ఎండాకాలం వానలతో హాయిగా ఉందనుకుంటున్నారా? ఇవి ఎంత ప్రమాదకరమో తెలుసా

By KTV Telugu On 4 May, 2023
image

 

చలికాలం రాకమునుపే వొణుకు పుట్టే చలి వస్తోంది. ఎండాకాలం రాకమునుపే భానుడు భగ్గుమంటున్నాడు. వానలకైతే లెక్కనేలేదు ఎప్పుడు పడితే అప్పుడే పడుతున్నాయి. అబ్బా మంచి ఎండా కాలంలో చల్లటి గాలి వర్షం వస్తుందని మనం రిలీఫ్ ఫీలవుతాం. కానీ ఈ వాతావరణ మార్పుల వల్ల మానవ సమాజానికి జరుగుతున్న నష్టం ఎంతో తెలిస్తే ఒళ్లు గగుర్పొడవడం ఖాయం. ఎందుకంటే ఏ కాలంలో జరగాల్సింది ఆ కాలంలో జరగాలి. ఏది ప్రకృతి విరుద్ధంగా జరిగినా దాని వెనుక ఎంతో వినాశనం ఉంటుంది. ఆ ప్రతిఫలాలు ఇప్పుడు ప్రపంచం అనుభవిస్తోంది. ఆ నష్టాలు మనం కూడా అనుభవిస్తున్నాం.

వాతావరణంల వచ్చిన మార్పులన్నీ కలిసి రైతును ఆగమాగం చేస్తున్నయి. భూమినే నమ్ముకున్న రైతు నష్టాల పాలవుతున్నాడు. ఇప్పుడు పడిన అకాల వర్షాలు వడగళ్ల వానల వల్ల రైతులు పడుతున్న అగచాట్లు కళ్ల ముందే ఉన్నాయి. మామిడి పూత రాలిపోతున్నది వరి మునుగుతున్నది మక్కలు ముక్కిపోతున్నయి. ప్రకృతి సిద్దంగా దొరికే పూలు పండ్లు వంటి వాటి కరత ఏర్పడుతోంది. వర్షాకాలం ప్రారంభం అయిన తర్వాతే సాగు పనులు మొదలుపెడుతారు రైతులు. తాత ముత్తాల నాటి నుంచి ఇలాగే సాగు చేసేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎప్పుడు వానలు పడతాయో ఎప్పుడు ఎండలు కాస్తాయో తెలియడం లేదు. అవసరం లేకున్నా వర్షాలు కురుస్తున్నయ్​. అవసరం ఉన్నప్పుడు చినుకు చుక్క పడడం లేదు.

రైతుల జీవనోపాధికి కావాల్సింది ఆరోగ్యకరమైన భూమి నమ్మదగిన వాతావరణం మాత్రమే. కానీ ఇప్పుడు ఈ రెండూ లేవు. అధిక వర్షపాతం తరచుగా వరదలు రావడం చాలా రోజులు పొడి వాతావరణం ఉండడం లాంటి పరిస్థితులు కరువుకు దారితీస్తున్నాయి. వాతావరణంలో మార్పుల వల్ల రోజులో పగటి రాత్రి ఉష్ణోగ్రతల్లో కూడా తేడాలు ఉంటున్నాయి. దీనివల్ల కొన్ని రకాల పంటల దిగుబడి బాగా తగ్గిపోతోంది. మామిడి దిగుబడి తగ్గడానికి ఇది కూడా ఒక కారణం. రాత్రి పూట ఉండాల్సిన ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉన్నా పగలు తక్కువగా ఉన్నా కొన్ని రకాల చెట్ల పిందెలు రాలిపోతాయి. ఉష్ణోగ్రతల్లో మార్పులు ఎక్కువగా ఉంటే ఫలదీకరణ సరిగా జరగదు దాంతో దిగుబడి తగ్గుతుంది. పైగా పూత ఆలస్యంగా రావడం లేదంటే తొందరగా రావడం లాంటివి జరుగుతాయి. ప్రపంచంలో వ్యవసాయానికి పనికొచ్చే మొక్క జాతుల్లో దాదాపు70 శాతం ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ ఎఫెక్ట్​ మామిడి మీదనే కాదు మిగతా పంటల మీద కూడా ఉంది.

