సుప్రీం ఫైర్.. ఇమ్రాన్ ఖాన్ విడుదల

By KTV Telugu On 12 May, 2023
image

 

ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తో పాకిస్థాన్ లో అల్లకల్లోలం ఏర్పడింది. పాకిస్థాన్ తెహరీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ కార్యకర్తలు వీధుల్లోకొచ్చి ఉధృతంగా ఆందోళనలు చేస్తున్నారు. ఆర్మీకి సంబంధించిన కార్యాలయాలు ఆస్తులపై దాడులు చేస్తున్నారు. ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంతో పోలీసులు లాఠీలకు పని చెబుతున్నారు. వెయ్యిమందికి పైగా ఆందోళన కారులను అరెస్ట్ చేశారు. ఆర్మీ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఇమ్రాన్ ఖాన్ తీవ్రమైన ఆరోపణ చేశారు. పాకిస్థాన్ లో ఆర్మీకి కోపం వస్తే మామూలుగా ఉండదు. కోపం చల్లార్చుకోడానికి ఆర్మీ ఎంతకైనా తెగిస్తుంది. ప్రస్తుతం పార్ ఆర్మీ చేస్తోంది కూడా అదే. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓ కేసుకు సంబంధిచి కోర్టుకు వస్తే కోర్టు గది తలుపులు బద్దలు కొట్టుకుంటూ పాక్ రేంజర్లు దూసుకు వచ్చి ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేశారు. ఈక్రమంలో ఇమ్రాన్ తరపు న్యాయవాదులపైనా చేయి చేసుకున్నారు. ఈ ఘటన చూసి ప్రధాన న్యాయమూర్తే షాక్ తిన్నారు. ఇది న్యాయ వ్యవస్థపైనే దాడి అని ఆయన ఆక్రోశించారు. ఇమ్రాన్ అరెస్ట్ పై పాకిస్థాన్ సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ఇమ్రాన్ అరెస్ట్ ను తప్పు బట్టింది. ఇది కోర్టు ధిక్కరణే అన్న సుప్రీం కోర్టు ఇమ్రాన్ ఖాన్ ను తక్షణమే కోర్టుముందు హాజరు పర్చాలని ఆదేశించింది.

2018లో ఇదే పాక్ ఆర్మీ ఇమ్రాన్‌ ఖాన్ కు అన్ని విధాలుగానూ అండగా ఉండి పాక్ ప్రధాని పీఠంపై కూర్చోబెట్టింది. ఆ ఎన్నికల్లో ఇమ్రాన్ తరపున ఆర్మీయే రిగ్గింగ్ చేయించిందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆర్మీతో ఇమ్రాన్ కు ఎక్కడో చెడింది. అంతే ఆర్మీ ఇమ్రాన్ పై పగ బట్టేసింది. దాంతో 2022 ఏప్రిల్ లో ఇమ్రాన్ రాజకీయ ప్రత్యర్ధులను దువ్విన ఆర్మీ  ఇమ్రాన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టించి పదవి నుంచి తప్పించేసింది. షెహబాజ్ షరీఫ్ ను ప్రధాని పీఠం పై కూర్చోబెట్టింది ఆర్మీ. ఆ వెంటనే ఇమ్రాన్ ఖాన్ ఆర్మీపై తీవ్ర విమర్శలు చేశారు. అమెరికాతో పాక్ ఆర్మీ కుమ్మక్కు అయ్యి తనను పదవి నుంచి తప్పించదని దుయ్యబట్టారు ఇమ్రాన్ ఖాన్. ఆర్మీపై బాహాటంగా విరుచుకు పడిన మొదటి ప్రధాని ఇమ్రాన్ ఖానే. అందుకే ఇమ్రాన్ పై కక్ష పెంచుకున్న ఆర్మీ తాను తెచ్చిన షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం చేత అనేక కేసులు పెట్టించింది. వందకు పైగా అవినీతి కేసులతో పాటు దైవ దూషణ, ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన కేసులు కూడా పెట్టారు. ఆ కేసుల్లో కొన్నింటిలో ఇమ్రాన్ ఖాన్ బెయిల్ తెచ్చుకున్నారు. ఓ అవినీతి ఆరోపణ కేసులో కోర్టుకు హాజరైనపుడు పాక్ రేంజర్లు అరెస్ట్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ పై ప్రస్తుతం 8 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. ఆ తర్వాత మరో ఆరు రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అది కూడా పూర్తయితే బెయిల్ పొందే అవకాశం ఉంటుంది. ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసిన తీరును సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలోనూ చూసిన పాక్ ప్రజలు  ప్రత్యేకించి ఇమ్రాన్ ఖాన్ అభిమానులు పాకిస్థాన్ తెహరీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చి ఆందోళనలకు దిగారు. ఈ ఆందోళనలు హింసాత్మక దాడులుగా మారుతున్నాయి. సైన్యానికి సంబంధించిన ఆస్తులు, కార్యాలయాలపై ఆందోళన కారులు దాడులు చేసి వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ పై పాక్ ఆర్మీ పెట్టించిన ముఖ్యమైన కేసు ఇమ్రాన్ కు సంబంధించిన అల్ ఖదీర్ యూనివర్శిటీ ట్రస్ట్ పై వచ్చిన అవినీతి ఆరోపణలు. ఈ ట్రస్ట్ ముసుగులో ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఆయన సతీమణి బుష్రా బీబీలు పెద్ద ఎత్తున నిధులను దారి మళ్లించి భూములు కొని సొంత ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు.

