హైదరాబాద్ సరూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువ సంఘర్షణ పేరుతో సభను సోమవారం నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఏఐసిసి జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరయ్యారు. సభ అట్టహాసంగానే జరిగింది జనం బాగానే వచ్చారు. నేతల ప్రసంగాలకు కేరింతలు కొట్టారు. వారిని చూసి నాయకుల్లో కూడా జోష్ పెరిగింది. తెలంగాణ అసెంబ్లీకి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలు సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. బీఆర్ఎస్ ను ఓడించే సత్తా తమకే ఉందని విశ్వసిస్తున్న కాంగ్రెస్ పార్టీ దూకుడును పెంచింది. ఎన్నికల సంవత్సరంలో కావాల్సినంత మైలేక్ కోసం ప్రయత్నిస్తూనే ఉంది. గేతేడాది రైతు డిక్లరేషన్ విడుదల చేస్తే ఈ సారి సరూర్ నగర్ సభలో యూత్ డిక్లరేషన్ ను ఆవిష్కరించింది. సీనియర్లు సహకరించకపోయినా అడపా దడపా ఒకరిద్దరు మాత్రమే చేతులు కలుపుతున్నా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం ప్రయత్న లోపం లేకుండా ముందుకు సాగుతున్నారు. ధరణి పోర్టల్ రద్దు అనేది రైతు డిక్లరేషన్ లో ప్రధానమైనదైతే తక్షణమే రెండు లక్షల ఉద్యోగాల కల్పన యూత్ డిక్లరేషన్ లో అత్యంత ఆకర్షణీయమైన అంశంగా చెప్పాలి.
దేశ రాజకీయాలను ఒకప్పుడు శాసించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మనగడ కోసం పాకులాడుతోంది. దేశవ్యాప్తంగా ఒకప్పుడు అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని చెలాయించిన ఈ పార్టీ ఒక్కో రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయి ధీనస్థితికి చేరిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణలో అధికారాన్ని దక్కించుకుంటుందని భావించినప్పటిక విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోను ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. బయట నుంచి వచ్చిన నాయకుడైనప్పటికీ రేవంత్ రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న వారికంటే ఎక్కువ అంకితభావంతో పనిచేస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ వద్ద తన పలుకుబడి పెంచుకునేందుకు వచ్చే ఏ ఒక్క అవకాశాన్ని నదులుకోవడం లేదు. సీనియర్లు పూర్తి స్థాయిలో సహాయ నిరాకరణ చేస్తున్నా ఆయన లెక్కలోకి తీసుకోవడం లేదు. వారు సహకరించకపోవడమే తనకు మంచిదన్నట్లుగా మొత్తం తన మార్క్ బలప్రదర్శన చేస్తున్నారు. హైకమాండ్ ను రప్పించి ఆయన నిర్వహించే సభలన్నీ సూపర్ సకెస్స్ అవుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ కు ఆయనే తగిన నాయకుడన్న ఫీలింగ్ వచ్చేస్తోంది.
ప్రియాంక సమక్షంలో విడుదలైన యూత్ డిక్లరేషన్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ ను అధికారానికి తీసుకొచ్చే సత్తా యువతకు మాత్రమే ఉందన్నట్లుగా ఆ డిక్లరేషన్ సందేశమిచ్చింది. ఐదు శీర్షికల్లో విడుదలైన డిక్లరేషన్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడమే ప్రధాన అజెండాను ఆవిష్కరించింది. తెలంగాణ ఉద్యమకారులకు 25 వేల రూపాయల పెన్షన్, అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వోద్యోగం, ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ క్యాలెండర్, యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు లాంటివి అందులో ప్రధానాంశాలు. వాటన్నింటికీ మించి ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ ప్రత్యేక ప్రస్తావనకు వచ్చింది. ప్రైవేటు సంస్థల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ అందే విధంగా చూస్తామని డిక్లరేషన్ హామీ ఇచ్చింది. నిజానికి రెండు మూడు రాష్ట్రాల్లో పార్టీలు ఇలాంటి హామీలు ఇచ్చినా అవి అమలుకు నోచుకోలేదు. అమలు ప్రక్రియపై ఇప్పటికీ అనుమానాలున్నాయ్.
తెలంగాణ ఏర్పాటైతే తమ కష్టాలు తీరుతాయని భావించిన యువతకు నిరాశే ఎదురైంది. కేసీఆర్ ప్రకటించిన లక్ష ఉద్యోగాలు కూడా ఒట్టిమాటే అయ్యింది. ఇంతవరకు పూర్తి స్థాయిలో నియామకాలకు నోచుకోలేదు. పైగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ స్కాంతో యువతలో ప్రభుత్వం పట్ల విశ్వాసం సన్నగిల్లింది. తెలంగాణ రాజకీయ నాయకుల పట్ల కూడా యూత్ అనుమానంగా చూస్తోంది. వారిలో మళ్లీ విశ్వాసం పెంచేందుకు కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ పనికొచ్చే అవకాశం ఉంది. కాకపోతే దాన్ని జనంలోకి ఎలా తీసుకెళ్తాన్నదే ప్రశ్న. టీమ్ రేవంత్ ముందు పెద్ద టాస్కే ఉంది. అధిష్టానాన్ని మెప్పించడం ఒక్కటే ముఖ్యం కాదు. సామాన్య జనాన్ని కూడా మెప్పించాలి కదా.