అగ్గి రాజేసిన నంది.. ఎవరి ‘నంది’ పవిత్రమైంది?

By KTV Telugu On 6 May, 2023
image

 

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ప్రభుత్వాలు సినీ పరిశ్రమను పట్టించుకోవడం లేదంటూ ఇద్దరు నిర్మాతలు చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రాజేశాయి. సినిమాలను ప్రోత్సహించే ఉద్దేశం లేకనే రెండు ప్రభుత్వాలు నంది అవార్డులను ఇవ్వడం లేదని ఆ నిర్మాతలు వ్యాఖ్యానించారు. సీనియర్ నిర్మాత సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు జి. ఆదిశేషగిరి రావు అయితే నంది అవార్డులపై తనకు గౌరవం కూడా లేదనేశారు. మరో నిర్మాత చలసాని అశ్వనీదత్ అయితే ఏపీ ప్రభుత్వంపై తనకున్న దుగ్ఢను తీర్చుకున్నారు. నంది అవార్డులు ఇవ్వడం లేదు ఇపుడు ఉన్న పరిస్థితులను బట్టి వారు ఉత్తమ గూండా ఉత్తమ రౌడీ అవార్డులు ఇస్తున్నట్లుంది అన్నారు అశ్వనీదత్. అశ్వనీదత్ వ్యాఖ్యలపై సినీ నటుడు నిర్మాత పోసాని కృష్ణ మురళి దీటుగా బదులిచ్చారు. మీకు నచ్చిన వారి పాలనలో ఉత్తమ వెన్నుపోటు దార్లకు అవార్డులు ఇచ్చారని అన్నారు పోసాని. నంది అవార్డులను గబ్బు పట్టించిందే చంద్రబాబు నాయుడని నంది అవార్డులను కమ్మ అవార్డులుగా మార్చేయడం వల్లనే గతంలో తనకు వచ్చిన అవార్డును తిరస్కరించానని పోసాని గుర్తు చేశారు.

1964లో నంది అవార్డుల ప్రదానోత్సవం మొదలైంది. అప్పట్లో తెలుగు సినిమాలను ప్రోత్సహించడానికి నంది అవార్డులు ఇవ్వాలని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏటా నంది అవార్డులు ఇచ్చేవారు. మధ్య మధ్యలో రెండు మూడేళ్లకు కలిపి ఒకేసారి ఇవ్వడమనే సంప్రదాయానికీ తెరతీశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చిన నంది అవార్డులు పలు సందర్భాల్లో వివాదస్పదం అయ్యాయి. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో నంది అవార్డుల ప్రదానోత్సవంపై విమర్శలు వెల్లువెత్తాయి. టిడిపికి అనుకూలంగా ఉండే వారికీ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికే అవార్డుల్లో ప్రాధాన్యత నిచ్చారని సినీ రంగ ప్రముఖులే నిప్పులు చెరిగారు. అల్లు అర్జున్ నటించిన రేసు గుర్రం సినిమా నిర్మాత నల్లమలుపు బుజ్జి అయితే బాహాటంగానే నంది అవార్డుల జ్యూరీపై విరుచుకు పడ్డారు. 2014లో విడుదలైన రేసు గుర్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయినా దానికి అవార్డు రాకపోవడంపై నల్లమలుపు బుజ్జి తీవ్ర అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకి లాబీయింగ్ రాదు కాబట్టే తమ సినిమాకి అవార్డు రాలేదని బుజ్జి ఆరోపించారు. మెగాస్టార్ చిరంజీవి అల్లు అరవింద్ కుటుంబానికి సన్నిహితుడైన బన్నీ వాసు కూడా ఇదే రకమైన ఆరోపణ చేశారు. నిర్మాత బండ్ల గణేశ్ అయితే నంది అవార్డులను సైకిల్ అవార్డులుగా అభివర్ణించారు.