వాతావరణ మార్పు, వ్యవసాయం, పోషకాహారం ఈ మూడింటికీ ఒకదానితో మరొకదానికి సంబంధం ఉంది. వాతావరణంలో వచ్చే మార్పులు పంట దిగుబడినే కాదు ఆహార వైవిధ్యాన్ని, ఫుడ్​ క్వాలిటీని, న్యూట్రియెంట్​ డెన్సిటీని తగ్గిస్తాయి. 2019లో వెల్లడించిన ఓ సర్వేలో ఫుడ్​ న్యూట్రియెంట్స్​ మీద వాతావరణ మార్పుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని వెల్లడైంది. ముఖ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలు, కార్బన్ డై ఆక్సైడ్​ స్థాయిలు పంట, నేల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అస్థిర వర్షపాతం ధాన్యాల పోషకాల నాణ్యతపై ఎఫెక్ట్​ చూపిస్తుంది. అలాగే వాతావరణంలో పెరిగిన కార్బన్ డై ఆక్సైడ్ మొక్కల్లో ప్రొటీన్ సంశ్లేషణకు అవసరమైన ప్రక్రియలకు ఆటంకం కలిగిస్తుంది. దాంతో ధాన్యాల పోషక నాణ్యతలో క్షీణత వస్తుంది. ఇలాంటి ఫుడ్​ తింటే కడుపు నిండుతుంది. కానీ శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. ముఖ్యంగా ఐరన్​, జింక్ లాంటి పోషకాలు బాగా తగ్గుతాయి. యునైటెడ్ స్టేట్స్, జపాన్, ఆస్ట్రేలియాల్లో చేసిన కొన్ని ప్రయోగాల్లో తెలిసింది ఏంటంటే గోధుమ, వరి, మొక్కజొన్న, బఠాణీ, సోయా పంటలు కార్బన్​ డై ఆక్సైడ్​ ఎక్కుగా ఉన్న ప్రాంతాల్లో పండించినప్పుడు ధాన్యంలో ఐరన్​, జింక్ ఉండాల్సిన స్థాయికంటే చాలా తక్కువగా ఉన్నాయి.2022లో వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం వాతావరణ మార్పు వల్ల పోషకాహార లోపం, సూక్ష్మపోషకాల లోపం తలెత్తుతుంది. అందువల్ల 2050 నాటికి ప్రపంచంలోని 10 శాతం ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. అంటే మానవాళికే ముప్పు పొంచి ఉందని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.

గ్లోబల్​ వార్మింగ్​ని తగ్గించకపోతే 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు140 మిలియన్ల మంది జింక్ లోపంతో బాధపడతారని అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ దక్షిణాసియాలో ఆహార, వాణిజ్య పంటల దిగుబడి తగ్గుతోంది. పంటల దిగుబడి తగ్గుతుండడం వల్ల ఆహార కొరత ఏర్పడుతోంది. దేశ వ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం వల్ల భవిష్యత్తులో వరి, గోధుమ దిగుబడులు విపరీతంగా తగ్గే ప్రమాదం ఉందని సైంటిస్ట్​లు చెప్తున్నారు. 2030 నాటికి ప్రపంచంలో మొక్కజొన్న దిగుబడి 24 శాతం వరకు తగ్గుతుందనేది ఒక అంచనా. చెరకు లాంటి పంటల దిగుబడి కూడా తగ్గుతుందట. ఇలా చూస్తే ప్రతీ ఆహార పంట పై కూడా ఈ వాతావరణ మార్పు ప్రభావం ఉంటుంది.