కశ్మీర్ ఫైల్స్మీద దుమారం సద్దుమణిగిందో లేదో మంట ఆరకుండా చూసేందుకు మరో సిన్మా తెరపైకొచ్చింది. అదే ది కేరళ స్టోరీ. తెరవెనుక జరుగుతున్నదాన్నే తెరమీదికి తెస్తున్నామంటోంది ఆ సినిమా యూనిట్. కానీ కేరళ స్టోరీ చుట్టూ రాజకీయ రచ్చ జరుగుతోంది. సెన్సార్ పూర్తిచేసుకుని మే5న రిలీజ్ అవుతున్న కేరళ స్టోరీ సిన్మా కథ, చిత్రీకరణ కంటే దాని మోటివ్పైనే పెద్ద యుద్ధం మొదలైంది. కేరళ రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని ఘటనల ఆధారంగా ఈ సినిమా తీశామన్నది దాన్ని తెరకెక్కించినవారి వాదన. కానీ ఈ సిన్మాపై రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. ఓ మతాన్ని లక్ష్యంగా చేసుకున్నారని కశ్మీర్ ఫైల్స్లాగే భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈసిన్మాలో వివాదాస్పదమైన దాదాప 10 దృశ్యాలకు కత్తురేసిన సెన్సార్‌బోర్డు చివరికి A సర్టిఫికెట్ ఇచ్చింది. కొన్ని డైలాగుల్లో మార్పులు చేయాలని కూడా సెన్సార్ బోర్డ్ సూచించింది.
మతమార్పిడులు చేస్తూ ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారన్నది కేరళ స్టోరీ మెయిన్ థీమ్. రాజకీయంగా దుమారం రేపుతున్న ఈ సినిమాలో కేరళ మాజీ సీఎం ఇంటర్వ్యూ సన్నివేశాన్ని తొలగించాలని సెన్సార్‌బోర్డు ఆదేశించింది. శత్రుదేశాన్ని ఉద్దేశించి పెట్టిన డైలాగులు మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న సన్నివేశాలపై సెన్సార్ బోర్డు కోత విధించింది. తమ రాష్ట్ర పేరుతో తెరకెక్కిన వివాదాస్పద సిన్మాపై కేరళలోని అధికార కమ్యూనిస్ట్ ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇదంతా కట్టుకథని దుమ్మెత్తి పోస్తున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఏది పడితే అది తీస్తే కుదరదంటున్నాయి విపక్షాలు. కేరళ స్టోరీ సిన్మాని రాష్ట్రంలో అడ్డుకుని తీరతామని స్వయానా సీఎం విజయన్ హెచ్చరించేదాకా వెళ్లింది. కేరళని ఉగ్రవాద కేంద్రంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దీంతో కేరళలో ఈ సిన్మా అగ్గిరాజేసేలా ఉంది.
2018-2019లో ఇస్లాం మతంలోకి మార్చబడి వారిని అక్రమంగా ఐసిస్‌తో ఇతర ఇస్లామిక్ యుద్ధ ప్రాంతాలకు అక్రమంగా రవాణాచేసిన కేరళలోని హిందూ మహిళల వాస్తవిక జీవితాల చుట్టూ ఈ కథ తిరుగుతుందనేది దర్శక, నిర్మాతలు చెబుతున్న మాట. కేరళలో దాదాపు 32వేల మంది మహిళల అదృశ్యం వెనుక జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించినట్టు చెబుతున్నారు. మహిళలను సెక్స్ బానిసల్లా మార్చేస్తున్న ఈ ఘటనలపై పూర్తి స్థాయిలో అధ్యయనం తర్వాతే సినిమా తీశామనేది వారి వాదన. అక్షరాస్యతలో ముందుండే కేరళ ప్రజలు సినిమా చూడకముందే ఓ అభిప్రాయానికి రావద్దంటోంది కేరళ స్టోరీ యూనిట్. అయితే కేరళ స్టేట్ కమిటీ ఆఫ్ ముస్లిం యూత్ లీగ్ ఈ సిన్మా కథనాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ సినిమా ఆరోపణలను ఆధారాలతో ఎవరైనా నిరూపిస్తే కోటి రూపాయలు ఇస్తామని ప్రకటించింది. అయితే హిందూ సంఘాలతో పాటు అక్కడి చర్చి సంఘాలు మాత్రం కేరళలో జరుగుతున్న విషయాలనే ఈ సినిమాలో చూపెట్టినట్టు చెబుతున్నారు. దీంతో ఎవరి వాదన నిజమో అర్ధం కాని పరిస్థితి ఉంది.
కేరళతోనే ఆగలేదు సిన్మా వివాదం. తమిళనాడుకు కూడా పాకింది. కేరళలో తీవ్ర వ్యతిరేకత రావడంతో తమిళనాడులో ది కేరళ స్టోరీ సిన్మా ప్రదర్శనకు అనుమతి ఇవ్వకూడదని నిఘా సంస్థ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. మరోవైపు ప్రమోషన్లో భాగంగా కేరళ స్టోరీ సిన్మాని ఢిల్లీ జేఎన్‌యూలో ప్రదర్శించడంపైన కూడా వివాదం రాజుకుంది. వర్సిటీ క్యాంపస్‌లో ఏబీవీపీ ఈ సిన్మాని ప్రదర్శించడంపై వామపక్ష విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ అభ్యంతరం వ్యక్తంచేసింది. కేరళ స్టోరీ చిత్రాన్ని థియేటర్లలో ఓటీటీ వేదికలపై విడుదల కాకుండా సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ని ఆదేశించాలంటూ జమైత్ ఉలామా-ఇ- హింద్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ సిన్మా సమాజంలో విభజన తీసుకొచ్చేలా ఉందని పేర్కొంది. ఇంటర్నెట్లో సిన్మా ట్రైలర్‌ని తొలగించాలని పిటిషన్లో పేర్కొంది. దీనిపైనే దాఖలైన మరో పిటిషన్‌ని అంతకుముందే సుప్రీం కొట్టేసింది. కశ్మీర్ ఫైల్స్ దేశమంతా అలజడి రేపితే కేరళ స్టోరీ దక్షిణాన చిచ్చురేపేలా ఉంది.