మెజార్టీ, మైనార్టీల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేస్తే రాజకీయ పార్టీలకు తాత్కలిక విజయాలు లభించవచ్చు కానీ అది అంతిమంగా అరాచకానికి దారి తీస్తుంది. దానికి తాజా సాక్ష్యం మణిపూర్. మణిపూర్ ఇప్పుడు తగలబడిపోతోంది. అతి చిన్నఈశాన్య రాష్ట్రం అద్భుతమైన ప్రకృతి సౌందర్యం మధ్య జీవితాలు సాఫీగా సాగిపోవాల్సిన చోట కనిపిస్తే కాల్చేయాలనే ఉత్తర్వులు వచ్చేశాయి. అవి రాక ముందే మణిపూర్ తగలబడిపోయింది. అల్లరి మూకలు అనేక ఇళ్లను, దుకాణాలను లూటీ చేయడంతోపాటు దగ్ధం చేశాయి. ఈ పాపం ఎవరిది.
ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్ ప్రజల మధ్య ఘర్షణలు జరగడం చాలా తక్కువ. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మెయితీ కమ్యూనిటీకి చెందిన ప్రజలు ఉన్నారు. మణిపూర్ లోయలో వారి ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని పర్వత ప్రాంతాల్లో నివసించేందుకు మెయితీలకు అనుమతి లేదు. కానీ మెజార్టీ ఉన్నారని రాజకీయ పార్టీలు వారికి మద్దతుగా మారిపోయాయి. ఫలితంగా గిరిజనులు రగిలిపోతున్నారు. కుకీలు ఇతర గిరిజన జాతులకూ మధ్య ఇప్పుడు ఘర్షణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా, విద్యార్ధులు, యువకులు తమ ఉద్యోగావకాశాలు దెబ్బతింటాయని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మెయితీల ఉద్యమాన్ని ప్రతిఘటిస్తూ కుకీలు ఆందోళన నిర్వహిస్తున్నారు. వారికి మద్దతుగా ఐదు విద్యార్థి సంఘాల వారు రంగంలో ప్రవేశించడంతో ఉద్యమం హింసాత్మకంగా పరిణమించింది. ప్రభుత్వ వాహనాలనూ, అతిధి గృహాలను ఆందో ళనకారులు దగ్ధం చేస్తున్నారు. ఈ ఘర్షణల కారణంగా 9వేల మందిపైగా నిరాశ్రయులయ్యారు.
మణిపూర్‌లో గతంలోనూ ఘర్షణలు జరిగాయి కానీ సొంత ప్రజలు ఎప్పుడూ గొడవలు పడలేదు. మణిపూర్‌కి మయన్మార్ సరిహద్దు ఉంది. ఒక్క మణిపూర్‌కే కాక, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధానమైన అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరంలకు కూడా మయన్మార్ సరి హద్దు ఉంది. మయన్మార్‌లో గిరిజన తెగలవారు మన సరిహద్దు రాష్ట్రాల్లోకి చొచ్చుకుని వచ్చి ఘర్షణలకు కారకులవుతున్నారు.ఇది పాత కథ. ఇప్పుడు మెయితీ తెగ వారు తమను షెడ్యూల్డ్ జాతుల్లో చేర్చాలంటూ ఆందోళన సాగిస్తున్నారు. వారిని ఎస్టీల్లో చేరిస్తే తమకు ప్రస్తుతం లభిస్తున్న సదుపాయాలు ఆగిపోతాయని, లేదా తక్కువ అవుతాయనీ కుకీలు, ఇతర గిరిజన జాతుల వారు ఆందోళన చెందుతున్నారు. ఈ ఉద్యమం లో మయన్మార్ గిరిజన తెగలు ప్రవేశించడంతో పరిస్థితి మరితం తీవ్రం అవుతోంది.
మణిపూర్‌లో ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఆ సందర్భంగా మొయితీలు మెజార్టీగా ఉన్న వారిని ఎస్టీల్లో చేరుస్తామని హామీ ఇచ్చారు. వారికి రాజకీయ మద్దతు ఉండటంతో మైనార్టీ గిరిజన తెగలు రగిలిపోతున్నాయి. రిజర్వేషన్ల ఫలితాలు తమకు దక్కవేమోనని ఎస్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లో ఇది ప్రధానమైన సమస్య. గతంలో అసోంలోకి విదేశీయులు ప్రవేశించారన్న కారణంగా స్థానికులు ఆందోళనలు నిర్వహించారు. దాదాపుగా ఈశాన్య రాష్ట్రాలన్నింటిలోనూ ఈ సమస్య ఉంది. అసోంలో ఇలాంటి మెజార్టీ, మైనార్టీలు వలస వచ్చిన వారు స్థిరంగా ఉన్న వారి మధ్య పెట్టి చిచ్చుతో రాష్ట్రం రగిలిపోయింది. కానీ ప్రపుల్ల కుమార్ మహంత, హిమంత బిశ్వ శర్మవంటి వారు పదవుల్లోకి వచ్చారు. అసోం ఉద్యమంలో భాగంగా 80వ దశకంలో నల్లి అనే ప్రాంతంలో ఎంతోమంది మరణించారు.
సరిహద్దు రాష్ట్రాల్లో చిచ్చు రగిల్చేందుకు చైనా అగ్గి రాజేస్తోంది. మయన్మార్ ని, ఇతర సరిహద్దు దేశాలను ఎగదోసి భారత్‌లో అస్థిర పరిస్థితులను సృష్టిస్తోంది. స్థానికంగా సమస్యలేవీ లేక పోతే పొరుగుదేశాలు ఏమీ చేయలేవు. ఇప్పుడు మణి పూర్‌లో మెయితీలకూ, గిరిజనులకూ మధ్య అనుమా నాలు పెనుభూతమై ఈ ఘర్షణలకు కారణమయ్యాయి. మణిపూర్ వర్గా లు ఈ ఘర్షణలకు పాల్పడటం దుర్మార్గమే. దీనిని బట్టి పథకం ప్రకారమే ఆందోళనలను రాజకీయ నాయకులు ప్రోత్సహిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
మణిపూర్‌లో ఉన్న సమస్య ప్రతీ రాష్ట్రంలోనూ ఉంది. గతంలో ఏపీలో కాపు ఉద్యమం పేరుతో రైళ్లను పోలీస్ స్టేషన్లను తగులబెట్టారు. తెలంగాణలో కూడా గిరిజనుల సమస్య ఉంది. ఆదివాసీలు, లంబాడాల మధ్య పోరాటంతో ఎన్ని సార్లు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయో అంచనా వేయడం కష్టం. ఇలాంటి ఘటనలు జరగని రాష్ట్రం లేదు. దీనికి కారణం రాజకీయ పార్టీలు ఒక్కో వర్గాన్ని ప్రోత్సహించి ఓటు బ్యాంక్‌గా మార్చుకునే ప్రయత్నతాలు చేయడమే. ఫలితంగా వారు రాజకీయంగా లాభపడుతున్నారు. దేశం నష్టపోతోంది. కానీ ప్రజలు మాత్రం ఈ నిజాన్ని గ్రహించలేకపోతున్నారు. రాజకీయ నేతల వలలో పడి తీవ్రంగా నష్టపోతున్నారు.