భారతీయ జనతా పార్టీ మత రాజకీయాలతో ఉత్తరాదిన పాతుకుపోయింది. అ మతానికి దేశభక్తిని జోడించి సోషల్ మీడియా ఊపుతో అందరి బుర్రల్ని ఖరాబు చేసింది. ఓటు బ్యాంక్ పెంచకుంది. అయితే ఆ పప్పులు దక్షిణాదిన ఉడకడం లేదు. మోదీ కర్ణాటకలో స్వయంగా అద్వానీ రథయాత్ర తరహాలో భజరంగ భళీ అంటూ తిరిగారు. కానీ కర్ణాటక ప్రజలు తిప్పి కొట్టారు. ఇక ముందు కర్ణాటకలోనే కాదు దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో బలపడటం సాధ్యమేనా అంటే చాలా కష్టం దాదాపు అసాధ్యం అనే మాటలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ దక్షిణాదిన పాతుకుపోవడానికి అన్ని విధాలుగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసింది. ఇక బీజేపీ దగ్గర దక్షిణాదిపై దండెత్తడానికి అస్త్రాలే లేవు. కొత్త ఆయుధం రెడీ చేసుకోవాలి. అదేమిటన్నది బీజేపీ పెద్దలే క్లారిటీ లేదు.
ప్రజలు తనకు ఇవ్వని అధికారాన్ని బీజేపీ కర్ణాటకలో గుంజుకుంది. అధికారం చేపట్టిన తర్వాత మతం ప్రాతిపదిక విభజన తెచ్చి కర్ణాటకలో పాతుకుపోదామని ప్రయత్నించింది. హిజాబ్ వివాదం తెచ్చారు హలాల్ అన్నారు. ఇంకా రకరకాల టాక్టిక్స్ ప్లే చేశారు. చివరికి క్లైమాక్స్‌లో బజరంగ్ దళ్ అంశాన్ని ఎత్తుకున్నారు. కానీ ఫలితాలు చెప్పిందేమిటంటే మత రాజకీయాలు చేస్తే పడిపోవడానికి తమది ఉత్తరాది కాదు దక్షిణాది అనే మత విద్వేషాలను రెచ్చగొట్టి మైనారిటీలకు మెజారిటీ ప్రజలకు మధ్య చిచ్చు పెట్టే శక్తులపై గాని సంస్థలపై చర్యలు తీసుకోవాలని మెజార్టీ ప్రజలు కోరుకుంటారు. ఎందుకంటే ప్రజలు ప్రశాంతమైన జీవనాన్నే కోరుకుంటారు. హిజాబ్ వివాదం, ముస్లిం రిజర్వేషన్ల రద్దు వంటి మత సంబంధిత అంశాలను ఎన్నికల అస్త్రాలుగా చేసుకుని విభజన తెచ్చి ఓటు బ్యాంకును పటిష్టం చేసుకోవలనుకుంటున్నారు. దేవుళ్లను రాజకీయాలకు వాడుకోవడంపై మెజార్టీ హిందువులు సంతృప్తి చెందరు. ముఖ్యంగా దక్షిణాది ప్రజలకు ఇష్టం ఉండదు. దక్షిణాది ప్రజల్లో మత సామరస్యం ఎక్కువ. ఎవరి నమ్మకాలు వాళ్లవి. అందరూ అందర్నీ గౌరవిస్తారు. చిచ్చు పెట్టాలనుకుంటే సాధ్యం కాలేదు. పెట్టాలని బీజేపీ చేసిన ప్రయత్నాలూ ఫలించలేదు.
కేరళలో అడుగుపెట్టేందుకు గతంలో బీజేపీ అయ్యప్ప స్వామినే వివాదంలోకి తెచ్చింది. అయ్యప్ప స్వామి ఆలయంలోకి వయసుతో నిమిత్తం లేకుండా మహిళలందరినీ అనుమతించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత బీజేపీ ఎంత రాజకీయం చేయాలో అంతా చేసింది. ఈ తీర్పు పేరుతో కేరళ అంతా నిరసన ప్రదర్శనలు జరిగాయి. కేరళలోని అన్ని ప్రాంతాల్లోజరిగిన ఈ నిరసన ప్రదర్శనల్లో ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించబోమని హిందూ సంఘాలు ప్రకటించాయి. సుప్రీంకోర్టు కన్నా భక్తుల సెంటిమెంటే తమకు ముఖ్యమని బీజేపీ తెగేసి చెప్పి రాజకీయం చేసింది. దీంతో హిందువుల ఓట్లు పోలరైజ్ అవుతాయని ఈ పరిణామం తమకు ప్లస్‌పాయింట్ అవుతుందని బీజేపీ లీడర్లు లెక్కలు వేసుకున్నారు. కేరళ జనాభాలో హిందువులు 52 శాతం మంది ఉన్నారు. ముస్లింలు 26 శాతం మంది క్రిస్టియన్లు 18 శాతం మంది ఉన్నారు. మిగతా నాలుగు శాతంమంది వివిధ వర్గాల ప్రజలు. హిందువుల్లో 16 శాతంమంది పెద్ద కులమైన నాయర్లే ఉన్నారు. పెద్ద వర్గాన్ని ఆకట్టుకోవాలని సినిమా నటులు ఇతరుల్ని బీజేపీలో చేర్చుకున్నా కానీ ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి మత రాజకీయాలకు పడిపోయేంత దిగువ స్థాయిలో కేరళ ప్రజలు లేరని తేల్చారు.
