నేను ముఖ్యమంత్రి రేసులో లేను.. పవన్ కళ్యాణ్

By KTV Telugu On 12 May, 2023
image

టిడిపి-జనసేన పొత్తు పెట్టుకుంటే ముఖ్యమంత్రి పదవి ఎవరికి దక్కుతుంది. అన్న అంశంపై  రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోన్న వేళ పవన్ కళ్యాణ్ ఓ క్లారిటీ ఇచ్చేశారు. తానసలు ముఖ్యమంత్రి పదవి గురించి ఆలోచించడం లేదని తేల్చేశారు. పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పవన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవిపై తన మనసులో ఉన్న మాట బయట పెట్టారు. తాను ముఖ్యమంత్రి పదవి రేసులో లేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంచుమించు క్లారిటీ ఇచ్చేశారు. బలం లేకుండా ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పొత్తులు పెట్టుకున్న పార్టీలతో షరతులు ఎలా విధిస్తామని కూడా ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా కలిసొచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటామన్నారు పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలని జనసైనికులు, పవన్ అభిమానులతో పాటు కాపు సామాజిక వర్గం ఆకాంక్షిస్తోన్న సంగతి తెలిసిందే. అటువంటి జనసేనతో పొత్తు కోసం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడే తాపత్రయ పడ్డంతో జనసేన పార్టీ శ్రేణుల్లో హుషారు పెరిగింది. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం ఖాయమంటూ వారు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం పవన్ కళ్యాణ్  కేవలం చంద్రబాబు నాయుణ్ని ముఖ్యమంత్రిని చేయడానికే టిడిపితో పొత్తు పెట్టుకుంటున్నారని జనసైనికుల ఓట్లను చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నారని విమర్శలు చేస్తూ వచ్చింది. చంద్రబాబు పల్లకి మోయడానికి జనసైనికులు సిద్ధంగా ఉంటారా అని ప్రశ్నించింది కూడా. ఈ సందర్భంలోనే పవన్ కళ్యాణ్ ఓ బహిరంగ లేఖ రాశారు. జనసైనికులను ఉద్దేశించిన ఆ లేఖలో పొత్తుల గురించి కానీ ఒప్పందాల గురించి కానీ ఇతర రాజకీయ పార్టీలు ఏం మాట్లాడినా స్పందించవద్దంటూ వారికి సూచించారు పవన్ కళ్యాణ్. ఎవరి ట్రాప్ లోనూ మీరు పడద్దని హితవు పలికారు. సమయం వచ్చినపుడు పొత్తుల గురించి తానే చెబుతానని అన్నారు.

ఇపుడు ఆ విషయంలోనే పవన్ తన అభిమానులతో పాటు ప్రజలందరికీ క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవి అనేది కావాలంటే వచ్చి పడిపోదు. మనం సిఎం కావాలనుకుంటే అయిపోలేం. గత ఎన్నికల్లో మనకి కనీసం 30 నుండి 40 స్థానాలు వచ్చి ఉంటే ఇపుడు ముఖ్యమంత్రి పదవి కావాలని డిమాండ్ చేయగలిగేవాళ్లం. గత ఎన్నికల్లో మనకి ఏడు శాతం ఓట్లు వచ్చాయి. కొన్ని చోట్లు 20 శాతం ఓట్లు కూడా వచ్చాయి. ఇపుడా ఓట్లు రెట్టింపు అయ్యాయి. కర్నాటకలో కుమారస్వామి 30 పైచిలుకు స్థానాలు గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. మనం కూడా బలం ఉంటే సిఎం పోస్టు అడగచ్చు కానీ లేనపుడు షరతులు ఎలా విధిస్తాం అని పవన్ ప్రశ్నించారు. బలమైన పార్టీలతోనే పొత్తులు పెట్టుకుంటామని చెప్పారు కేసీయార్ నాయకత్వంలోని బి.ఆర్.ఎస్. కేంద్రంలోని బిజెపిలు కూడా ప్రారంభంలో పొత్తులు పెట్టుకునే ఎదిగాయని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ తాను ముఖ్యమంత్రి అవ్వడానికి పార్టీ పెట్టలేదని చంద్రబాబును సిఎంని చేయడానికే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని వైసీపీ నేతలు పదే పదే ఆరోపణలు చేస్తోన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అందరికీ ఈ విధంగా క్లారిటీ ఇచ్చి ఉంటారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు జనసైనికులకు నచ్చుతాయా లేదా అన్నది చూడాలి.

దీన్ని వారు జీర్ణించుకోలేకపోవచ్చునంటున్నారు రాజకీయ పండితులు. గత ఎన్నికల్లో ఏపీలో 137 నియోజక వర్గాల్లో  జనసేన పోటీ చేసింది. అయితే కేవలం ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక నియోజక వర్గాల్లో పోటీ చేసి రెండు చోట్లా ఓటమి చెందారు. రాజోలు నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్ధి రాపాక ప్రసాదరావు గెలిచారు. అయితే ఆ తర్వాత ఆయన పవన్ వైఖరి నచ్చక పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాలకు రాపాక మద్దతు పలుకుతున్నారు. 2024 ఎన్నికల్లో టిడిపి-జనసేన పొత్తు ఖాయమన్న సంకేతాలు ఇచ్చిన పవన్ పొత్తుకు ఒప్పుకోని పార్టీలను ఒప్పిస్తాం అన్నారు. అంటే బిజెపి నాయకత్వాన్ని ఒప్పించగలనని ఆయన ఇప్పటికీ నమ్ముతున్నారేమో అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తమది ఒక కులం కోసం పనిచేసే రాజకీయ పార్టీ కానే కాదన్నారు పవన్ కళ్యాణ్. పవన్ మీడియా సమావేశంతో  ఏపీలో వచ్చే ఎన్నికల్లో జనసేన దారి ఎటో స్పష్టత వచ్చినట్లే అంటున్నారు రాజకీయ పండితులు.