*పాన్ ఇండియా రైట‌ర్‌కి ఏల ఈ కంపు?

By KTV Telugu On 6 October, 2022
image

– బాహుబ‌లి విజ‌యేంద్రా.. ఎందుక‌య్యా ఇదంతా!

క‌లం కూడా ఊస‌ర‌వెల్లిలా రంగులు మారుస్తోంది. ఈ కాల‌పు రాజ‌కీయానికి భావోద్వేగ ప్ర‌సంగాల‌తో క‌డుపు నిండ‌టం లేదు. ఇంకేదో కావాలి. ఇంకా కావాలి. అందుకే ర‌చ‌యిత‌లు రాజ‌కీయం చేతిలో కొత్త ఆయుధాలు అవుతున్నారు. తెర‌పై బొమ్మాట ఆడిస్తున్నారు. టాలీవుడ్ జ‌క్క‌న్న జ‌న‌కుడు చేయి తిరిగిన ర‌చ‌యిత‌. ఆయ‌న చేతిలో క‌లం ఎలా కావాలంటే అలా తిరుగుతుంది. త‌న‌కు వ‌చ్చిన‌ట్లే కాదు ఎదుటివారికి న‌చ్చిన‌ట్లు. మోడీ-అమిత్‌షా ద్వ‌యం కూడా మెచ్చిన‌ట్లు.

ఇస్లాం విస్త‌ర‌ణ‌లో కశ్మీరీ బ్రాహ్మ‌ణుల పాత్రపై పాత థియరీని మార్చేశారు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తండ్రి ది గ్రేట్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్‌. పూర్తిపేరు కోడూరి విశ్వ‌విజ‌యేంద్ర ప్ర‌సాద్‌. పుట్టింది గోదావ‌రి క‌మ్మ‌కుటుంబంలో. అయినా ఆయ‌న చ‌డీచ‌ప్పుడు లేకుండా రాజ్య‌స‌భ‌కు నామినేట్ అయ్యారంటే ఆయ‌న పెన్నుగ‌న్నుకంటే ప‌వ‌ర్‌ఫుల్ అని కేంద్రంలోని పెద్ద‌లు న‌మ్మ‌బ‌ట్టే. స్వాతంత్య్రానంత‌రం దేశ‌విభ‌జ‌న జ‌రిగాక దాయాది దేశాలు ఉప్పునిప్పులా మారిపోయాయి. కానీ రెండుదేశాల ప్ర‌జ‌ల మ‌ధ్య మాత్రం శతృభావం లేద‌ని, మ‌తాల‌కంటే ముందు మ‌నం మ‌నుషుల‌మ‌ని చాటింది విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ‌స‌మ‌కూర్చిన బ‌జ‌రంగీ భాయిజాన్‌.

భ‌విష్య‌త్తులో టీఆర్ఎస్‌-ఎంఐఎం టార్గెట్‌గా నిజాం ఫైల్స్ తెర‌మీదికి రావ‌చ్చ‌నే ప్ర‌చారం బ‌లంగా ఉంది. క‌థ‌కుడు బీజేపీ స్టోరీ రైట‌ర్ విజ‌యేంద్ర‌ప్ర‌సాదేన‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌న్లేదు. క‌శ్మీర్‌ఫైల్స్‌తో వెండితెర సాక్షిగా క‌న్యాకుమారిదాకా భావోద్వేగాలు రేకెత్తించిన బీజేపీకి ఇలాంటి ర‌చ‌యిత‌ల అవ‌స‌రం భ‌విష్య‌త్తులో ఎంతో ఉంది. అందుకే ఆయ‌న్ని ఏరికోరి పెద్ద‌ల‌స‌భ‌కు పంపింది. అయితే రాజ్యసభ ఎంపీ అయ్యాక కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల‌తో తెలుగు బ్రాహ్మ‌ణుల ఆగ్ర‌హానికి గుర‌య్యారు ది గ్రేట‌ర్ పాన్ ఇండియా రైట‌ర్‌.

వందల‌ ఏళ్ల క్రిత‌మే ఆవు మాంసం, ముస్లింలతో బంధంతో కశ్మీరీ బ్రాహ్మణులు ప‌రోక్షంగా ఇస్లాం వ్యాప్తికి తోడ్ప‌డ్డార‌నేది విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఎత్తిచూపిన పాయింట్‌. వాస్త‌వానికి ఆయ‌న కొత్త విష‌య‌మేం చెప్ప‌లేదు. పాత ప్రచారాన్నే త‌న గొంతుతో మ‌రోసారి పున‌రుద్ఘాటించ‌రంతే. బ్రాహ్మణులు ఆది దేవుడు శివుడిని పూజిస్తూ మేక, గొర్రె మాంసం తినే కశ్మీరంలో ఇస్లాం వ్యాప్తికి ప్రత్యక్షంగా తోడ్పడ్డారనే అప‌వాదు ఇప్ప‌టిది కాదు. అయితే లెజండ‌రీ రైట‌ర్ త‌న కామెంట్స్‌తో పాత కృష్ణా– గుంటూరు, గోదావరి జిల్లాల బ్రాహ్మ‌ణుల‌ ఆగ్ర‌హానికి గుర‌య్యారు. కోపం ప‌ట్ట‌లేక ఆయ‌న‌కు బ‌తికుండ‌గానే కొన్నిచోట్ల ఆయ‌న‌కు పిండాలు కూడా పెట్టేస్తున్నార‌ట‌!

సంప్ర‌దాయాలు, మ‌త విశ్వాసాలు అత్యంత సున్నిత‌మైన అంశాలు. ఓ డైలాగ్‌లో తేడావ‌స్తేనే, ఓ కేర‌క్ట‌ర్ ఆహార్యం న‌చ్చ‌క‌పోతేనే జ‌నం రోడ్ల‌మీదికి వ‌చ్చేస్తున్నారు. మ‌తం మంట‌ల్లో చ‌లికాచుకునేవారు ఇంకాస్త ఆజ్యంపోస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో విజయేంద్రప్రసాద్ ఊబిలాంటి కశ్మీరీ బ్రాహ్మణుల పాత వివాదంలోకి తెలిసి తెలిసీ అడుగేశారు. బ‌య‌ట‌ప‌డ‌లేక‌పోతున్నారు. అస‌లే ఏపీలో క‌మ్మ సామాజిక‌వ‌ర్గం త‌న పాత ప్రాభ‌వాన్ని కోల్పోతోంది. కొంద‌రికి ల‌క్ష్యంగా మారుతోంది. ఈ స‌మ‌యంలో త్రిపురనేని రామస్వామి చౌదరిలాంటివారి బాటలో కాకుండా నా దారి ర‌హ‌దారి అంటూ వివాదాస్పద వ్యాఖ్య‌ల‌తో విజ‌య‌యేంద్ర‌ప్ర‌సాద్ కొత్త చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు. అడుసు తొక్క‌నేల..కాలుక‌డ‌గ‌నేల విజ‌యేంద్రా!