కర్ణాటక ఫలితాలు ఎలా ఉంటాయో కానీ ముందుగానే జనతా దళ్ సెక్యూలర్ నేత కుమారస్వామి చేతులెత్తేశారు. కర్ణాటక ఎన్నికల్లో పోలింగ్ ముగిసీ ముగియక ముందే జేడీఎస్ నేత కుమారస్వామి ఓ నిరాశజనకమైన ప్రకటన చేశారు. అదేమిటంటే తమకు డబ్బులు లేకపోవడం వల్ల కనీసం పాతిక సీట్లలో గెలవలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఎన్నికల్లో డబ్బుల ప్రస్తావన కుమారస్వామి ఎందుకు తెచ్చారో చాలా మందికి అర్థం కాలేదు కానీ అసలు విషయం మాత్రం కేసీఆర్ కు సందేశం పంపడమేనని ఎన్నికలకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పి చేయకపోవడమేనని కర్ణాటకలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ నుంచి వచ్చే ఆర్థిక సాయంతో ఎన్నికలు దున్నేస్తానని కుమారస్వామి ఆశలు పెట్టుకున్నారు. అయితే రాను రాను కేసీఆర్ సైలెంట్ అయిపోవడంతో తీవ్రంగా నిరాశ చెందారని చెబుతున్నారు.
భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు కేసీఆర్ ఇతర పార్టీలను దగ్గరకు తీసుకున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కలిసి పని చేద్దామని ఆర్థిక సాయం చేస్తామని ఆశ పెట్టడంతో కుమారస్వామి కేసీఆర్ ఎన్ని సార్లు పిలిచినా హైదరాబాద్ వచ్చారు. ఆయన కుమారుడ్ని కూడా తీసుకు వచ్చారు. కేసీఆర్ కూడా ఫస్ట్ టార్గెట్ కర్ణాటక అని ప్రకటించారు. కుమారస్వామిని సీఎం చేసుకుందామని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న రాయచూర్, గుల్భర్గా, బీదర్, గంగావతి, కొప్పోల్‌తో సహా తెలుగు మాట్లాడే ఓటర్లు అధికంగా ఉన్న జిల్లాలు, నియోజకవర్గాల్లో జరిపే ఎన్నికల బహిరంగ సభల్లో కుమారస్వామితో కలిసి వేదిక పంచుకోవాలని, ముఖ్యంగా బెంగళూరు మహానగరంలో నిర్వహించే ప్రచార కార్యక్రమాలు రోడ్ షోలలో భాగస్వామ్యం కావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారన్న ప్రచారం జరిగింది. అయితే అసలు కర్ణాటక ఎన్నికల గురించే ఎలాంటి ఆలోచన చేయలేదు.
కేసీఆర్ భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. జేడీఎస్ దన్నుతో అడుగుపెడితే ఖాతా తెరవవచ్చని అనుకున్నారు. అయితే తమ పార్టీకి అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని పట్టుబట్టడంతో కుమారస్వామి అంగీకరించలేదని చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు ఇస్తామని ప్రతిపాదించారని కానీ అసెంబ్లీలో సీట్లకావాల్సిదేనని కేసీఆర్ పట్టుబట్టడంతో కుమారస్వామి సమాధానమివ్వలేదని అంటున్నారు. అయితే పొత్తులు లేకపోయినా కేసీఆర్ తనకు పెద్దన్న లాంటి వారేనని కుమారస్వామి తరచూ చెబుతూ వస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం పట్టించుకోలేదు. ఆర్థిక సాయం పంపలేదని చెబుతున్నారు. చివరి క్షణంలో అయినా సాయం వస్తుందేమోనని కుమారస్వామి ఎంతో ఆశగా ఎదురు చూశారని కానీ ప్రయోజనం లేకపోయే సరికి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. కేసీఆర్ విపక్ష పార్టీలన్నింటికీ తన నాయకత్వం అంగీకరిస్తేనే ఆర్థిక సాయం చేస్తాననే ప్రతిపాదన పెట్టారని చెప్పుకున్నారు. అయితే ఆయన నాయకత్వాన్ని కుమారస్వామి కూడా అంగీకరించలేదు. మరో వైపు కేసీఆర్ నిర్మించిన ఆర్థిక సామ్రాజ్యంపై కేంద్రం కన్నేసిందని దర్యాప్తు సంస్థలన్నీ నిఘా పెట్టాయని ఈ కారణంగానే జేడీఎస్ కు నిధులు సర్దుబాటు చేయలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. కారణం ఏదైనా అసలు కేసీఆర్ కర్ణాటక వైపు కన్నెత్తి చూడలేదు. ఆక్కడ ఫలితాల్ని మార్చేందుకు ఆర్థిక పరమైన సాయాలూ చేయలేదంటున్నారు. దీంతో కుమారస్వామి బలైపోయారు.