ప్రధాని హోదాలో ఇమ్రాన్ కు వివిధ దేశాల్లో వచ్చిన ఖరీదైన బహుమతులను ప్రభుత్వ ఖజానాకు అప్పగించకుండా నిబంధనలకు విరుద్ధంగా విక్రయించి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలూ వచ్చాయి. తనను ప్రధానిగా తప్పించిన తర్వాతి నుంచి ఇమ్రాన్ ఖాన్ ఆర్మీపై బాహాటంగా విమర్శలు చేస్తూనే వస్తున్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలను కదిలించడానికి భారీ ర్యాలీలూ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే గత నవంబరులో ఇమ్రాన్ ఖాన్ ఓ సభలో పాల్గొన్నప్పుడు ఆయనపై కాల్పులు జరిపాడు ఓ దుండగుడు. అతన్ని అరెస్ట్ అయితే చేశారు కానీ అతని వెనుక ఎవరున్నారో పోలీసులు ప్రకటించలేదు. పాక్ ఆర్మీ, పాక్ ప్రభుత్వాలు రెండూ కూడా అమెరికాతో కుమ్మక్కై పాకిస్థాన్ ను నాశనం చేస్తున్నాయని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పాకిస్థాన్ సమాజంలో అమెరికా పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకే ఇమ్రాన్ ఖాన్ తెలివిగా ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని ఇమ్రాన్ డిమాండ్ చేస్తున్నారు. పంజాబ్ ప్రావిన్స్ లో మే లో ఎన్నికలు జరపాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల్లో ప్రచారం చేసే వీలు లేకుండా అడ్డుకునేందుకే పాక్ ఆర్మీ అన్యాయంగా అరెస్ట్ చేయించిందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు. పాక్ ఆర్మీపై ఆగ్రహంతోనే భారత విదేశాంగ విధానాన్ని పదే పదే మెచ్చుకున్నారు ఇమ్రాన్ ఖాన్. రష్యా ఉక్రెయిన్ వార్ సమయంలో పాకిస్థాన్ అమెరికా అడుగులకు మడుగులొత్తితే భారత ప్రభుత్వం మాత్రం రష్యాపై అమెరికా విధించిన ఆంక్షలను బేఖాతరు చేస్తూ రష్యా నుండి చమురు దిగుమతి చేసుకోవడాన్ని ఇమ్రాన్ ఖాన్ కీర్తించారు. ఇటువంటి చర్యలన్నీ ఇమ్రాన్ ను ఆర్మీకి మరింత దూరం చేశాయి.

గతంలో ఇమ్రాన్ ఖాన్  తనను పోలీసులు అరెస్ట్ చేస్తారన్న అనుమానం రాగానే ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో నన్ను పాక్ ఆర్మీ అరెస్ట్ చేయించవచ్చు. అదే జరిగితే పాకిస్థాన్ లో ప్రజాస్వామ్యం లేనట్లే. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి మీరంతా వీధుల్లోకి వచ్చి నియంత పాలకులు యత్నాలను అడ్డుకోవాలి అని పిలుపునిచ్చారు ఇమ్రాన్. తాజగా ఇమ్రాన్ అరెస్ట్ నేపథ్యంలో ఆయన పార్టీ నేతలు ఆ పాత వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. నన్ను వీళ్లు హతమార్చే అవకాశం కూడా ఉందని ఇమ్రాన్ ఖాన్ భయాందోళనలు వ్యక్తం చేశారు. ఇమ్రాన్ అరెస్ట్ అనంతరం ఆందోళనలు ఊపందుకోగానే ఇమ్రాన్ పార్టీలోని కీలక నేతలు మాజీ మంత్రులను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళన కారులనూ జైళ్లకు పంపుతున్నారు. పరిస్థితి చాలా భయంకరంగా అనిశ్చితంగా ఉంది. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ పాక్ లోని అరాచకత్వానికి నిలువెత్తు నిదర్శనం. ఆయన్ను అరెస్ట్ చేసింది పోలీసులు కాదు. పాక్ ఆర్మీలోని పారా మిలటరీ ఫోర్స్ కి చెందిన రేంజర్లు. సరిహద్దుల్లో కాపలా కాయాల్సిన రేంజర్లే దేశం నడిబొడ్డున పోలీసుల పరిధిలో జోక్యం చేసుకుని చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం అత్యంత దుర్మార్గమే అవుతుంది. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తోనే ఇది మొదలు కాలేదు. అసలు పాకిస్థాన్ లో ప్రధానమంత్రి ఉద్యోగం అంటే షార్ట్ టెర్మ్ జాబే. ఇంత వరకు పాకిస్థాన్ కు 19 మంది ప్రధానులు వస్తే అందులో ఒక్కరు కూడా పూర్తికాలం పదవిలో లేరు. అదీ అక్కడి ఆర్మీ దెబ్బ అంటే. పాక్ తొలి ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ ను ఓ కిరాయి హంతకుడు రావల్పిండి సభలో కాల్చి చంపాడు. పాక్ అయిదో ప్రధాని సుహ్రవర్దీ ప్రభుత్వాన్ని నాటి ఆర్మీ జనరల్ అయూబ్ ఖాన్ తన చేతుల్లోకి తీసుకున్నాడు.

