కొంత గ్యాప్ తర్వాత హైదరాబాద్ లో మళ్లీ ఉగ్ర కార్యకలాపాల గుట్టు రట్టయ్యింది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆదేశాలకు అనుగుణంగా హిందువులను ముందుగా ఇస్లాంలోకి కన్వర్ట్ చేసి ఆ తర్వాత బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాదులుగా మారుస్తోన్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మతం మార్చిన వారికి హైదరాబాద్ లోనే ఆయుధాల వినియోగంలోనూ శిక్షణ ఇస్తున్నట్లు తేలింది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తే మరికొంత మంది ఉగ్రులు దొరికే అవకాశం ఉంది.
కేంద్ర నిఘా విభాగాలు అందించిన సమాచారంతో మధ్య ప్రదేశ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు బ్రేక్ చేసిన ఓ డెడ్లీ ఆపరేషన్ భోపాల్-హైదరాబాద్ నగరాల్లో కల్లోలం సృష్టించింది.
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ హిజ్బ్ ఉత్తహరీర్ భారత దేశంలో డెడ్లీ ఆపరేషన్ చేసుకుపోతోందన్నది ఆ సమాచారం. 2022లో చెన్నయ్ లో జియావుద్దీన్ బఖ్వీని పోలీసులు అరెస్ట్ చేసినపుడు ఈ ఉగ్ర వాద సంస్థ భారత్ లో వేళ్లూనుకోవడం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టిందని తెలిసింది. బఖ్వీ ఇంటరాగేషన్ లో సేకరించిన సమాచారంతోనే మధ్య ప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు ఏక కాలంలో ఎంపీ రాజధాని భోపాల్ తో పాటు హైదరాబాద్ లో మెరుపు దాడులు నిర్వహించారు. భోపాల్ లో 11 మందిని హైదరాబాద్ లో ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరితో పాటు టచ్ లో ఇంకెంతమంది ఉన్నారా అన్నది దర్యాప్తులో తేల్చనున్నారు.
హైదరాబాద్ లో అరెస్ట్ అయిన వారిలో ఓ మెడికల్ కాలేజీలో హెచ్.వో.డీ.గా పనిచేస్తోన్న మహ్మద్ సలీమ్, ఓ ప్రైవేటు కంపెనీలో క్లౌడ్ ఇంజనీర్ గా పనిచేస్తోన్న అబ్దుల్ రెహ్మాన్, పాతబస్తీలో డెంటిస్ట్ గా ఉన్న షేక్ జునైద్ తో పాటు రోజువారీ కూలీలు మహ్మద్ అబ్బాస్, హమీద్, మహ్మద్ సల్మాన్ లు ఉన్నారు. వీరి నుండి మొబైల్ ఫోన్స్ ఆయుధాలతో పాటు జిహాదీ సాహిత్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. భోపాల్ లోని ఓ జిమ్ సెంటర్ లో ట్రెయినర్ గా పనిచేస్తోన్న యాసిర్ కు నిషేధిత హిజ్బ్ ఉత్తహరీర్ సంస్థతో సంబంధాలు ఉన్నాయి. ఉగ్ర సంస్థ ఆదేశాల మేరకు విధ్వంసాలకు తెగబడేందుకు సిద్ధమైన యాసిర్ అది తన ఒక్కడి వల్ల కాదు కాబట్టి ఓ టీమ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ క్రమంలో హిందువులను ముందుగా ఇస్లాం మతంలోకి మార్చారు. ఆ తర్వాత వారికి బ్రెయిన్ వాష్ చేసి ఇస్లాం కోసం ఏం చేయడానికైనా సిద్ధం అయ్యేలా తయారు చేశారు. ఇస్లాం రాజ్యస్థాపన ఆలోచనలు వారి మెదళ్లలోకి జొప్పించారు.