2015 సంవత్సరంలో విడుదలైన చారిత్రక సినిమా రుద్రమ దేవికి విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి కానీ నంది అవార్డుల్లో కనీసం జ్యూరీ అవార్డు కూడా రాలేదు. దీనిపై సినిమా దర్శకుడు గుణశేఖర్ చంద్రబాబు నాయుడి ప్రభుత్వాన్ని ఉద్దేశించి బహిరంగ లేఖే రాసి సంచలనం సృష్టించారు. ఆ ఏడాది నందమూరి బాలయ్య నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణికి వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రుద్రమదేవి సినిమాకు ఆవెసులుబాటు ఇవ్వకపోవడం పైనా గుణశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు అప్పట్లో. సినీ రంగం నుంచే విమర్శలు వెల్లువెత్తడంతో నాటి ఐటీ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ హైదరాబాద్ లో ఉండే సినీ ప్రముఖులు ఏపీ గురించి విమర్శలు చేయడమేంటి వాళ్లేమన్నా ఇక్కడ నివసిస్తున్నారా అని నిలదీశారు. లోకేష్ స్పందనతో ప్రముఖ నటుడు, రచయిత, నిర్మాత పోసాని కృష్ణ మురళి ఉత్తమ సహాయ నటుడి కేటగిరీలో తనకు వచ్చిన నంది అవార్డును ప్రభుత్వానికి వాపసు చేసి తన నిరసన వ్యక్తం చేశారు. మొత్తం వ్యవహారం ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చడంతో నంది అవార్డులు ఇంత వివాదాన్ని రాజేస్తాయని తాను అనుకోలేదన్నారు చంద్రబాబు నాయుడు. మరి అందుకే ఆ తర్వాత నందులకు ఆయన చెల్లు చీటీ ఇచ్చారో ఏమో తెలీదు కానీ 2016తర్వాత నంది అవార్డులు ఇవ్వలేదు. నంది అవార్డులను చంద్రబాబు నాయుడు ఆపేసినపుడు ఎందుకు ఆపారు అని ప్రశ్నించని ఆదిశేషగిరి రావు, అశ్వనీదత్ లు ఇపుడు నంది అవార్డులకోసం నోరు పారేసుకున్నారు. ఈ ఇద్దరిని ఉద్దేశించి తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండి పడ్డారు. నంది అవార్డులు అనేవి ఎవరు పడితే వారు అడిగితే ఇచ్చేవి కావని అన్నారు. వచ్చే ఏడాది నుండి నంది అవార్డులు ఇవ్వాలన్న ఆలోచన తమకు ఉందని తలసాని అన్నారు.

అశ్వనీదత్, ఆదిశేషగిరి రావు ఈ ఇద్దరూ జగన్ ప్రభుత్వం పట్ల చాలా వ్యతిరేకతతో ఉన్నారు. దానికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. ఆదిశేషగిరి రావు అయితే ఒకప్పుడు వైసీపీలో ఉన్నారు కూడా. అయితే 2019 ఎన్నికలకు ముందే ఆయన టిడిపిలో చేరారు. ఆ ఎన్నికల్లో టిడిపి గెలుస్తుందని ఆయన భావించారు. ఆ అంచనా కాస్తా తల్లకిందులై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. బహుశా ఆ అసంతృప్తినే ఆయన ఇపుడు వ్యక్తం చేసి ఉండచ్చు. ఇక అశ్వనీ దత్ నిరసనకు చాలా కారణాలున్నాయి. అశ్వనీదత్ మొదట్నుంచీ టిడిపి అభిమానే. టిడిపిని స్థాపించక ముందు ఎన్టీయార్ ను అభిమానించి ఆయనతో సినిమాలు నిర్మించారు అశ్వనీ దత్. ఎన్టీయార్ పార్టీ పెట్టాక దానికి మద్దతుగా ఉంటూ వచ్చారు. చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు చేజిక్కించుకున్నాక చంద్రబాబు నాయుడికి మద్దతుగా ఉంటున్నారు. ఆ అనుబంధం కారణంగానే రాజధాని నగరమైన అమరావతిలో టిడిపి నేతలు బంధువులతో పాటు అశ్వనీ దత్ కూడా భూములు కొన్నారు. అశ్వనీ దత్ మనోడు కాబట్టే చంద్రబాబు నాయుడు ఆయనకు రాజధాని ఎక్కడ వస్తుందో ముందుగానే సమాచారం ఇచ్చి భూములు కొనుగోలు చేయమని ఎంకరేజ్ చేశారని అంటారు. అమరావతి లోనే లక్షల కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేసి ఉంటే అశ్వనీ దత్ భూముల ధరలు కూడా ఆకాశాన్ని అంటేవి. అయితే ఆ దుర్మార్గానికి తాను వ్యతిరేకినని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించడమే కాకుండా మూడు రాజధానులకు శ్రీకారం చుట్టడంతో టిడిపి నేతలతో పాటు అశ్వనీ దత్ లాంటి బాబు అస్మదీయులకు మండుకొస్తోంది. తమ చీకటి ప్లాన్ కాస్తా మటాష్ అయిపోయిందని చాలా కోపంగా ఉన్నారు అశ్వనీ దత్. అందుకే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటేనే ఆయనకు కంటగింపుగా ఉందని పాలక పక్ష నేతలు అంటున్నారు. వివిధ సందర్భాల్లో ఏపీ బాగుపడాలంటే చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని ఆయనే ముఖ్యమంత్రి అవుతారని అశ్వనీదత్ తన విధేయత చాటుకుంటూనే వచ్చారు.

