తెలంగాణ రైతుల నష్టం రూ. 10 వేల కోట్లు – చేసే సాయం ఎంత

By KTV Telugu On 9 May, 2023
image

తెలంగాణ రాష్ట్రంలో ఎండా కాలం వర్షాలు రైతులకు చేసిన నష్టం అంతాఇంతా కాదు. ఎండా కాలంలోలా ఎండలే కాసి ఉంటే రైతులు ఈ పాటికి రూ.పది వేల కోట్ల సంపదను కళ్ల జూసి ఉండేవారు. అప్పులు తీర్చుకుని ఉండేవారు. ఇంట్లో శుభకార్యాలకు దిగుల్లేదని హాయిగా ఉండేవారు. కానీ వచ్చిన వర్షాల వల్ల పంట దిగుబడి పూర్తిగా వర్షం పాలైంది. ఎంతకాడికిత తెగనమ్ముకున్నా పదివేల కోట్ల సంపద వర్షార్పణం అయింది. ఇందులో ప్రభుత్వం ఇచ్చేది పదిశాతం కూడా ఉండదు. అదీ కూడా అందరికీ అందుతుందా లేదా అన్న దానిపై స్పష్టత ఉండదు. అయితే ఈ నష్టం ఒక్క రైతుకే కాదు. రైతు మీద ఆధారపడిన ప్రతి ఒక్కరికీ నష్టమే. చివరికి మీకూ నాక్కూడా ఎలాగంటే..

గత నెలలో ఓ సారి వడగళ్ల వాన వచ్చింది. ఇప్పుడు మరోసారి భారీ వర్షాలు వచ్చాయి. మొత్తంగా వర్షా కాలంలో వచ్చిన అకాల వానల వల్ల తెలంగాణలో 15 లక్షల ఎకరాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ సారి తెలంగాణలో యాసంగికి 73 లక్షల ఎకరాల్లో పంటలను సాగు చేశారు ఇందులో వరి పంట అత్యధికం. కనీసం 56 లక్షల ఎకరాల్లో వరి పంటలను సాగు చేశారు. వరి సాగులో దాదాపు 12 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మక్కలు, మామిడి, ఉద్యాన పంటలన్నీ కలిపి మరో 3 లక్షల ఎకరాల్లో నష్టం జరిగింది. 12 లక్షల ఎకరాల్లో నష్టపోయిన వరికి తక్కువలో తక్కువ అంచనా వేసినా రూ. ఐదు వేల కోట్ల నష్టం ఉంటుంది. ఉద్యాన పంటల్లో 3 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా దాదాపు 2 లక్షల ఎకరాల్లో దెబ్బతింది. ఏటా సాధారణంగా 12 లక్షల టన్నుల మామిడి దిగుబడి వస్తుంది. ఈ ఏడాది దిగుబడి 9 లక్షల టన్నుల మామిడి దిగుబడిపై వర్షాల ఎఫెక్ట్‌‌‌‌ పడింది. రూ.40 వేలకు టన్ను ధర కట్టినా రూ.నాలుగు వేల కోట్ల వరకూ నష్టం ఉంటుంది. మిగతా ఉద్యాన పంటలు ఎకరానికి యావరేజీగా రూ.30 వేల చొప్పున పంట నష్టం జరిగిందని వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇతర పంటలకు కలుపుకున్నా మొత్తంగా పది వేల వేల కోట్ల వ్యవసాయ సంపద వర్షాల పాలైంది.

విపత్తులు వచ్చినప్పుడు రైతులకు సాయం చేయడానికి కొన్ని రూల్స్ ఉంటయి. అందులో ఒకటి 33 శాతం దెబ్బతిన్న పంటల్నే విపత్తు నిర్వహణ కింద పరిగణనలోకి తీసుకోవడం. ఫీల్డ్‌‌‌‌ లెవల్‌‌‌‌ అగ్రికల్చర్‌‌‌‌ ఆఫీసర్లు 32 అంశాలతో పంట నష్టం లెక్కింపు చేపడతారు. వీరు వేసిన అంచనాల ద్వారా లక్షా 51 వేల 645 ఎకరాలల్లో మాత్రమే నష్టం జరిగిందని తేల్చారు. 26 జిల్లాల్లోని లక్షా 30 వేల 988 మంది రైతులు పంట నష్టపోయారని వారికి రూ.151 కోట్ల 64లక్షల 55 వేల పరిహారం అందిస్తామని ప్రకటించారు. జరిగిన నష్టం పది వేల కోట్లని అంచనా వేస్తూంటే 150 కోట్ల సాయం రైతులకు ఏం సరిపోతుంది. ఇది కూడా ఇవ్వలేదు ఇస్తారని ఆశలు పెట్టుకోవడమే.

