం లేదనుకున్నారో ఏమో కానీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం ద్వారా యాక్టివ్ పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పారు పవార్.