దళిత బంధు కమిషన్ల అవినీతిలో కారు, కమలం ఒకటేనా

By KTV Telugu On 10 May, 2023
image

గులాబీ నేతలు దళితబంధు గుబులుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎమ్మెల్యేల అవినీతి చిట్టా తన దగ్గర ఉందని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఎవరికి వారే భుజాలు తడుముకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు కలవర పడుతున్నారు. దళితబంధు దందాలో అధికార పక్ష నేతలతో పాటు విపక్ష నేతలు కూడా చేతివాటం ప్రదర్శించారనే విషయం తాజాగా వెలుగులోకి వస్తోంది. తిలా పాపం తలా పిడికెడన్నట్లుగా పథకాన్ని పంచుకున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలు ఇప్పుడు తప్పించుకునే మార్గాల కోసం వెదుకుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకంలో వసూళ్ల దందా సాగిందని స్వయానా సీఎం కేసీఆర్ కొన్ని రోజుల క్రితం పార్టీ మీటింగులో ప్రకటించారు. అప్పటి నుంచి దళిత బంధు ఫ్రాడ్ ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. బహిరంగంగా సాగిన వసూళ్ల పర్వంలో అధికార పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు కూడా పాలు పంచుకున్నట్లు క్రమంగా బయటకు వస్తోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని కొందరు ఎమ్మెల్యేలు తమ అనుచరులతో పాటు బీజేపీ, కాంగ్రెస్ వారికి కూడా పంపకాలు చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ మున్సిపాలిటీల్లో ఇతర పార్టీలకు చెందిన కౌన్సిలర్లు లబ్ధి పొందారు. ప్రధానంగా నిజామాబాద్ నగరంలో మెజార్టీ కార్పొరేటర్లు బీజేపీకి చెందిన వారే ఉన్నారు. పేద దళితులకు లబ్ధి కలుగుతుందని బీజేపీ కార్పొరేటర్లు ఒక్కొరికి రెండు యూనిట్లు ఇచ్చారు.

నిజానికి ఒకరిద్దరు బీజేపీ కార్పొరేటర్లు నిజాయితీగా అర్హులైన లబ్ధిదారులకే దళితబంధును అందించారు. కానీ మెజారిటీ కార్పొరేటర్లు మాత్రం లబ్ధిదారుల పేర్లు ఇవ్వకుండా పర్సెంటేజి వసూలు చేసుకొని చేతులు దులుపుకున్నారు. పార్టీ మారిన బీజేపీ కార్పొరేటర్లు నగదుతో పాటు పది యూనిట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. నాలుగేళ్లుగా కార్పొరేషన్ వ్యవహారాల్లో మెజారిటీ బీజేపీ కార్పొరేటర్లు అధికార పార్టీ నేతలతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటున్నారు. దీని ఫలితంగా దళితబంధులో వాటాలు పొందినట్లు ప్రచారం జరుగుతోంది. దళితబంధు లబ్ధిదారుల ఎంపిక మొదలు వారికి డబ్బులు వచ్చే వరకు దళారీ వ్యవస్థ పని చేసింది. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, పీఏలు, ప్రధాన అనుచరులు ఎమ్మెల్యేల పేరు చెప్పి వసూళ్లు చేశారు. ఇద్దరు ముఖ్య ప్రజాప్రతినిధుల తమ్ముళ్ళు, ఓ ఎమ్మెల్యే పీఏ, మరో ముఖ్య నేత కొడుకు, ఓ మున్సిపల్ ప్రతినిధి ఇలా ఒక్కో చోట ఒక్కొక్కరు వసూళ్ల పర్వం సాగించారు. కానీ ఎవ్వరు వసూలు చేసినా ఎమ్మెల్యేలదే బాధ్యతని సీఎం తెగేసి చెప్పారు. దీనితో వసూళ్ళ మచ్చ తమకు ఎక్కడ ముప్పు తెస్తుందోనని ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. తిన్నది బీజేపీ వారైనా కేసీఆర్ దగ్గర దోషులుగా నిలబడాల్సిందీ తామేనని ఎమ్మెల్యేలు భయపడుతున్నారు.

అధికారానికి రాగానే కేసీఆర్ కుటుంబాన్ని కోర్టుకు ఈడ్చుతామని జైల్లో పెడతామని టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చెబుతుంటారు. ప్రతీ సభలో అన్ని ప్రెస్ మీట్స్ లో కూడా అదే మాట అంటుంటారు. అవినీతిమయమైన కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్నే కాకుండా ఢిల్లీ లిక్కర్ స్కాంతో దేశాన్ని కూడా అథోగతిపాలు చేస్తోందని ఆయన వాపోతుంటారు. కాకపోతే తన కళ్లెదుటే కరీంనగర్ కు దగ్గరగా ఉండే నిజామాబాద్ లోనే బీజేపీ నేతలు బీఆర్ఎస్ తో చేతులు కలిపి అవినీతి చేస్తుంటే మాత్రం ఆయన పట్టించుకోరు తెలియనట్లుగా నటిస్తుంటారు. నిజంగా తెలియదా లేకపోతే ఇంకేమైనా ఉందా లోగుట్టు పెరుమాళ్ కే ఎరుక.