తమిళనాడులో బీజేపీ పరిస్థితి ప్రచార ఆర్భాటాలకే పరిమితమవుతోంది. అక్కడ రాజకీయ సమరం అంతా డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే ఉంటుంది. జయలలిత కు సరైన రాజకీయ వారసులు లేకపోవడంతో అన్నాడీఎంకే తోకపట్టుకుని బీజేపీ ఆడిస్తోంది. ఆ స్థానాన్ని పొందడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అన్నాడీఎంకేకు నిర్వీర్యం చేయడానికి కేంద్ర స్థాయిలో ప్రయ్తనాలు చేస్తున్నారు. ఏఐఏడీఎంకే సంక్లిష్ట దశలో ఉందని వచ్చే ఎన్నికల నాటికి అందర్నీ తమ పార్టీలో చేర్చుకుని బీజేపీలో వీలీనం చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారని చెబుతున్నారు. ఇందు కోసం శశికళను ప్రయోగిస్తున్నారు. ప్రస్తతం అక్కడ బీజేపీ మత రాజకీయాలను చేసి బలపడేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇప్పుడు పార్టీని మింగేయడానికిప్రయత్నిస్తోంది. బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడిగా మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలైని నియమించారు. కర్ణాటక క్యాడర్ ఐపీఎస్‌కు చెందిన ఆయన 2018–19 వరకు పోలీసు అధికారిగా పలు హోదాల్లో పనిచేశారు. అనంతరం బీజేపీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడిగా నియమితులై గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అరవకురుచ్చి నుంచి పోటీచేసి డీఎంకే అభ్యర్థి ఇళంగో చేతిలో 24 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన ఎల్.మురుగన్ కేంద్ర మంత్రి పదవి చేపట్టడంతో ఆయన స్థానంలో అన్నామలైని నియమించారు. ఆయన బీజేపీ మార్క్ రాజకీయాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. కానీ తమిళనాడు ప్రజలు మాత్రం ఇలాంటి రాజకీయాల్ని ఎలా భరిస్తామన్న ప్రశ్నలు వినిపిస్తున్నారు. తమిళనాడు నిజానికి మొదటి నుంచి హిందీ వ్యతిరేక భావన ఉన్న ప్రాంతం. తమిళనాడులో ఉన్న ఆర్థిక సామాజిక పరిస్థితులు బీజేపీని అడుగు పెట్టనీయవు.
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి అధికారం దుర్లభం అనే పరిస్థితి వచ్చింది. తెలంగాణలో మీడియా హైప్‌తో ఎంతో కొంత బలపడదామని అధికారంలోకి వచ్చేస్తామని అనుకున్నారు. కానీ అలాంటి చాన్స్ లేదని కర్ణాటక ఫలితాలు తేల్చేశాయి. తెలంగాణ బీజేపీకి పోటీ చేయడానికి నేతలే లేరు. కర్ణాటక ఫలితాల తర్వాత చేరేందుకు ఆసక్తి చూపిన వారు కూడా ఆగిపోతారు. ముందు ముందు బీజేపీ పరిస్థితి మరింత దుర్భరం అవుతుంది. ఇక ఏపీలో ఆ పార్టీ ఉనికి లేదు. అక్కడి రెండు ప్రాంతీయ పార్టీల నాయకులు వ్యూహాత్మకంగా బీజేపీకే మద్దతు అంటూ ఆ పార్టీ ఏపీలో పాతుకోకుండా చేస్తున్నారు. ఆ రెండు పార్టీలు బలంగా ఉన్నంత కాలం బీజేపీ ఎదగదు. కేంద్రంలో ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎలాగైనా పార్టీల్ని మింగి అయినా బలపడదామనుకుంటున్న ప్రయత్నాలు దక్షిణాదిన సాధ్యం కావడం లేదు.
బీజేపీకి ఉత్తరాది పార్టీ అనే ముద్ర ఉంది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటానికి కారణం ఉత్తరాది లో వచ్చే సీట్లే. 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. అయితే ఈ ఘన విజయం మొత్తం హిందీ రాష్ట్రాల్లోనే వచ్చింది. దక్షిణాదిలో కేవలం కర్ణాటకలో మాత్రమే కాస్త ఫలితం చూపించగలిగింది. మోడీ హవా కారణంగా 2019లో ఎన్నికల్లో హిందీ రాష్ట్రాల్లో ఉన్న లోక్ సభ సీట్లలో 95 శాతం గెలుచుకున్నారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, ఢిల్లీ, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో దాదాపుగా మొత్తం సీట్లు గెలుచుకుంది. వచ్చే ఎన్నికల్లో ఇది సాధ్యంకాదు. దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో బీజేపీ దాదాపుగా జీరో. ఇప్పుడు కర్ణాటకలో కూడా పోయింది. అందుకే బీజేపీ పెట్టుకున్న మిషన్ వర్కవుట్ అయ్యే అవకాశాలు లేవు. ఉత్తరాది పార్టీగా మిగిలిపోవడం ఒక్కటే తదుపరి మిగిలింది.