మేము చాలా రోజులున్నాం ఇక విశ్రాంతి తీసుకుంటాం మా పిల్లలకు అవకాశమిచ్చి ఆశీర్వదించండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేతల నుంచి వినిపిస్తున్న వినతులు ఇవే. కోరుట్లలో కూడా అంతే.
కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఈ సారి జరగబోయే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకే తన రాజకీయ వారసుడిగా కొడుకు కల్వకుంట్ల సంజయ్ కుమార్‌ను తెరమీదకు తీసుకువస్తున్నారు. సంజయ్‌ని ప్రమోట్ చేసేందుకు పార్టీ సమావేశాల్లో ఏ ఒక్క అవకాశాన్నీ చేజారనీయడం లేదు. ఏడాదిన్నరగా సంజయ్ కుమార్ కోరుట్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కోరుట్ల నియోజకవర్గంలో 2009 నుంచి ఇప్పటి వరకు వరుసగా నాలుగు సార్లు విద్యాసాగర్ రావు ఎమ్మెల్యేగా గెలిచారు. వాస్తవానికి 2018 ఎన్నికల్లోనే సంజయ్ కుమార్‌ను పోటీ చేయించాలని భావించారు విద్యాసాగర్ రావు. అయితే సిట్టింగులకే టికెట్లు ఇస్తామని గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించడంతో మరోసారి విద్యాసాగర్ రావే ఎన్నికల గోదాలో దిగాల్సి వచ్చింది. మళ్లీ సిట్టింగులకే టికెట్లు అన్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రకటనతో ఆయన కొంత టెన్షన్ పడుతున్న మాట వాస్తవం
ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో మాత్రం విద్యాసాగర్ రావు తన కొడుకును ఎలాగైనా రాజకీయ రంగప్రవేశం చేయించాలని చూస్తున్నారు. ఈ మధ్యే జరిగిన బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ సమావేశాల్లో స్వయంగా విద్యాసాగర్ రావే నిలబడి ఈసారి తన కొడుకును ఆశీర్వదించాలని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా ఆర్నెల్ల క్రితం జగిత్యాల జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో కోరుట్ల నియోజకవర్గ సీటు చర్చకు వచ్చిందట. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి ఈ సారి కోరుట్లలో విద్యాసాగర్ రావు కొడుకు పోటీకి రెడీ అవుతున్నారని చెప్పబోతుండగా అలాంటిదేమీ లేదు కదా మనం సిట్టింగులకే సీట్లు ఇస్తున్నాం అంటూ కేసీఆర్ చెప్పడంతో విద్యాసాగర్ రావు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారని తెలిసింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన మంత్రి కేటీఆర్ కు సంజయ్ కుమార్ క్లాస్ మేట్. కేటీఆర్ ప్రోత్సాహంతోనే ఈ సారి సంజయ్ కుమార్ కోరుట్లలో పోటీ చేయబోతున్నారని టాక్ వినిపించింది. అందులో భాగంగానే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న కోరుట్ల నియోజకవర్గంలో ఓ వైపు కవిత మరోవైపు కేటీఆర్ ఇద్దరూ సంజయ్ కుమార్‌కు బూస్టప్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కేటీఆర్ సంజయ్‌వైపు మొగ్గుతుండగా కేసీఆర్ మాత్రం విద్యాసాగర్ రావు పట్ల సుముఖంగా ఉన్నారన్న వార్తలతో కోరుట్ల గులాబీ టికెట్‌పై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండంతో ఓటర్లను తమవైపుకు తిప్పుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తోంది. ప్రతీ సభలోనూ విద్వాసాగర్ రావు తన కుమురుడిని ఆశీర్వదించాలంటూ ప్రసంగాలు చేస్తున్నారు. ఇక తాను రిటైర్మెంట్ తీసుకుంటానన్నట్లుగా సందేశమిస్తున్నారు. సంజయ్ ఎక్కువ పర్యటనలు చేసే విధంగా షెడ్యూల్ కూడా తండ్రే సిద్ధం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఎంత చెప్పినా జనంలో ఆ ఫీలింగ్ లేదన్న చర్చ జరుగుతోంది. సంజయ్ ను వారసుడిగా అంగీకరించేందుకు కోరుట్ల జనం సిద్ధంగా లేరు. అదే అంశం కేసీఆర్ నిర్వహించిన ఇంటర్నల్ సర్వేలో వెల్లడైందని చెబుతున్నారు. పైగా సిట్టింగులకు తప్ప వారసులకు అవకాశం ఇవ్వకూడదని కేసీఆర్ ముందే డిసైడయ్యారు. కేసీఆర్ ను పదేపదే విసిగిస్తే మాత్రం తర్వాతి పరిణామాలు వేరుగా ఉంటాయని విద్యాసాగర్ రావుకు తెలియనిది కాదు.