ఆ తర్వాత సుహ్రవర్దీని ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించారు. దేశాధ్యక్షుడి వ్యవహరించి ఆ తర్వాత ప్రధాని అయిన జుల్ఫికర్ అలీ భుట్టోకీ అప్పటి మిలటరీ చీఫ్ జియా ఉల్ హక్ కూ మధ్య తేడాలు వచ్చాయి. భుట్టోను అరెస్ట్ చేయించి ప్రభుత్వాన్ని గుప్పెట్లో పెట్టుకున్న జియా ఆ తర్వాత భుట్టోపై అవినీతి కేసులు మోపి ఏకంగా ఉరిశిక్ష విధించి చంపించేశాడు. కొన్నేళ్ల తర్వాత జియా విమాన ప్రమాదంలో మరణించాడు. జుల్ఫికర్ భుట్టో తనయు బేనజీర్ భుట్టో తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లో రాణించి రెండు సార్లు ప్రధాని అయ్యారు. ఆమెనూ చాలా సార్లు అరెస్ట్ చేశారు. 2007 లో రావల్పిండిలో ఓ సభలో పాల్గొనడానికి వెళ్తోన్న బేనజీర్ భుట్టోని ఆత్మాహుతి దళాలు పొట్టన పెట్టుకున్నాయి. పాకిస్థాన్ కు మూడు సార్లు ప్రధానిగా వ్యవహరించిన నవాజ్ షరీష్ పాకిస్థాన్ లోనే అత్యంత సంపన్నుడైన రాజకీయనేతగా చరిత్ర సృష్టించారు.1999లో మిలటరీ నవాజ్ ను బలవంతంగా గద్దె దింపింది. పదేళ్ల పాటు విదేశాల్లో కాలక్షేపం చేసిన నవాజ్ 2013లో మూడో సారి ప్రధాని అయ్యారు.అయితే ఆయనపై అవినీతి కేసులో కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఆరోగ్య కారణాలతో బెయిల్ పై లండన్ వెళ్లిన నవాజ్ షరీఫ్ ఇప్పటికీ పాక్ తిరిగి రాలేదు. ఇక ప్రస్తుత ప్రధాని షెహబాజ్ అయితే ప్రధాని కాకముందే జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చారు. ఇలా ప్రధానులతో ఆడుకోవడం పాక్ ఆర్మీకి కొత్త కాదు. పాక్ లో ఏ ప్రధాని అయినా సరే ఎంత కాలం కుర్చీలో ఉంటాడో తెలీదు. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలీదు. ఆర్మీకి కోపం వచ్చినా తనకి కోపం వచ్చినా ఉద్యోగం కోల్పోక తప్పని దుస్థితి. ఇటువంటి అనిశ్చిత పరిస్థితుల కారణంగానే పాకిస్థాన్ అన్ని విధాలుగానూ పతనం చెందుతోంది. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ ను పాకిస్థాన్ సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించింది. అరెస్ట్ చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది. తక్షణమే ఇమ్రాన్ ను విడుదల చేయాలని ఆదేశించింది. సర్వోన్నత న్యాయస్థానం జోక్యంతో అటు ఆర్మీ ఇటు ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. ఇమ్రాన్ ను వెంటనే విడుదల చేశారు. తనకు న్యాయం చేసిన సుప్రీం కోర్టుకు ఇమ్రాన్ ఖాన్ కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.