ఒకప్పుడు రాజకీయమంటే కాస్త మర్యాద సంస్కారం ఉండేవి. ఇప్పుడు బురదలో పొర్లే జంతువులకూ మల్లెపువ్వుల్లాంటి బట్టలేసుకున్న నేతలకూ పెద్దగా తేడా లేకుండా పోతోంది. ఢిల్లీస్థాయి నేతలు కూడా గల్లీభాష మాట్లాడుతున్నారు. సాధారణంగా రాజకీయాల్లో సిద్ధాం తపరంగా పార్టీ భావజాలపరంగా ప్రత్యర్థులే తప్ప వ్యక్తిగత శత్రువులు ఉండరు. ఉండకూడదు. ఒకప్పుడు అధికార పార్టీ నేతలెవరైనా ప్రతిపక్ష నేతలను గౌరవించేవారు. అలాగే ప్రతిపక్ష నేతలు కూడా ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడమో దుమ్మెత్తిపోయడమో పనిగా పెట్టుకోకుండా సద్విమర్శలు చేసేవారు. కానీ ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల ముందు విలువలు పలుచనైపోయాయి. అబద్దాన్నయినా అతికినట్లు చెప్పడంలో నేతలు ఆరితేరిపోతున్నారు. తుడుచుకుంటారో అలాగే ఉంచుకుంటారో మీ ఇష్టమంటూ బట్టకాల్చి మొహానేస్తున్నారు.
ఎన్నికలొస్తే నియమావళి ఉల్లంఘన ఎంత సహజమే నైతిక నియమాల ఉల్లంఘన కూడా అదే రీతిలో జరిగిపోతోంది. కర్నాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు వ్యక్తిగత దూషణలదాకా వెళ్తున్నాయి.
సంస్కారంకాదనీ సభ్యత మరిచిపోరాదని కాస్త ఇంగితజ్ఞానంతో వ్యవహరించాలన్న విషయాన్ని అన్నిపార్టీల నేతలు మరిచిపోతున్నారు. తమ స్థాయిని మరిచి చౌకబారు వ్యాఖ్యలకు దిగజారుతున్నారు. ఎన్ని తిట్లు తింటే, ఎన్ని తిట్లు తిడితే అంత పెద్ద లీడర్ అనే స్థాయికి వచ్చారు. ప్రత్యర్థులను కవ్వించేలా పరుష పదజాలాన్ని వాడుతున్నారు. వ్యక్తిగత దూషణలకు తెగబడుతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో తిట్ల పురాణం మొదలైంది. ప్రధాని మోడీపై ఖర్గే వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రధాని విష సర్పం లాంటివారని ఆయన తెచ్చిన పథకాలు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయేమోగానీ రుచిచూస్తే చావు తప్పదన్నట్లు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఖర్గే విమర్శలకు ఘాటైన కౌంటర్ ఇచ్చారు ప్రధాని. ఖర్గే తనను సర్పంతో పోల్చడంపై బాధగా లేదన్నారు మోడీ. శివుడి మెడలో సర్పం ఆభరణంగా ఉంటుందన్నారు. దేశ ప్రజలే తనకు ఈశ్వరుడి స్వరూపమంటూ తిట్టుని కూడా సెంటిమెంట్ అస్త్రంలా మార్చుకున్నారు.
మల్లిఖార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే కూడా తండ్రి తరహాలోనే కామెంట్లు చేశారు. కర్ణాటకలోని కలబుర్గిలో బంజారాలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని చేతగానివాడిగా ఆరోపించారు. తండ్రీ కొడుకుల వ్యాఖ్యలపై హోంమంత్రి అమిత్‌షా ఘాటుగా బదులిచ్చారు. కాంగ్రెస్ పార్టీతోపాటు వారి నేతలకు మతితప్పిందని ఆరోపించారు. ప్రపంచదేశాలు మోడీకి ఎంతో గౌరవంతో స్వాగతం పలుకుతుంటే కాంగ్రెస్ మాత్రం ప్రజలను రెచ్చగొట్టే పనిలో పడిందన్నారు అమిత్‌షా. కర్నాటక ప్రచారంలో మోడీ తనను కాంగ్రెస్ నాయకులు తిట్టిన తిట్లతో పెద్ద చిట్టానే తయారైందన్నారు. ఆ లిస్ట్ అంతా కలిపి 91 సార్లు అయిందని మోడీ ఒక లెక్క చెప్పారు. దీనికి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ నుంచి అంతే వేగంగా కౌంటర్ వచ్చిపడింది.
మోడీని కాంగ్రెస్ నేతలు తిట్టిన తిట్లు 91 సార్లేనని కానీ మోడీ టీం, బీజేపీ పెద్దలు తిట్టిన తిట్లని లెక్కేస్తే పుస్తకాలేనని గట్టి కౌంటర్ ఇచ్చేశారు. దేశంకోసం ఎన్నో త్యాగాలు చేసిన తమ కుటుంబాన్ని కూడా బీజేపీ నేతలు నిందించారన్న ప్రియాంకగాంధీ వాటికి లెక్క తేల్చడం కూడా కష్టమంటున్నారు. దేశం కోసం తాను దూషణలు తూటాలను స్వీకరించడానికి సిద్ధమంటున్న తన సోదరుడు రాహుల్‌గాంధీని చూసి నేర్చుకోవాలని మోడీకి ప్రియాంకగాంధీ హితవు చెప్పారు. ఎన్నికలయ్యేలోపు నేతల తిట్లు వినలేక కర్నాటక ప్రజల చెవుల్లోంచి రక్తం కారేలా ఉంది. కిందిస్థాయి నేతలెవరయినా నోరు పారేసుకుంటే మందలించి కట్టడి చేయాల్సిన అగ్రనేతలే అంతా మా ఇష్టమన్నట్లు ప్రవర్తిస్తున్నారు. తిట్లతోనే చప్పట్లు పడతాయనుకుంటున్నారు. ఎన్ని ఆరోపణలు చేస్తే అన్ని ఓట్లు రాలతాయన్న భ్రమతో ఉన్నారు. విసరడానికి కాళ్లకు చెప్పులున్నా ప్రజలు మౌనంగా అన్నీ వింటున్నారు. తమ సమయం వచ్చినప్పుడు ఎవరికెలా బుద్ధిచెప్పాలో వాళ్లకు బాగా తెలుసు.