వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 

By KTV Telugu On 10 May, 2023
image

కృత్రిమ మేథతో పనిచేసే యంత్రాల విన్యాసాలు చూసి పొంగిపోయాడు మనషి. తాను సాధించిన విజయం అనితర సాధ్యమైనదని కాలర్ ఎగరేశాడు. అయితే  తాను సృష్టించిన యంత్రం తన నియంత్రణ దాటి పోతోందని తెలిసి వెన్నులో వణుకు పుట్టి కంగారు పడుతున్నాడు. కృత్రిమ మేథస్సు మీద పరిశోధనలను కొంతకాలం పాటు నిలిపివేయాలని ప్రపంచానికి సూచిస్తున్నాడు. దీనిపై మేథావుల్లో చర్చ జరగాలని అంటున్నారు. లేకపోతే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవని వారు హెచ్చరిస్తున్నారు. గూగుల్ కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగపు హెడ్ గా పనిచేస్తోన్న జెఫరీ హింటన్ హఠాత్తుగా తన ఉద్యోగానికి రాజీనామా చేసేశారు. అది కూడా చాలా బాధతో భయంతో ఆందోళనతో కూడిన ఆక్రోశంతో ఉద్యోగానికి దూరం అయ్యారు. ఇలా రాజీనామా చేసిన సందర్భంలోనే తన మనసులోని భయాందోళనలను బయట పెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో మానవాళికి పెను ముప్పు పొంచి ఉందని హింటన్ అంటున్నారు. నిజానికి కృత్రిమ మేథకు ఆది గురువు జెఫరీ హింటనే. యంత్రాలకు మనం చెప్పేది అర్ధం చేసుకునే తెలివితేటలు నైపుణ్యాలను కల్పించే న్యూరల్ నెట్ వర్క్స్ హింటన్ మెదడులోనే పురుడు పోసుకుంది.

టెక్నాలజీతో మానవాళికి ఏదో ఒక మేలు చేయాలన్న మంచి ఆలోచనతోనే హింటన్ న్యూరల్ నెట్ వర్క్స్ ను కనిపెట్టారు. అయితే కాల క్రమంలో హింటన్ లో కొన్ని భయాలు అనుమానాలు మొదలయ్యాయి. హింటన్ రూపొందించిన న్యూరల్ నెట్ వర్క్స్ సాయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో పనిచేసే యంత్రాలతో మనకి కావల్సిన పనులు చేయించుకోవచ్చు. మనిషి చెప్పే భాషను ముందుగా యంత్రాలకు నేర్పుతారు. అందుకోసం న్యూరల్ నెట్ వర్క్స్ ను వినియోగిస్తారు. తద్వారా యంత్రంతో మనిషి రకరకాల విన్యాసాలు చేయిస్తాడు. ప్రోగ్రామ్ ఆపరేషన్ ద్వారా యంత్రాలు  మనిషిని కనిపెట్టుకుని ఉండడమే కాదు అతని అవసరాలకు అనుగుణంగా నడుచుకుంటాయి. వేళకు కాఫీలు టిఫినీలు తెచ్చి ఇస్తాయి. బాస్ తిన్న తర్వాత వాటిని తీసుకుపోయి పాత్రలు శుభ్రం చేస్తాయి. సరుకులను ఇక్కడి నుండి అక్కడికి అక్కడి నుండి ఇక్కడకు తెచ్చి పెడతాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రాణం అయితే ఉండదు కానీ మనుషులతో సహజీవనం చేసేస్తాయి. ఇంట్లో మనిషిలా కలిసిపోయి ఉంటాయి. మరి ఇన్ని పనులు చేస్తోన్నప్పుడు కృత్రిమ మేథ గురించి భయపడ్డం ఎందుకని కొందరికి అనుమానాలు రావచ్చు.

ఇక్కడే అసలు మతలబు ఉంది. యంత్రాలు మనం చెప్పింది అర్ధం చేసుకుని చెప్పిన పనులు చేసినంత కాలం ఓకే. కానీ ఈ క్రమంలో యంత్రాలు మనిషి నియంత్రణలో ఉండకపోతే సమస్యలు మొదలవుతాయంటున్నారు. ఈ కారణంతోనే హింటన్ గూగుల్ కి రాజీనామా చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ చాలా రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. దీని పుణ్యమా అని లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడాల్సి వస్తోంది. రకరకాల పరిశ్రమలలో పాటు ఇళ్లల్లోనూ యంత్రాలు పనులు చేసేస్తున్నాయి. అయితే వీటిని రక్షణ రంగంలోనూ వాడేయడం మొదలు పెట్టారు. ఇదే  భవిష్యత్తులో ప్రమాదకారి కావచ్చునంటున్నారు నిపుణులు. అమెరికా లోని పెంటగాన్ కృత్రిమ మేథతో పనిచేసే యంత్రాలను వినియోగిస్తోంది. దేశాల సైన్యాలే కాదు ఉగ్రవాదులూ వీటిని వాడుకోవడం మొదలు పెడితే అది ఎటువంటి విధ్వంసాలకు దారి తీస్తుందో ఊహించుకుంటేనే భయమేస్తోందంటున్నారు మేథావులు. యంత్రాలు వచ్చాక మనుషులు సుఖం మరిగారు బద్ధకం మరీ పెరిగిపోయి ప్రతీపనికీ యంత్రాలపై ఆధారపడ్డం మొదలైంది. అచ్చం మనిషిలానే ఉండే అద్భుత రోబో సోఫియా గురించి తెలుసు కదా. సౌదీ అరేబియా ప్రభుత్వం 2017లో సోఫియాకు ఏకంగా పౌరసత్వం కూడా కట్టెబట్టేసింది. చూడ్డానికి మనిషిలానే ఉండే సోఫియా భావోద్వేగాలను తన హావభావాలతో ప్రదర్శించి ఆకట్టుకుంటోంది సోఫియా. ప్రమాదకరమైన ప్రాంతాల్లో మనిషి చొరబడలేని ప్రదేశాల్లో యంత్రాలతో పనిచేయించుకోవడం సదుపాయంగానే ఉంటుంది.

