హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు దేనికి సంకేతం

By KTV Telugu On 7 May, 2023
image

 

ఏపీ రాజధాని నగరం అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకోసం ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే విధించాలని టిడిపి నేతలు, రైతులు వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఇది పేదల విజయంగా  చెబుతోన్న వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నేతలు లోపల మాత్రం తమ విజయంగా భావిస్తున్నారు. మరో పక్క రైతుల తరపున పిటిషన్ వేయించిన టిడిపి నేతలు షాక్ తిన్నారు. పిటిషన్ తిరస్కరించడంతో పాటు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏపీ విపక్షాల ఆలోచనలకు శరాఘాతమనే చెప్పాలంటున్నారు న్యాయరంగ నిపుణులు.

ఏపీ రాజధాని అమరావతిలోని సి.ఆర్.డి.ఏ. పరిధిలో ఉన్న భూముల్లో 48 వేల మందికి పైగా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం   నిర్ణయించింది. దీనికి సంబంధించి జీవో కూడా జారీ చేసింది. అయితే ఆ వెంటనే అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వీల్లేదంటూ టిడిపి నేతలు కొందరు రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అనేది అందరిదీ. అది ఏదో ఒక్క వర్గానికి చెందింది కాదు. ఫలానా వారికి అక్కడ భూములు ఇవ్వడానికి వీల్లేదన్న ఆలోచనే దుర్మార్గమైనది. అది కరెక్ట్ కాదు అని వ్యాఖ్యానించారు న్యాయమూర్తి. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా వెంటనే కొందరు న్యాయస్థానాలు ఆశ్రయించేస్తున్నారన్న చీఫ్ జస్టిస్ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోకుండా ఆపలేమని స్పష్టం చేశారు.

జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలో మూడు రాజధానులకు నిర్ణయం తీసుకున్నారు. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే విశాఖ ను కార్యనిర్వాహక రాజధానిగానూ కర్నూలును న్యాయరాజధానిగానూ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే మూడు రాజధానుల నిర్ణయాలన్ని టిడిపి వ్యతిరేకించింది. రైతులతో పాటు తాము కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని డిమాండ్ చేసింది. అమరావతే రాజధానిగా ఉండాలని జనసేన, బిజెపి, సిపిఐ కూడా వాదిస్తున్నాయి. అయితే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మాత్రం రాజధాని ఎక్కడ ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధార పడి ఉంటుందని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో స్పష్టం చేసింది. ఏపీ హై కోర్టు మూడు రాజధానులను వ్యతిరేకించింది. అయితే దాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీంలో దీనిపై విచారణ జరుగుతోంది. ఈ లోపు అమరావతిలో పేదలకు భూములు ఎలా ఇస్తారంటూ టిడిపి యాగీ చేసింది. చిత్రంగా దీనిపై కమ్యూనిస్టు పార్టీలో మౌన వ్రతం పాటించాయి. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకోవడం ఏంటని కనీసం ప్రశ్నించను కూడా లేదు కామ్రేడ్లు. అయితే పాలక వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ మాత్రం పేదలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరాలన్న పంతంతో ఉంది. పేదలకు రాజధానిలో అనుమతి లేదనడం దుర్మార్గం కాదా అని వైసీపీ మంత్రులు నిలదీస్తున్నారు. హైకోర్టు తాజా తీర్పుతో వేలాది మంది పేదలు సంబరాలు చేసుకుంటున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే అవకాశం వచ్చినందుకు వైసీపీ నేతలు  సంతోషంగా ఉన్నారు. తమ వాదన వీగిపోయినందుకు టిడిపి నేతలు గుర్రుగా ఉన్నారు.

దీనిపై ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెంనాయుడు మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను స్వాధీనం చేసుకుంటామని అన్నట్లు ప్రచారం జరుగుతోంది. అచ్చెం నాయుడు నిజంగానే ఈ వాదనను బలంగా వినిపిస్తే అది రానున్న ఎన్నికల్లో టిడిపికి శరాఘాతం కావడం ఖాయమంటున్నారు రాజకీయ పండితులు. దళితులకు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకుంటామంటే అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల్లో ఆగ్రహావేశాలు పెంచే అవకాశాలుంటాయంటున్నారు మేథావులు.
అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలన్న వాదనకు మద్దతుగా కొందరు రైతులు దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షకు టిడిపి అండదండలు ఉన్నాయి. సాక్ష్యాత్తూ చంద్రబాబు నాయుడే ఈ దీక్షకు మద్దతు పలికారు.
అమరావతిలో దళితులకు జరిగిన అన్యాయానికి నిరసనగా మరో వర్గం రైతులు దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షలకు సహజంగానే పాలక పక్షం నైతిక మద్దతు ఇస్తోంది. ఇంచుమించు రెండున్నరేళ్లకు పైగా ఈ దీక్షలు కొనసాగుతున్నాయి. ఒక విధంగా ఈ దీక్షలు కూడా రాజకీయ రంగు పులుముకున్నాయి. అందుకే హైకోర్టు తాజా తీర్పు ఓ వర్గానికి ఆనందాన్ని మరో వర్గానికి విషాదాన్ని మిగిల్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.