సరికొత్త రాజకీయాల కోసం ప్రజల ఎదురుచూపు
ప్రస్తుత రాజకీయాలతో విసిగిపోయిన సమాజం
జగన్, చంద్రబాబు పట్ల లేదు సానుకూలత
ట్రెండ్ మారాలన్న తపన నూతన రాజకీయ శక్తి అవతరించాలని ఆకాంక్ష పువ్వాడ అజయ్ ఆహ్వానంతో జూనియర్ వైపు దృష్టి జూనియర్ అభిమానులు గోప్యంగా ప్లాన్ చేస్తున్నారా. తాతకు తగ్గ మనవడు జూనియర్ ఇటీవలే అమిత్ షాతో జూనియర్ భేటీ. రాజకీయాలు మారుతున్నాయి. కొత్త తరం రాజకీయాలు రావాల్సిన అనివార్యత ఏర్పడింది. వస్తున్నాయి కూడా. ఎందుకంటే పాత తరం రాజకీయ నాయకులు, వారి విధానాల పట్ల పామర జనం విసుగెత్తిపోయారు. కొత్తదనం కోరుకుంటున్నారు. తమ ఆశయాలు, ఆకాంక్షలను కొత్త నాయకులు నెరవేర్చుతారన్న విశ్వాసం వారిలో కలుగుతోంది. కాలం చెల్లిన రాజకీయాలను గంగలో కలిపేసి రాజకీయాల్లో కొత్త నీరు పారించాలన్న కోరిక జనంలో కనిపిస్తోంది.
నాయకులు ఇప్పుడు ప్రజా సంక్షేమంపై దృష్టి తగ్గించేశారు. పరస్పర ఆరోపణలకు దిగుతున్నారు. దుమ్మెత్తిపోసుకుంటున్నారు. పరస్పరం కక్షసాధింపుకు దిగుతున్నారు. వారి రాజకీయ హోరులో సంక్షేమ జోరు తగ్గింది. ఆ గందరగోళంలో జనం బాధలు పట్టించుకునే నాధుడు కరువయ్యాడు. అదే ఇప్పుడు మార్పుకు నాంది అవుతోంది. తెలుగు ప్రజలు ఇప్పుడు రాజకీయ చౌరస్తాలో నిల్చున్నారు. మూడు దిక్కులేని దారులు. ఒక్కటే మంచి దారి. ఆ దారేదో కరెక్టుగా తెలుసుకుని వారిని చేయి పట్టి నడిపించే నాయకులు కావాలి. ఆ నాయకుల కోసమే జనం అన్వేషణ మొదలు పెట్టారు. సరిగ్గా ఇప్పుడే రాష్ట్రాల్లో ఉన్న యువ నాయకులెవ్వరన్న ప్రశ్న తలెత్తుతోంది. యువ నాయకులుగా మారి రాష్ట్రాన్ని ముందుకు నడిపించే వ్యక్తుల కోసం ఎదురు వేట మొదలైంది.
ప్రజల అన్వేషణ వారి చూపు జూనియర్ ఎన్టీఆర్ వైపు ఉందన్న వాదన కూడా బలపడుతోంది. అదో రాజకీయ వారసత్వం కూడా అవుతుందన్న విశ్వాసమూ కలుగుతోంది. ఇటీవలి పరిణామాలు ఆ దిశగానే సంకేతాలిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పాలన అస్తవ్యస్తంగా ఉందన్న చర్చ తారా స్థాయికి చేరి చాలా రోజులైంది. సీఎం జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారన్న పేరు పడిపోయింది. సైకో పోవాలి సైకిల్ రావాలి అని తెలుగుదేశం పార్టీ నినదిస్తున్నప్పటికీ చంద్రబాబు నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసం కలగడం లేదు. జగన్ అప్పుల అప్పారావు అయితే చంద్రబాబు పాత కథలు చెప్పి టైమ్ పాస్ చేస్తారన్న అనుమానం కలుగుతోంది. దానితో ఇప్పుడున్న వాళ్లు వద్దు కొత్త వాళ్లు కావాలన్న కోరిక జనంలో మెదలైంది.