ఏపీ బాగుపడాలన్నది వారి ఆకాంక్ష కాదని తమ సామాజిక వర్గం బాగుపడాలన్నదే అశ్వనీ దత్ వంటి వారి కోరిక అని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. అశ్వనీ దత్ కు కుల పిచ్చి ఎంత ఎక్కువ అంటే టిడిపి నేత పరిటాల రవీంద్రను ఆయన ప్రత్యర్ధులు దారుణంగా హతమార్చిన వెంటనే అశ్వనీ దత్ మాట్లాడుతూ వాళ్లంతే హత్యలకోసమే పుట్టారు అంటూ రెడ్డి సామాజిక వర్గాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఫ్యాక్షనిజంలో కులాలుండవని వారికి ప్రత్యర్ధులు మాత్రమే ఉంటారని తెలిసినా పరిటాల తమ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం వల్లనే అశ్వనీదత్ అంత బాధ పడ్డారని అప్పట్లో ప్రచారం జరిగింది. హత్యకు గురైన పరిటాల రవీంద్ర అనుచరులు కూడా ఎన్నో హత్య కేసుల్లో నిందితులే. టిడిపి హయాంలో కాంగ్రెస్ నాయకుడు వంగవీటి రంగాను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆ హత్య వెనుక చంద్రబాబు నాయుడి పాత్ర ఉందని హత్య జరిగిన సమయంలో హోంమంత్రిగా వ్యవహరించిన చేగొండి హరిరామ జోగయ్య బాహాటంగానే ఆరోపించారు. రంగా హత్య జరిగినపుడు అశ్వనీదత్ వంటి వారు నోరు మెదపలేదు. అందుకే ఆయన తన సామాజికవర్గం వారి విషయంలో ఒకలాగ ఇతర సామాజికవర్గాల విషయంలో మరోలాగ స్పందిస్తూ ఉంటారని అంటారు. తనకు ఎంతో ఆప్తుడైన చంద్రబాబు నాయుడి పార్టీని రెండు వరుస ఎన్నికల్లో దివంగత వై.ఎస్.ఆర్. మట్టి కరిపించారు. అందుకే వై.ఎస్.ఆర్. అంటే అశ్వనీదత్ కు ద్వేషమని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. 2019లో వై.ఎస్.ఆర్. తనయుడు అయిన జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడి పార్టీకి అడ్రస్ లేకుండా చేశారు. అందుకే జగన్ మోహన్ రెడ్డిపై అంత కడుపు మంట ఉండి ఉండచ్చని పాలక పక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

సినిమా థియేటర్లలో ఆన్ లైన్ టికెట్ వ్యవస్థ తో పాటు సినిమా టికెట్ల రేట్లు ఇతర సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో చర్చలకు మెగాస్టార్ చిరంజీవి, ఆస్కార్ డైరెక్టర్ రాజమౌళి ప్రిన్స్ మహేష్ బాబు, ప్రభాస్ వంటి వారు వచ్చారు. తమ చంద్రబాబు నాయుడికి పదవి లేకుండా చేశారన్న అక్కసుతో అశ్వనీదత్ వంటి కొందరు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రిని కలవడానికి కూడా ఇష్టపడలేదంటే వారు ఎంత వ్యతిరేకతతో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు అంటున్నారు సినీ రంగ ప్రముఖులు.