ఆ తర్వాత వారికి ఆయుధాలు ఇచ్చి వాటి వినియోగంలో శిక్షణ కూడా ఇచ్చారు. భవిష్యత్ లో దేశంలో పలు కూడళ్లలో భారీ పేలుళ్లు విధ్వంసాలకు తెగబడేలా వీరిని తీర్చిదిద్దడమే యాసిర్ లక్ష్యం. అయితే ఈ లోపే అంతర్జాతీయ భద్రతా సంస్థల నుండి కేంద్ర నిఘా విభాగాలకు హిజ్బ్ ఉత్తహరీర్ విధ్వంస కుట్రల గురించి ఉప్పందింది. ఆ వెంటనే కేంద్ర నిఘా సంస్థలు అప్రమత్తమై వివిధ రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేశారు. భోపాల్-హైదరాబాద్ లో ఆపరేషన్ కు సిద్ధమవుతోన్న సమయంలోనే పోలీసులు వారి కుట్రను భగ్నం చేశారు. లేదటే పలు విధ్వంసాలు చోటు చేసుకునేవే. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న వారిలో మహమ్మద్ సలీం అసలు పేరు సౌరబ్ రాజ్. సౌరబ్ రాజ్ తాను ఇస్లాంలోకి మారిన తర్వాత తన భార్య మాన్సీ అగర్వాల్ ను కూడా ఇస్లాంలోకి మార్చాడు. మాన్సీ కాస్తా రహీల సలీంగా మారింది. అబ్దుల్ రెహ్మాన్ అసలు పేరు దేవీ ప్రసాద్ పండా. మహమ్మద్ అబ్బాస్ అలీ అసలు పేరు బస్కా వేణుగోపాల్. ముందుగా వీరు హిందువులు. యాసిర్ టచ్ లోకి వెళ్లాక వీరంతా ఇస్లాంలోకి మారిపోయారు. ఉగ్ర ఆపరేషన్లకూ రెడీ అయిపోయారు. ఈ ముఠా తరచుగా టోలీ చౌక్ లో రహస్య సమావేశాలు నిర్వహించుకునేవారు. స్థానికులకు అనుమానాలు వస్తున్నాయని గమనించిన ముఠా తమ సమావేశాల వేదికను మరోచోటకు మార్చారు. వికారాబాద్ అటవీ ప్రాంతంలోని అనంతగిరికి మార్చారని అక్కడే ఆయుధ వినియోగంపై శిక్షణ ఇచ్చారని అంటున్నారు. కెమికల్, బయోలాజికల్, బాక్టీరియల్ దాడుల్లో వీరికి శిక్షణ ఇస్తారు. ఈ మిలటరీ ట్రెయినింగ్ సంబంధించి భోపాల్ నుండే ఆన్ లైన్ లో శిక్షణ ఇస్తారు. యువతను ఇస్లాం వైపు ఆకర్షితులను చేసి వారిని ఇస్లాం రాడికల్స్ గా మార్చడమే ఈ ఉగ్రవాద ఆపరేషన్ లక్ష్యం. హిజ్బ్ ఉత్తహరీర్ ఉగ్రవాద సంస్థ 1952లో జెరూసలేంలో పుట్టింది. లండన్ కేంద్రంగా ఇది కార్యకలాపాలు నిర్వహిస్తోంది. యూరప్, సెంట్రల్ ఆసియా, దక్షిణ ఆసియా, సౌత్ ఈస్ట్ ఆసియా ప్రత్యేకించి ఇండోనేషియాలలో ఈ ఉగ్రవాద సంస్థకు బ్రాంచీలు ఉన్నాయి.దక్షిణ ఆసియాలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో ఇది పాతుకు పోయింది.
