భారత దేశం గర్వించేలా రూపుదిద్దుకుంటున్న నూతన ప్రజాస్వామ్య సౌధం తుది మెరుగులు దిద్దుకుంటోంది. దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిథులు కొలువు తీరే నూతన పార్లమెంటు భవనాన్ని మరో వందేళ్లు దాటినా చెక్కు చెదరని విధంగా నిర్మించారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీర్చి దిద్దిన నూనత భవనం భారత సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుంది. భవిష్య తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దూరదృష్టితో దీనికి డిజైన్ చేయించారు. పాత పార్లమెంటు భవనానికి వందేళ్లు నిండడంతో కొత్త భవనం నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో భాగంగా నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రెడీ అవుతోంది. మే నెల చివరి వారంలో కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌ను ప్రారంభం కానుంది. ఇప్పటికే పలుసార్లు నిర్మాణ పనులను పర్యవేక్షించారు ప్రధాని మోదీ. ఈ భవనానికి ఆరు ప్రవేశ మార్గాలు ఉంటాయి. 64వేల500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగు అంతస్థులతో భవనాన్ని నిర్మిస్తున్నారు. భూకంపాలను తట్టుకునే విధంగా ఈ నూతన భవనం నిర్మితమవుతోంది. ఈ బిల్డింగ్‌లో 120 కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. కమిటీ సమావేశ మందిరాలు, పార్లమెంటరీ వ్యవహారాల ప్రధాన కార్యాలయాలు, లోక్సభ, రాజ్యసభ సచివాలయాలు ప్రధానమంత్రి కార్యాలయం ఎంపీల కార్యాలయాలతోపాటు భద్రతా సిబ్బంది కోసం ప్రత్యేక గదులు ఉంటాయి.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండేలా నూతన పార్లమెంట్ భవనంలో సకల సౌకర్యాలు ఏర్పాటయ్యాయి. ఫర్నిచర్‌లోనే స్మార్ట్ డిస్‌ప్లే సదుపాయాలు ఉంటాయి. డిజిటల్ అనువాదం, ప్రోగ్రామబుల్ మైక్రోఫోన్స్, రికార్డింగ్ సదుపాయాలు ఉంటాయి. సులువుగా ఓటువేయడానికి వీలుగా బయోమెట్రిక్స్ ఉంటాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే దేశీయ వాస్తు రీతుల్లో నూతన పార్లమెంట్ భవనం నిర్మితమవుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన వాస్తు రీతులు ఇక్కడ చూడొచ్చు. సాంస్కృతిక వైవిద్ధ్యం కనిపిస్తుంది. వివిధ ప్రాంతాలకు చెందిన 200 మందికి పైగా కళాకారులు ఈ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. 93 ఏళ్ళనాటి ప్రస్తుత పార్లమెంటు భవనానికి బదులుగా కొత్త ప్రజాస్వామ్య సౌధం రూపుదిద్దుకుంటోంది. పాత భవనాన్ని పురావస్తు సంపదగా పరిరక్షించనున్నట్టు కేంద్రప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భవిష్య అవసరాలను పెరగనున్న పార్లమెంటు సభ్యుల సంఖ్యను దానికి అనుగుణంగా పెంచుకోవలసిన మౌలిక సదుపాయాల కల్పనను దృష్టిలో ఉంచుకుని భారత వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన పార్లమెంటు భవన సముదాయం ఇది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ భవన సముదాయంలో పార్లమెంటు ఉభయ సభలతో పాటు 51 మంత్రిత్వ శాఖల కార్యాలయాలు సైతం నిర్మిస్తున్నారు.
గుజరాత్ కు చెందిన బిమన్ పటేల్ ఈ ప్రాజెక్టుకు డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్. టాటా గ్రూప్ బిడ్డింగ్ లో ఈ పనులను గెలుచుకుంది. ఇంతటి భారీ ప్రాజెక్టును 970 కోట్ల రూపాయలకే కట్టి ఇవ్వడానికి టాటా సంస్థ ఒప్పుకుంది. ఈ మేరకే ఒప్పందం కుదిరింది కూడా. 2022లో భారత స్వాతంత్ర్యానికి 75 ఏళ్లు పూర్తవుతాయి. ఆ సందర్భంగానే పార్లమెంటుకు నూతన భవన సముదాయాన్ని నిర్మించి జాతికి అంకితం ఇవ్వాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావించింది. ప్రస్తుతం లోక్ సభ, రాజ్యసభ, సెంట్రల్ హాల్ కలుపుకుని 790 సీట్ల సామర్ధ్యంతో పార్లమెంటు భవనం ఉంది. 2026నాటికి పార్లమెంటు సభ్యుల సంఖ్య బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా పార్లమెంటులో అడుగుపెట్టబోయే సభ్యుల అవసరాలను కూదా దృష్టిలో పెట్టుకుని నూతన పార్లమెంటు భవన సముదాయానికి రూపకల్పన చేశారు. ఈ క్రమంలో లోక్ సభలో 888మంది రాజ్యసభలో 384 మంది సభ్యులు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఇక ఉమ్మడి సమావేశాల వేదికగా దిగువ సభనే వినియోగించుకునేలా 1272 సీట్ల సమార్ధ్యంతో భారీగా లోక్ సభ హాల్ రూపు దిద్దుకోనుంది. లోక్ సభ ప్రభ వెలిగిపోయేలా మన ప్రజాస్వామిక వైభవాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పేలా గ్రాండ్ కన్సిట్యూషన్ హాలును నిర్మించారు. అంత పకడ్బందీగా కేంద్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ 2020 లో శంకుస్థాపన చేశారు. ఈ నెల చివరి వారంలో కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ప్రారంభం కానుంది.