కర్ణాటక నుంచి తెలంగాణ కాంగ్రెస్‌కు సక్సెస్ సీక్రెట్స్ ఎన్నో

By KTV Telugu On 13 May, 2023
image

 

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సాధారణ మెజార్టీ ఖాయం. భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పటికే తమ మీద ఉన్న విమర్శలు మరింత పెరగకుండా తెర వెనుక రాజకీయాలు చేయదనే ఎక్కువ మంది అనుకుంటున్నారు. ఎందుకంటే ముందు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ప్రజలు చూస్తూనే ఉంటారు. అందుకే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమైపోయినట్లే. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో బీజేపీకి ఎంతో అడ్వాంటేజ్ అనే అభిప్రాయం ముందు నుంచీ ఉంది. అది నిజమే అందులో డౌట్ లేదు. ఇప్పుడు కర్ణాటక నుంచి అన్ని విధాలుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సాయం అందుతుంది. అయితే ఆ సాయాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అందుకునే స్థితిలో ఉన్నారా అంటే ఆలోచించాల్సిన విషయమే. ముందు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎలా గెలిచిందో కాంగ్రెస్ పార్టీ నేతలు స్టడీ చేస్తే చాలా వరకూ వారికి తమ విన్నింగ్ మంత్ర పై ఓ క్లారిటీ వస్తుంది.

రాజకీయ పార్టీల్లో అంతర్గత కలహాలు సహజం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అయితే ఇంకా ఎక్కువ. మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పుకుని ఇతర పార్టీలపై పోరాడటం మానేసి తమలో తాము పొట్లాడేసుకుంటూ ఉంటారు. కర్ణాటకలోన గ్రూపు గొడవలు ఉన్నాయి. మరి ఎలా విజయం సాధించింది అంటే అంటే అసలు కాన్సెప్ట్ ఉంది. కాంగ్రెస్‌లో సీఎం పదవికి ప్రధాన పోటీ దారులైన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోటీ పడ్డారు కానీ పార్టీకి నష్టం కలిగేలా ఎక్కడా ప్రవర్తించలేదు. ఎన్నికల తర్వాత సీఎం సీటు కోసం పోట్లాడుకోవాలంటే ముందు పార్టీ గెలవాలన్న లక్ష్యం వారికి కనిపించింది. దాన్ని మర్చిపోలేదు ఇరువుకూ కష్టపడ్డారు. విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తమ వర్గం ఎమ్మెల్యేలు ఓడిపోవాలని కుట్రలు చేసుకోలేదు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోలేదు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో విజయం సాధించింది. ఇప్పుడు సీఎం పదవి కోసం పోరాడుకుంటారు. అయితే ఆ పదవి కాంగ్రెస్ లోని వారికే దక్కుతుంది. ఇదే అసలైన నిజం.

తెలంగాణ కాంగ్రెస్ లో కూడా కర్ణాటక తరహాలో చాలా మంది నేతలు ఉన్నారు. టీ పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి తో ప్రారంభించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, జానారెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే తామే సీఎం రేసులో ఉన్నామని చెప్పుకునేవారికి లెక్కే లేదు. అంతే కాదు వీరిలో చాలా మంది ఒకరిపై ఒకరు పొట్లాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఇప్పుడూ సొంత పార్టీలో రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి. అయితే సీఎం పదవి ఎవరికి అనేది పక్కన పెట్టి ముందుగా పార్టీ కోసం పని చేయాలన్న ఆలోచన టీ కాంగ్రెస్ నేతలు చేయలేదు. మునుగోడు ఉపఎన్నికల్లో సొంత పార్టీ నేతలే హ్యాండిచ్చారు. ఎప్పట్నుంచో కాంగ్రెస్ లో ఉన్న మేము రేవంత్ రెడ్డిని సీఎం చేయడం ఏమిటని పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎక్కువ మంది అభిప్రాయం అదే. అసలు ముందు కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే సీఎ పదవి అనే మాట తెరపైకి వస్తుంది. అలాంటిది రాకపోయినా పర్వాలేదు తమకు కాకపోతే ఇంకెవరికీ సీఎం సీటు దక్కకూడదనే భావన ఎక్కువ మందికి ఉంది. కర్ణాటక ఫలితాన్ని చూసి అక్కడి నేతల మైండ్ సెట్ ను అబ్జర్వ్ చేసిన తర్వాత తెలంగాణ నేతలు ముందుగా తమ మైండ్ సెట్ ను మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే కాంగ్రెస్ రేసులోకి వస్తుంది.

అంతర్గత కలహాల విషయంలో నేతలు రోడ్డున పడలేదు. తమ మధ్య ఏం ఉన్నా అంతర్గతంగానే చూసుకున్నారు. అది ఆ పార్టీపై కర్ణాటక ప్రజల్లో నమ్మకం పెరగడానికి కారణం అయింది. సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు ఎక్కువ అని సీఎం అభ్యర్థులు ఎవరో తెలియదన్న ఓ అపోహ ఉండేది. దాన్ని ప్రజల్లో పటాపంచలు చేయడానికి సిద్దరామయ్య, డీకే శివకుమార్ ప్రయత్నించారు. ఎవరు సీఎం అయినా కాంగ్రెస్ పార్టీ పాలనే ఉంటుందని చేతల్లో చూపించారు. అలాంటి పరిస్థితి తెలంగాణ నేతలూ తేవాల్సి ఉంటుంది. అంతర్గత వివాదాలు ఏమైనా పార్టీలోనే చూసుకోవాలి. ముందు కాంగ్రెస్ గెలవాలన్న కసిని తెచ్చుకోవాలి. కాంగ్రెస్ విజయంలో మరో కీలక విషయం ఏమిటంటే తమ వర్గం వారే ఎమ్మెల్యేలుగా గెలవాలని వారు అనుకోలేదు. కుట్రలు చేసుకోలేదు. అందరూ తమ పార్టీ అభ్యర్థులేనన్నట్లుగా పోరాడారు. అందరి విజయం కోసం ప్రయత్నించారు. ఆర్థిక వనరులు సమకూర్చుకునే విషయంలోనూ వారెవరూ ఒకరకి తక్కువ మరొకరికి ఎక్కునే భావనకు పోలేదు. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు కర్ణాటక విజయం ఓ బూస్ట్ ఇస్తుంది. ఇది ప్రజల్లో సెంటిమెంట్ పెంచుతుంది అందులో సందేహం లేదు. దాన్ని అందుకుని తాము కూడా విజయం దగ్గరకు వెళ్లాలంటే కర్ణాటక కాంగ్రెస్ నేతల ఫార్ములాను పాటించాల్సి ఉంటుంది. లేకపోతే ఎంత చేసినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.