2010లో పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ఢిల్లీలోని బాట్లా హౌస్ వద్ద హిజ్బ్ ఉత్తహరీర్ పేరుతోనే ఆందోళనలు నిర్వహించారు. అదే భారత దేశంలో హిజ్బ్ ఉత్తహరీర్ పేరుతో చేపట్టిన చివరి కార్యక్రమం. చాలా కాలం తర్వాత ఇపుడు భోపాల్-హైదరాబాద్ లలో దాని జాడలు వెలుగులోకి వచ్చాయి. అది కూడా అత్యంత భయంకర ఆపరేషన్లకు సిద్దమవుతోన్న వేళ పోలీసులు వారిని పట్టుకోగలిగారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని లోతుగా విచారిస్తే వీరితో సంబంధాలు ఉన్న మరికొందరి పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశాలుంటాయి. ఐసిస్ ఉగ్రవాద సంస్థ కన్నా కూడా దీన్ని ప్రమాదకర ఉగ్రసంస్థగా అంతర్జాతీయ సంస్థలు అభివర్ణిస్తున్నాయి. ఏ మాత్రం ఉదాసీనంగా ఉన్నా పెను విధ్వంసాలు, మారణహోమాలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఉగ్రమూలాల జాడ కొత్తది కాదు. గతంలో ఎన్.ఐ.ఏ. జరిపిన మెరుపు దాడుల్లో ఐసిస్ ఉగ్రవాద శిబిరాల్లో చేరిన వారి మూలాలు హైదరాబాద్ లో ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాదు నల్లగొండ జిల్లాలోనూ ఉగ్ర వాదులు తలదాచుకుని విధ్వంసాలకు తెగబడ్డ ఘటనలు చూశాం. అటు ఆంధ్రప్రదేశ్ లోనూ చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉగ్రవాదుల స్థావరాన్ని వారి ఆయుధాలనూ పోలీసులు కనుగొన్న సంగతి తెలిసిందే. 2018లోనూ 2019లోనూ హైదరాబాద్ లో ఉగ్రమూలాలను పోలీసులు రట్టు చేశారు. ఇదొక నిరంతర ప్రక్రియే అని ఇపుడు తాజా అరెస్టులతో స్పష్టమైంది. భోపాల్-హైదరాబాద్ లో 17 మందిని అరెస్ట్ చేశారు సరే. ఈ ముఠా విధ్వంస కుట్రను భగ్నం చేశారు బానే ఉంది. కానీ వీళ్లు ఇంకా ఇలాంటి వారిని ఎంతమందిని తమ ఉగ్ర సంస్థలో చేర్చుకున్నారన్నది చాలా కీలకం. దాన్ని బ్రేక్ చేస్తేనే ఉగ్రరాక్షసుల ఆటకు అడ్డుకట్ట వేసినట్లవుతుంది. భారత దేశానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. అదే విధంగా చాలా దేశాలతో సరిహద్దులు పంచుకుంటోంది. ఎటు నుంచి అయినా ఉగ్రవాదులు చొరబడే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అంచేత సరిహద్దు భద్రత విషయంలో ఒళ్లంతా కళ్లు చేసుకుని అప్రమత్తంగా ఉండాల్సిందే అంటున్నారు నిపుణులు. హైదరాబాద్ లో దశాబ్ధాల క్రితం అప్పుడప్పుడు మత కల్లోలాలు జరిగేవి. అపుడు కర్ఫ్యూలు విధించాల్సిన పరిస్థితులు ఉండేవి. అయితే ఆ పరిస్థితి పోయి కూడా దశాబ్దాలు దాటేసింది. మతాల మధ్య సామరస్యం వెల్లివిరుస్తోంది. దీన్ని డిస్టర్బ్ చేయడానికే ఉగ్రవాదుల దృష్టి హైదరాబాద్ పై పడి ఉంటుందని నిపుణులు అంటున్నారు.
ఉగ్ర వాదానికి చెక్ చెప్పడానికి పోలీసులు అనుక్షణం శ్రమిస్తున్నారు. అయితే ఆ బాధ్యత కేవలం పోలీసులదే కాదు. సమాజంలోని ప్రతీ ఒక్కరూ ఈ విషయంలో సివిల్ పోలీస్ లా వ్యవహరించాలి. ఉగ్ర జాడ అలికిడి వినపడితే చాలు పోలీసులకు ఉప్పందించాలి. అనుమానస్పదంగా ఎవరైనా తిరుగుతున్నా అనుమానస్పద కార్యకలాపాలు ఎక్కడ కనిపించినా పోలీసులకు సమాచారం అందించాలి. అప్పుడే ఉగ్రవాదానికి చరమగీతం పాడగలం. ఉగ్రవాదానికి మానవత్వాలు దయా దాక్షిణ్యాలు మచ్చుకు కూడా తెలీవు. కాలానికి కత్తుల వంతెన కట్టి చరిత్రపై నెత్తుటి సంతకం చేయడమొక్కటే ఉగ్రవాదం లక్ష్యం. దాన్ని ప్రపంచం నుంచి తరిమికొడితేనే శాంతి సౌభాగ్యాలు వెల్లివిరిసేది.