జనం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వైపు చూస్తున్నారన్న వాదన బలపడుతోంది. తాతకు తగ్గ మనవుడుగా ఆయన పేరు తెచ్చుకుంటారన్న నమ్మకమూ కలుగుతోంది. ఆంధ్రుల అభిమాన అన్న నందమూరి తారక రామారావు పెద్ద కొడుకు హరికృష్ణ రెండో భార్య తనయుడైన జూనియర్ ఎన్టీఆర్ తాత పోలికతోనే ఉండటం ఒక వంతయితే ఆయన ఆలోచనా విధానాలు కూడా ప్రజారంజకంగా ఉండటం మరో వంతు. జూనియర్ రాజకీయాల్లోకి వస్తే తాత స్థాయిలో సంక్షేమ బాట పడతాడని జనం విశ్వసిస్తున్నారు.
ప్రస్తుతం ఏడాది పాటు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాలకు ఇంతవరకు జూనియర్ ను పిలవలేదు. ఎందుకలా జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమాలకు వెళ్తున్నా జూనియర్ ని మాత్రం ఇంకా ఆహ్వానించలేదు. మరో పక్క తెలంగాణ ప్రభుత్వం ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు జూనియర్ ను ఆహ్వానించారు. మే 28న అట్టహాసంగా జరిగే ప్రోగ్రాంకు రావాలని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేరుగా జూనియర్ నివాసానికి వెళ్లి పిలిచారు. దానితో ఇప్పుడు జూనియర్ లైమ్ లైట్ లోకి వచ్చేశారు. ఆయన పట్ల నాయకుల్లో సైతం విశ్వాసం పెరిగిందన్న చర్చకు ఈ ఆహ్వానం తెరతీసిందనే చెప్పాలి.
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై చర్చ మాత్రమే కాదు. ఆయన ఎంట్రీ కోసం గుంభనంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పదేళ్ల క్రితమే జూనియర్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు కోరుకున్నారు. అయితే అప్పుడు సినీ ఇండస్ట్రీలో ఆయనకు మంచి భవిష్యత్తు ఉందని కళామ్మ తల్లి సేవలో చేయాల్సింది చాలా ఉందని భావించడంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు దశాబ్దం తర్వాత జూనియర్ అవసరం రాష్ట్రానికి ఉందని ఆయన అభిమానులు లెక్కలేసుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఆయనకు ఇంకా అవకాశాలున్నప్పటికీ రాష్ట్రసంక్షేమం కోసం జూనియర్ రాజకీయాల్లోకి రావాలని జనం అభిమానులు కోరుకుంటున్నారు.
టీడీపీలోనే కార్యకర్తలు మార్పును కోరుకుంటున్నారు. పార్టీలో లోకేష్ నిజమైన వారసుడు కాదన్న అభిప్రాయం చాలా రోజులుగా ఉన్నదే. ఇప్పటికే ఆయనకు పప్పు పడిపోయింది. దాన్ని చెరిపేసుకునేందుకు లోకేష్ నానా తంటాలు పడుతున్నారు. పైగా నారావారబ్బాయి మంచి వక్త కూడా కాదు. సినిమా ప్రభావం వల్ల జూనియర్ ఎన్టీఆర్ పవర్ ఫుల్ స్పీకర్ అయ్యారు. జనంపై సమ్మోహనాస్త్రాలు సంధించే శక్తిమంతమైన ప్రసంగాలు ఆయన చేయగలరు. అదే ఆయనకు ప్లస్ పాయింట్
జూనియర్ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసినా ఇప్పుడు మాత్రం దూరంగా ఉంటున్నారు. అంటే రాజకీయాల్లోకి వస్తే నారా కుటుంబంతో సంబంధం లేకుండా సొంత రాజకీయాలు చేయాలనుకుంటున్నారని అనుకోవాలి. ఇటీవలి కాలంలో ఆయన పిలిచిందే తడవుగా రాజకీయ నాయకులను కూడా కలుస్తున్నారు. అమిత్ షా భేటీ అయి రాజకీయాలు చర్చించారు. జూనియర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్లు కూడా ఇప్పుడు ఆయన రాజకీయ అరంగేట్రంపై ప్లాన్ చేస్తున్నారు. త్వరగా ఏదోటి తేల్చాలని జూనియర్ పై వత్తిడి తెస్తున్నట్లుగా చెబుతున్నారు. ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది టైమ్ కూడా లేదు. మరి జూనియర్ త్వరగా తేల్చుతారా లేదా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ లాగ టైమ్ పాస్ చేస్తారా చూడాలి.