దేశం మొత్తం ఇప్పుడు కర్ణాటక వైపే చూస్తోంది. మే 10న నిర్వహించే పోలింగ్ లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ పెరిగింది. అధికార బీజేపీకి విజయావకాశాలు తగ్గిపోతున్నాయని వరుస సర్వేలు చెబుతున్న నేపథ్యంలో అసలీ పరిస్థితి ఎందుకు వచ్చిందన్న చర్చ కూడా ఊపందుకుంది. బీజేపీ తప్పిదాలే ఇందుకు కారణమా పాలన బాగోలేదా వీటన్నింటికీ మించి వేరే ఏదైనా ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకు పొరుగున ఉండే కర్ణాటక ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తి ఉంది. రెండు రాష్ట్రాల నుంచి జనం అక్కడకు వెళ్లి స్థిరపడ్డారు. కొన్ని నియోజకవర్గాల్లో తెలుగు వారి ఓట్లే కీలకం. అందుకే రెండు రాష్ట్రాల నుంచి నాయకులు అక్కడకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. అదీ ఒక ఎత్తు అయితే ఈ సారి కర్ణాటకలో ఎవరు గెలుస్తారని తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చ రెండో ఎత్తు. కర్ణాటకలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫండింగ్ చేస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవలే ఆరోపించారు. కేసీఆర్ తొలుత జేడీఎస్ కు డబ్బులిచ్చారని ఆ పార్టీ గెలవదని తెలిసి ప్లేటు ఫిరాయించారని సంజయ్ విశ్లేషిస్తున్నారు. జేడీఎస్ నేత కుమారస్వామి ఫోన్ చేసినా కేసీఆర్ పట్టించుకోవడం లేదని మొత్తం డబ్బులు కాంగ్రెస్ కే ఇస్తున్నారని సంజయ్ అంటున్నారు. దానితో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఓటుకు పది వేల రూపాయలు పంచుతోందని బండి చెబుతున్నారు. ఇదీ ఓ కోణం అంతకుమించి ఏపీ సీఎం జగన్ వైపు నుంచి కదులుతున్న నగదు మూటలు రెండో కోణం. జగన్ ఇప్పుడు కర్ణాటకపై ప్రత్యేక ఫోకస్ పెట్టారని వైసీపీ వర్గాల నుంచి లీకులు వస్తున్నాయి.
జగన్ ఆకాంక్షలు కూడా కేసీఆర్ తరహాలోనే ఉన్నా అమలు తీరు కాస్త డిఫరెంట్ అని చెబుతున్నారు. బీజేపీ గెలిస్తే జగన్ కు టెన్షన్ అట. కాంగ్రెస్ గెలిస్తే ఆయన రిలాక్డ్ గా ఉంటారట. కర్ణాటక రాజకీయాలకు ఏపీ పాలిటిక్స్ కు లింకు ఉందని జగన్ భావిస్తున్నారట. అందుకే అక్కడ బీజేపీ ఓడిపోవాలని ఆకాంక్షిస్తూ పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. కర్ణాటకలో బీజేపీ ఓడిపోతే ఏపీ రాజకీయాల్లో ఆ పార్టీ జోక్యం చేసుకునేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుందని, అప్పుడు తనకు ఇబ్బందులు ఉండవని వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధించే వీలుంటుందని జగన్ విశ్వసిస్తున్నారట. దానితో కర్ణాటకలో తనకు తెలిసిన వారి ద్వారానూ, పాతమిత్రుల ద్వారాను జగన్ కొత్త ఎత్తుగడలు వేస్తున్నట్లు సమాచారం. బళ్లారి బ్రదర్స్ లో పెద్దవాడైన గాలి జనార్థన్ రెడ్డి ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. తన భార్యను ఆయన రంగంలోకి దించారు. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష తరపున అరుణ లక్ష్మీ బరిలోకి దిగుతున్నారు. ఆయన సోదరులిద్దరూ బీజేపీ తరపున బరిలో ఉన్నారు. తమ్ముడిపైనే జనార్థన్ రెడ్డి తన భార్యను పోటీ పెడుతున్నారు. ఇప్పుడది పెద్ద విషయం కూడా కాకపోవచ్చు. ఎందుకంటే ఆయనో సీక్రెట్ మిషన్ కూడా నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. అదే జగన్ అప్పగించిన సీక్రెట్ మిషన్.
ఎన్నికల రాజకీయాల్లో గాలి జనార్థన్ రెడ్డి దిట్ట. ఎక్కడ ఎవరినీ దారికి తెస్తే విజయావకాశాలుంటాయి. ఎక్కడ ఎవరినీ ఓడించేందుకు ఎలాంటి వ్యూహాలు రచించాలో కూడా గాలి జనార్థన్ రెడ్డికి తెలిసినంతగా ఎవరికి తెలియకపోవచ్చు. అందుకే జగన్ అప్పగించిన పనిని చాప కింద నీరులా ఆయన అమలు చేస్తున్నట్లు వైసీపీ వర్గాలు అంటున్నాయి. పైగా బీజేపీపై కూడా గాలికి చాలా కోపముంది. మొదటి సారి కర్ణాటకలో బీజేపీ అధికారానికి రావడం వెనుక సింహభాగం పాత్ర గాలి జనార్థన్ రెడ్డిదే. మైనింగ్ కేసులు తీవ్రమైన తర్వాత పార్టీ ఆయన్ను పట్టించుకోలేదు. దానితో పలు పర్యాయాలు ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ కసి మీదున్న గాలి జనార్థన్ రెడ్డి ఏదో విధంగా బీజేపీని ఓడించాలనుకుంటున్నారు. జగన్ నుంచి ఆదేశాలు రావడంతో మరింత చురుగ్గా పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. పైగా జగన్ తన తమ్ముడని జనార్థన్ రెడ్డి చాలా సార్లు చెప్పుకున్నారు.
జనార్థన్ రెడ్డి ఆయన అనుచరులకు కావాల్సిన ఆర్థిక వనరులు జగన్ వైపు నుంచి కర్ణాటక చేరాయని టాక్. వాటిని వినియోగిస్తూ నేతలను ఓటర్లను తమ వైపుకు తిప్పుకునే కార్యాచరణ ఇప్పటికే ఫైనల్ స్టేజీకి వచ్చింది. బీజేపీని ఓడించటం నా బాధ్యత అని జనార్థన్ రెడ్డి హామీ ఇచ్చారని ఆ విషయంలో తన సొంత తమ్ముళ్లను కూడా ఉపేక్షించబోనని ఆయన అన్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే మే 13న వచ్చే కర్ణాటక ఎన్నికల ఫలితాల కోసం జగన్ ఎదురుచూస్తున్నారట. తర్వాతే తన తదుపరి కార్యాచరణకు శ్రీకారం చుడతారనుకోవాలి.