కొన్నాళ్లు 5G సర్వీసులు ఫ్రీ ?

By KTV Telugu On 6 October, 2022
image

దేశవ్యాప్తంగా పలు నగరాల్లో రిలయర్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ సంస్థలు 5జీ సర్వీసులను ప్రారంభించాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కత, వారణాసిలోని పరిమిత కస్టమర్లకు జియో ట్రూ, ఢిల్లీ, ముంబై, వారణాసి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, నాగ్‌పూర్, సిలిగురిలోని కొన్ని ప్రాంతాల్లో భారతి ఎయిర్‌టెల్ 5జీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చాయి. 5జీ హ్యాండ్ సెట్లు లేదా 5జీ ఎనేబుల్డ్ హ్యాండ్ సెట్లు ఉన్న కస్టమర్లు చిన్న సెట్టింగ్ మార్చుకోవడం ద్వారా ఈ సర్వీసులు పొందవచ్చు. 5జీ హ్యాండ్ సెట్లలో ప్రస్తుతం దాదాపు 600 మెగాబిట్ పర్ సెకెండ్ వేగంతో సేవలు అందుతున్నాయి. ఈ మొబైల్ సెట్ల ద్వారా ప్రొఫెషనల్ కంప్యూటర్లు కూడా వాడుకునే వీలుంది. జియో, ఎయిర్‌టెల్ కస్టమర్లు తమ 4జీ సిమ్‌ను మార్చుకోకుండానే 5జీ సర్వీసులు వాడుకోవచ్చు. జియో కస్టమర్లు 5జీ సర్వీసులను ‘బీటా ట్రయల్’ ద్వారా వాడుకోవచ్చు. సదరు సిటీలో పూర్తి స్థాయి నెట్‌వర్క్ వచ్చే వరకు ఈ బీటా ట్రయల్ అందుబాటులో ఉంటుంది. 4జీ ధరకే 5జీ సర్వీసులు పూర్తి ఉచితంగా వాడుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
5gలో 1 జీబీపీఎస్ స్పీడ్ వస్తుందని గతంలో హామీ ఇచ్చారు. అయితే మొబైల్ స్టేషన్స్‌కు దగ్గరగా ఉండేవారికి మాత్రమే ఈ వేగం వస్తుందని.. సగటున 600 ఎంబీపీఎస్ వేగం మాత్రం కచ్చితంగా అందుబాటులో ఉంటుందని జీయో తెలిపింది.
జియో, ఎయిర్‌టెల్ ప్రస్తుతం 5జీ సర్వీసులను ఫ్రీగానే అందిస్తున్నాయి. అయితే ఒక సర్కిల్‌లో పూర్తి స్థాయిలో 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చిన తరువాతే 5జీకి ప్రత్యేక ధరలు అమల్లోకి వస్తాయని చెబుతున్నారు. రాబోయే ఒకటిన్నర ఏడాదిలో మొబైల్ కస్టమర్ల డేటా వినియోగం ఇప్పటి కంటే రెండింతలు అవుతుందని ఒక అంచనా. చాలా దేశాల్లో 5జీ సర్వీసులకు ప్రత్యేక టారిఫ్‌లు వసూలు చేయడం లేదని, అయితే ఇండియాలో ఇప్పుడు ఫ్రీగానే 5జీ సర్వీసు ఇచ్చినా.. రాబోయే రోజుల్లో మాత్రం తప్పకుండా చార్జీలు వసూలు చేస్తారు. 2023 డిసెంబర్ నాటికి జియో తమ 5జీ నెట్‌వర్క్‌ను దేశమంతటా విస్తరించనున్నది. ఇక ఎయిర్‌టెల్ 2024 మార్చినాటికి 5జీ నెట్‌వర్క్ పూర్తి చేస్తామని చెప్పింది. 2027 కల్లా దేశంలో సగం మంది 5జీ వినియోగదారులు ఉంటారని మొబైల్ కంపెనీలు అంచనా వేస్తున్నాయి.