సమయానికి పంట కొనకపోవం వల్ల రైతులకు అధిక నష్టం జరిగింది. అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటును ఆలస్యం చేశారు. భారత ఆహార సంస్థ నిబంధనల ప్రకారం 15శాతం మించిన తేమ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అనుమతి లేదు. పూర్తిగా తడిసిన ధాన్యం 50శాతానికి మించిన తేమతో కూడి ఉంటుంది. ఆరబెట్టే సమయంలో 5 రోజులు దాటితే ధాన్యం మొలకెత్తుతుంది. ఇప్పుడు అత్యధిక మంది రైతులు ఇదే సమస్యతో ఉన్నారు. కోత దశకు వచ్చిన వరి పొలాలు పరిచిన చాపగా పడుకున్నాయి. దీంతో యంత్రాలతో కోతలు మొదలుపెట్టే అవకాశం లేకుండా పోయింది. ఓ వైపు ప్రభుత్వం నెమ్మదిగా ఉంటే మరో వైపు రైస్ మిల్లర్లు రైతులతో ఆడుకుంటున్నారు. ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వారు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా కాపాడే లక్ష్యంతో దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ధాన్యం కొనుగోళ్లపై రైస్‌ మిల్లర్ల తీరు శాపంగా మారింది. అనేక చోట్ల రైతులను వివిధ రకాలుగా అగచాట్లు పెడుతున్నారు.

రైతు పంట పండించారు. అకాల వర్షాల వల్ల పంటఅంతా పోతే ఎవరికి నష్టం. ప్రాథమికంగా రైతుకే నష్టం కానీ దీర్ఘంగా ఆలోచిస్తే అది మనకే నష్టం. పంటదారుణంగా పోవడం వల్ల ఆహారధాన్యాల కొరత ఏర్పడుతుంది. దీని వల్ల రేట్లు పెరుగుతాయి. ధాన్యం రికార్డు స్థాయిలో ఉత్పత్తి అయినప్పుడు కూడా బియ్యం ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. మరి వాటి దిగుబడి తగ్గితే పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయగలమా ఒక్క ధాన్యం విషయంలోనే కాదు అన్ని రకాల పంటల విషయంలో ఇదే సమస్య వస్తుంది. కూరగాయల పంటల ధ్వంసం అయ్యాయి దీని వల్ల రైతు నష్టపోయారు కానీ మర్కెట్లో కూరగాయల ధరలు పెరిగిపోవడం వల్ల ప్రజలందరూ నష్టపోతున్నారు. ఇది ప్రతీ ఒక్క వ్యవసాయ ఉత్పత్తికి వర్తిస్తుంది. అంటే రైతును కాపాడుకుంటే మొత్తం ప్రజల్ని నష్టాల బారి నుంచికాపాడుకోవచ్చు. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి.

రైతుల విషయంలో ప్రభుత్వాలు అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయి. నష్టపోయినప్పుడు పరిహారం ఇస్తామని హడావుడి చేస్తాయి. కానీ పంట నష్టపోకుండా ఎందుకు జాగ్రత్తలు తీసుకోరు తీసుకునేలా ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకోదు అనేది ఇక్కడ కీలకం. అకాల వర్షాలు వస్తాయని తెలిసినప్పుడు వెంటనే రైతుల్ని అప్రమత్తం చేసి పంటను కాపాడుకునేలా వారికి తగిన సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. కానీ అలాంటివేమీ చేయడం లేదు. కనీస సమాచారం ఇవ్వడం లేదు. పట్టాల వంటి ప్రథమిక అవసరాలు తీర్చడం లేదు. ఫలితంగా రైతులు మొత్తంగా నష్టపోతున్నారు. అంతిమంగా ప్రజలపై భారం పడుతుంది. మన దేశం సంప్రదాయంగా వ్యవసాయ అధారిత దేశం. అందుకే ప్రతీ వ్యవస్థలోనూ వ్యవసాయానికి అనుబంధంగా ఆ రంగానికి మేలు చేసేలా కొన్ని ఏర్పాట్లు ఉంటాయి. కానీ అవన్నీ నిద్రాణ స్థితిలోనే ఉంటున్నాయి. యాక్టివ్ గాఉంటే రైతులకు ఇంత తీవ్రంగా నష్టపోరు. ఆ ప్రభావం సామాన్య ప్రజలపై పడదు. కానీ ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం చేయడం వల్లనే అటు రైతులు ఇటు ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ఎన్ని విపత్తులొచ్చినా ఇదే పరిస్థితి మార్పు మాత్రం కనిపించడం లేదు.