వైట్ గోల్డ్ ఫీల్డ్స్ – ఈ గనులు భారత్ దశ మార్చేస్తాయా

By KTV Telugu On 13 May, 2023
image

మనకు అసలు బంగారం తెలుసు. అలాగే పత్తిని తెల్ల బంగారం అంటాం. ఇతర పంటల్ని వాటి రంగులతో పోల్చి గోల్డ్ గా పిలుచుకుంటాం. కానీ నిజంగా గోల్డ్ లాంటి వైట్ గోల్డ్ ఇప్పుడు ఇండియాలో ఎక్కడపడితే అక్కడ బయటపడుతున్నాయి. వైట్ గోల్డ్ గా ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది లిథియం. గోల్డ్ మైన్స్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం కానీ వాటిని వెలికి తీయడం ఎంత కష్టమో చెప్పడం అసాధ్యం. భారత్ లో ఇలాంటి గోల్డ్ మైన్స్ లేవు కానీ భవిష్యత్ బంగారం లాంటి లిథియం మైన్స్ మాత్రం ఎక్కడ చూసినా బయట పడుతున్నాయి. మొన్న కశ్మీర్ లో నిన్న రాజస్థాన్‌లో రేపు కర్ణాటకలో ఆ తర్వాత దేశంలో ఎక్కడ బయటపడతాయో చెప్పడం కష్టం కానీ ఇప్పటికైతే బయటపడిన లిథియం నిల్వలు తవ్వకుండా దేశం కరువు తీరిపోతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

రాజస్థాన్‌లో భారీ లిథియం నిక్షేపాలను జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా కనుగొన్నది. మొత్తం దేశ అవసరాల్లో 80 శాతం వరకు ఈ ఒక్క ప్రాంతంలో లభించే లిథియం తీరుస్తుందని అంచనా వేస్తున్నారు. వీటిని వెలికితీస్తే చైనా గుత్తాధిపత్యానికి తెరపడుతుందని మన దేశం చైనాపై ఆధారపడే అవసరం ఉండదు. ఈ నిక్షేపాలతో రాజస్థాన్‌ ఆర్ధిక పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ప్రస్తుతం బొలివియాలో ప్రపంచంలోనే అత్యధికంగా 21 మిలియన్‌ టన్నుల లిథియం నిక్షేపాలు ఉన్నాయి. దీనితో పాటు అర్జెంటినా, చిలీ, అమెరికా దేశాల్లో ఈనిక్షేపాలు ఉన్నాయి. చైనాలో 5.1 మిలియన్‌ టన్నుల నిక్షేపాలు ఉన్నాయి. ప్రస్తుతం చైనానే ప్రపంచ మార్కెట్‌లో గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం మన దేశ అవసరాల్లో 53.76 శాతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మొత్తం ఆరు వేల కోట్ల విలువైన లిథియంను మన దేశం కొనుగోలు చేస్తుంటే అందులో 3 వేల కోట్ల విలువైన దాన్ని చైనా నుంచి కొనుగోలు చేస్తున్నాం. జమ్మూ కశ్మీర్ లోని రేసి జిల్లా సలాల్-హైమానా ప్రాంతాల్లో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలను ఇటీవల జియోలాజికల్ సర్వే అధికారులు కనుగొన్నారు. రాజస్థాన్‌లో వెలుగు చూసినవి అంత కంటే ఎక్కువ.