బీజేపీతో యుద్ధం కోసం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పేరునే బీఆర్ఎస్‌గా మార్చేశారు. తెలంగాణ పథకాలు దేశం మొత్తం దున్నేస్తాయని గట్టిగా నమ్మారు. ఎన్ని వందల కోట్లు ఖర్చు చేశారో అంచనా వేయనంత ఎక్కువగా జాతీయ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. జాతీయ పార్టీగా దేశం మొత్తం పోటీ చేసినా ఖర్చు పెట్టగలిగినంత ఆర్థిక వనరులు సమకూర్చుకున్నారు. ఇక యుద్ధమే అనుకునే విషయంలో పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఢిల్లీలో పార్టీ ఆఫీసును ప్రారంభించినట్లుగా కూడా ఎవరికీ తెలియనంత కామ్ గా నిర్వహించారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల వారు ఎవరూా వచ్చి ప్రగతి భవన్ లో కలవడంలేదు. ఏ రాష్ట్రంలోనూ నాయకుల్ని పిలిచి కండువా కప్పాలని అనుకోవడం లేదు. కేవలం ఒక్క మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల వారిని మాత్రం పిలిపించుకుని కండువాలు కప్పుతున్నారు. ఏపీ, ఒడిషా ఇంచార్జులను నియమించారు. గాలికి వదిలేశారు. ఇదంతా బీజేపీని మరింత రెచ్చగొట్టకుండా ఉండటానికేనన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. కర్ణాటకలో జేడీఎస్‌కు ఆర్థిక సాయం చేస్తే ఎక్కువగా బీజేపీ నష్టపోతుంది. తీవ్రమైన పోటీ జరిగినందున చాలా తక్కువ శాతం ఓటింగ్ తేడాతో గెలుపోటములు నిర్ధారణ అవుతాయని అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో జేడీఎస్ ఓట్లు చీలిస్తే నష్టపోతామని జోక్యం చేసుకోకపోతే మంచిదని బీజేపీ నుంచి సంకేతాలు రావడంతోనే వెనక్కి తగ్గారన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
కారణం ఏదైనా కేసీఆర్ నమ్మి వచ్చిన కుమారస్వామిని నిండా ముంచారన్న అభిప్రాయం మాత్రం కర్ణాటకలో ఎక్కువగా వినిపిస్తోంది. ఆర్థిక సమస్యల కారణంగానే తాము ఎక్కువ సీట్ట్లు గెలవలేకపోతున్నామని చెప్పడం ద్వారా కుమారస్వామి కూడా అదే అభిప్రాయాన్ని ప్రజల్లోకి పంపారు. ఇది కేసీఆర్ విశ్వసనీయతను కాస్త దెబ్బతీసేదే. ఇక ముందు కేసీఆర్ ఆర్థిక సాయం గురించి ఎవరైనా నమ్మకం పెట్టుకోలేని అనుభవం కుమారస్వామి ద్వారా ఇతర పార్టీల నేతలకు తెలిసిందని అంటున్నారు.