భజరంగ్ దళ్ కేరళ స్టోరీలు చెబితే ఓట్లేస్తారా? కర్ణాటకలో బీజేపీ నైతిక దివాలా !

By KTV Telugu On 6 May, 2023
image

 

కర్ణాటకలో ఎన్నికలు ఫలితాలు రాక ముందే భారతీయ జనతా పార్టీ నైతికంగా దివాలా తీసేసింది. స్వయంగా ప్రధానమంత్రి కూడా గల్లీ గల్లీలో తిరుగుతూ భజరంగ్ దళ్ గురించి కేరళ స్టోరీల గురించి మాట్లాడుతున్నారు. తాము అధికారంలో ఉండి ఏంచేశాం మళ్లీ గెలిపిస్తే ఏం చేస్తామని చెప్పడం లేదు. బీజేపీ నేతల తీరుచూసి ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారు. మత రాజకీయాల మత్తులో జనాన్ని ముంచి ఇంకెంత కాలం ఓట్లు రాబట్టుకుంటారన్న ప్రశ్నలు వస్తున్నాయి.

డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని బీజేపీ ఎక్కడైనా చెబుతూ ఉంటుంది. కర్ణాటకలో డబుల్ ఇంజినీ సర్కారే ఉంది కానీ ఏమీ చెప్పుకోవడం లేదు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తామని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది. అంతే భారతీయ జనతా పార్టీకి అంతకు మించిన ఆయుధం లేదన్నట్లుగా ఒక్క సారిగా జూలు విదుల్చుకుంది. అన్ని విషయాలు పక్కన పెట్టేసింది. భజరంగ్ దళ్‌పై నిషేధం విధిస్తారా అని యుద్ధం చేస్తున్నట్లుగా ఎన్నికల్లో ప్రకటనలు ప్రారంభించారు. దేశాన్ని ఉద్దరించేస్తామని చేశామని తెగ గప్పాలు కొట్టుకునే బీజేపీకి ఎక్కడ ఎన్నికలు జరిగినా తమకు చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క మంచి పని ఉండదు. చెప్పుకోలేరు కూడా. వారిదంతా మత రాజకీయం. కథలు చెప్పుకుని సెంటిమెంట్ పండించి ఓట్లు దండుకునే వ్యూహమే. కర్ణాటకలో అదే చేస్తున్నారు. కర్ణాటకలో బీజేపీ ప్రచార సరళి చూస్తే ఇదే అర్థం అయిపోతుంది. యడ్యూరప్ప ప్రభుత్వం కానీ బొమ్మై ప్రభుత్వం కానీbతాము కర్ణాటకకు ఫలానా పనిచేశామని ఎన్నికల్లో చెప్పుకోలేదు. మొదటి నుంచి ఏడుపులు పెడబొబ్బలతోనే ప్రచారం చేస్తున్నారు.

మొదట ప్రధానమంత్రి తనను కాంగ్రెస్ నేతలు తిడుతున్నారని ప్రచారం చేసుకున్నారు. అయినా ప్రజల కోసం పడుతున్నానని తనను తిట్టినా పర్వాలేదని కానీ కులాల్ని తిడుతున్నారని చెప్పుకొచ్చారు. ప్రధాని మొదట ప్రసంగాలు ” చీప్ వెరీ చీప్ ” అన్న ఫీడ్ బ్యాక్ తీసుకొచ్చాయి. అయితే ఇలాంటివే ఓట్లు తెచ్చి పెడతాయని వారు గట్టిగా నమ్ముతారు. అందుకే మరింత లోకి వెళ్లిపోయారు. చివరికి కేరళ స్టోరీ గురించి కూడా కథలు చెప్పారు. అది ఓ సినిమా. దాన్ని కాంగ్రెస్ కు ముడి పెట్టేసి ప్రధాని కూడా విమర్శలు గుప్పించారు. దీంతో దేశ ప్రధానికి కూడా అదీ పదేళ్ల పాటు అధికారంలో ఉండి ఏం చేశామో చెప్పుకోలేని దీన స్థితిలో ఓ సినిమా గురించి చెప్పుకుంటున్నారన్న అభిప్రాయం ఆలోచన పరుల్లో కనిపిస్తోంది. కర్ణాటకలో తానే సూపర్ స్టార్ అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి బొమ్మై ప్రచారం గురించి ఎవరూ పట్టించుకోడం లేదు. యడ్యూరప్ప తిరుగుతున్నా లెక్క చేయడం లేదు. కానీ అంతా మోదీ నామస్మరణ చేసేందుకు వెనుకాడటం లేదు. బీజేపీ సోషల్ మీడియా మీడియా మొత్తం మోదీ మోదీ అని అరుస్తూనే ఉన్నారు. కర్ణాటకలో బీజేపీ పరిస్థితి దారుణంగా ఉంది. అయితే మోదీ ప్రచారంతో మొత్తం మారిపోయిందని ఇప్పుడు సర్వేలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని ఓ రకమైన ప్రచారం మొదలు పెట్టారు.

ఇప్పటికే బీజేపీ మొత్తం వదిలేసి హనుమాన్ చాలీసా చదువుతోంది. ఇప్పుడు కేరళ స్టోరీ సినిమాని రెచ్చగొట్టడానికి గొప్ప టూల్ లాగా వాడేసుకుంటున్నాయి. మీడియా సోషల్ మీడియాతో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇది కర్ణాటక ప్రజల్ని తక్కువ అంచనా వేయడమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నుంచి ప్రజలు ఇంకెదో ఆశిస్తారు. అయితే ఆయన కానీ బీజేపీ కానీ కర్ణాటక ప్రచారంలో వాడుతున్న టెక్నిక్స్ చూస్తే గెలుపోటముల సంగతి పక్కన పెడితే నైతికంగా బీజేపీ దివాలా తీసిందన్న అభిప్రాయం మాత్రం ఎక్కువ మందిలో వస్తుంది. అసలు ప్రజల జీవితాల్ని ఏ మాత్రం ప్రభావితం చేయని అంశాలను పట్టుకుని వాటిని ఎన్నికల అస్త్రాలుగా ఓటింగ్ ప్రయారిటీగా మార్చుకునే ప్రయత్నం చేయడం ఏమిటన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది.

ఏమి చేశామో చెప్పుకుని ఓట్లు పొందలేని చోట భావోద్వేగాలను పెంచడానికి ప్రయత్నించడమే బీజేపీ రాజకీయం ఇప్పుడు అదే జరుగుతోంది. కానీ రాజకీయాల్లో గెలవడమే ముఖ్యం కాదు ఎలా గెలిచామన్నది కూడా ముఖ్యమే. ఎందుకంటే గెలుపు నైతికతతో ముడిపడి ఉండాలి. ఎందుకంటే రాజకీయ అధికారం అనుభవించడానికి కాదు ప్రజలకు దేశానికి మేలు చేయడానికి. ఈ స్ఫూర్తిని బీజేపీ పూర్తిగా మర్చిపోతున్నట్లుగా కనిపిస్తోందని బుద్ది జీవులు ఆవేదన చెందుతున్నారు.