అత్యంత తేలికగా ఉండే లిథియం ప్రస్తుతం బ్యాటరీల్లో ఉపయోగిస్తున్నారు. రానున్న కాలంలో ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదున లిథియంకు భారీ డిమాండ్‌ ఉంది. అందుకే దీన్ని ప్రస్తుతం వైట్‌ గోల్డ్‌గా పిలుస్తున్నారు. ప్రస్తుత గ్లోబల్‌ మార్కెట్‌లో టన్ను లిథియం రేటు 60 లక్షలుగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు శిలాజ ఇంథనాలను తగ్గించుకుని బ్యాటరీ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. దీని వల్ల రానున్న కాలంలో లిథియంకు డిమాండ్‌ మరింత పెరగనుంది ప్రపంచ బ్యాంక్‌ అంచనా ప్రకారం 2050 నాటికి లిథియం డిమాండ్‌ 500 శాతం పెరగనుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే రాజస్థాన్‌లోబయటన పడిన నిక్షేపాలను వెంటనే వెలికి తీస్తే మన దేశానికి ఎంతో ఉపయోపగడుతుందని ఆర్ధికంగా కూడా దేశం వృద్ధికి దోహదపడుతుంది. ప్రస్తుతం ఒక్క శాతంగా ఉన్న ఎలెక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని 2030 నాటికి 30 శాతానికి పెంచాలని ఇండియా లక్ష్యంగా పెట్ట్టుకుంది. 2070 నాటికి జీరో ఉద్గారాలను చేరుకోవాలన్నదే ప్రధాన ఉద్దేశం. ఎలెక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల్లో వినియోగించే లిథియం కోసం విదేశాలపై ఆధారపడడాన్ని తగ్గించుకుని మనమే స్వయం సమృద్ధిని సాధించుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుతం మన దేశం లిథియం బ్యాటరీలకోసం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతున్నది. ఇది కాకుండా సిరామిక్స్, గ్లాస్, లూబ్రికేటింగ్ గ్రీజు, పాలిమర్ల ఉత్పత్తిలో కూడా దీనిని వాడతారు. 2030 నాటికి లిథియం డిమాండ్ 3 మిలియన్ టన్నుల వరకు ఉంటుందని అంచనా.

2021 సంవత్సరంలో కర్ణాటకలో ఇలాంటి లిథియం నిక్షేపాలను కనుగొన్నారు. అయితే అది పరిమాణంలో చిన్నదే. కరోనా తర్వాత భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగానూ లిథియంకు డిమాండ్ పెరిగింది. మరోవైపు వాతావరణ మార్పుల వేగాన్ని తగ్గించడానికి చాలా దేశాలు గ్రీన్ ఎనర్జీని స్వీకరించే దిశగా కదులుతున్నాయి. ఇందులో కూడా లిథియం పాత్ర చాలా ముఖ్యమైనది. లిథియం వెలికితీత ఉత్పత్తికి ఎంత సమయం పడుతుందనేది చెప్పడం కష్టం. భారత ప్రభుత్వం జీ3 అధ్యయనం నివేదికను మాకు సమర్పించింది. జీ2 ముందస్తు అధ్యయనాలు, జీ1 అధ్యయనం ఇంకా జరగాల్సి ఉంది. లిథియం మైనింగ్ ప్రక్రియ పర్యావరణానికి అనుకూలమైనది కాదని నిపుణులు భావిస్తున్నారు. లిథియం ఉప్పగా ఉండే రిజర్వాయర్లు భూమి లోపల గట్టి రాళ్ల నుంచి సేకరిస్తారు. లిథియం తవ్విన తర్వాత మైనింగ్ కోసం మినరల్ ఆయిల్ ఉపయోగిస్తారు. దీని కారణంగా ఆ ప్రదేశాన్ని పొడి బారుస్తుంది నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఇది కాకుండా గని నుంచి వెలికితీసే ప్రక్రియలో భాగంగా నీటిని ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తారు. ఇది వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తుంది. ఇటువంటి మైనింగ్ కార్యకలాపాల వల్ల సహజ వనరులు క్షీణిస్తాయని భవిష్యత్తులో నీటి ఎద్దడి ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

లిథియం ఇప్పుడు గోల్డ్ తో సమానంగా మారింది. అందుకే ప్రపంచ దేశాలు లిథియం రిజర్వులు ఉన్న దేశాలతో స్నేహం పెంచుకుంటన్నాయి. ఇటీవలె చైనా ఖనిజ నిక్షేపాల కోసం బొలీవియాతో ఒక బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ గనుల్లో 21 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నాయని అంచనా. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిథియం రిజర్వ్ అని భావిస్తారు. వాతావరణ మార్పుల్లో వేగాన్ని తగ్గించే లక్ష్యాన్ని చేరుకోవడానికి 2050 నాటికి లిథియం వంటి ఖనిజాల మైనింగ్‌ను 500 శాతం పెంచాల్సిన అవసరం ఉంటుందని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. అందుకే భారత్ లో బయటపడిన లిథియం నిక్షేపాలను సమర్థంగా వెలికి తీసుకుంటే భారత దేశానికి అంతులేని సంపద సమకూరినట్లవుతుంది. అయితే మన దేశంలో ఉండే ప్రధాన సమస్య ఏమిటంటే రాజకీయ నాయకుల దోపిడీ. వీటిపై కన్నేయకుండా ఉంటారా.