అందుకే ఈ ఆవిష్కరణలకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభించింది. అయితే  ఈ యంత్రాలే మనిషిని ప్రమాదంలోకి నెట్టేస్తాయని హింటన్ వంటి మేథావులే చెప్పిన తర్వాత భవిష్యత్ ఎలా ఉంటుందోనని ప్రపంచం ఆందోళన చెందుతోంది. జెఫరీ హింటన్ ఒక్కరే కాదు. ఈ రంగంలోని పలువురు దిగ్గజాలు సైతం కృత్రిమ మేథపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్ ఏ.ఐ. కంపెనీ సిఇఓ శామ్ ఆల్ట్ మ్యాన్, గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ లు కూడా కృత్రిమ మేధస్సుతో ప్రమాదాలు తప్పవంటున్నారు. జాగ్రత్తగా ఉండాల్సిందే అంటున్నారు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరగాలని వారు సూచిస్తున్నారు. సుందర్ పిచాయ్ అయితే తనకి ఏ.ఐ. ఇప్పటికీ అర్ధం కాలేదన్నారు. ఏ.ఐ. తో పాటు అసలు మనిషి మెదడు ఎలా పనిచేస్తుందన్నదానిపైనా తనకు అవగాహన లేదన్నారు. ఓపెన్ ఏ.ఐ. అందిస్తోన్న చాట్ జిపిటి  ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోందని సామ్ అంటున్నారు. ఇది ఆందోళన కలిగిస్తోందన్నారాయన. మనుషుల నియంత్రణలో ఉన్నంత కాలం యంత్రాల గురించి భయపడక్కర్లేదు కానీ మనుషుల నియంత్రణనుంచి అవి దాటిపోతే మాత్రం మనిషి చేతులెత్తేయక తప్పదని శామ్ హెచ్చరిస్తున్నారు. కృత్రిమ మేథస్సు అనేది అత్యంత ప్రమాదకరమైన టెక్నాలజీ అంటున్నారు ఎలాన్ మస్క్. టెస్లా కంపెనీలో తాను చాలా ఇబ్బందులు పడ్డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీయే కారణమని మస్క్ గుర్తు చేసుకున్నారు.

మనిషి చెప్పింది చేసే యంత్రం మనిషి చేసే ప్రతీ పనిని అర్ధం చేసుకునే క్రమంలో మనిషితో తనకి ప్రమాదం ఉందని భావిస్తే మనిషిని ఖాతరు చేయకుండా అతని నియంత్రణ దాటిపోయే అవకాశాలు ఉంటాయంటున్నారు బిల్ గేట్స్. తమ ప్రయోజనాలకు భిన్నంగా మనిషి వ్యవహరిస్తున్నాడని యంత్రాలు భావిస్తే అపుడు సమస్యలు మొదలైపోతాయని అంటున్నారు. అదే పెను విపత్తుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. హింటన్ కనిపెట్టిన టెక్నాలజీతో యంత్రాలు మనుషులను అర్ధం చేసుకోవడానికి వీలు పడింది. అది పెద్ద విప్లవాన్నే తెచ్చింది. అణుబాంబు సిద్ధాంతాన్ని కనిపెట్టిన అల్బర్ట్ ఐన్ స్టెయిన్ ఆ తర్వాత అది చేసే విధ్వంసాలు చూసిన తర్వాత జీవితాంతం దాన్ని ఎందుకు కనిపెట్టానా అని బాధ పడ్డాడు. ఏకే 47.ఏకే 56 తుపాకులు కనిపెట్టిన రష్యన్ లెజెండ్ కలెష్నికోవ్ తాను సృష్టించిన ఆయుధం ఉగ్రవాదుల చేతుల్లో పడే సరికి కంటతడి పెట్టాడు. కృత్రిమ మేథకు బీజం వేసిన మరో సృష్టి కర్త జెఫరీ హింటన్ ఇపుడు అలానే పశ్చాత్తాప పడుతున్నారు. కృత్రిమ మేథస్సు మానవాళికి పెను విపత్తుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాడు. హింటన్ తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ప్రమోట్ చేసిన పలువురు నిపుణులు సైతం ఇది ఎంత మాత్రం మంచిది కాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.