చీఫ్ సెక్రటరీలు చీఫ్ అడ్వయిజర్లు అవ్వాల్సిందేనా.. సీఎంలను బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారా

By KTV Telugu On 15 May, 2023
image

తెలంగాణ రాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ చీఫ్ అడ్వయిజర్ అయ్యారు. పట్టుబట్టి ఆయన ఈ పదవి సాధించారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏపీ క్యాడర్‌కు పంపితే అక్కడ జాయిన్ అయ్యారు కానీ చీఫ్ సెక్రటరీగా చాన్సిచ్చినా చేసే ఉద్దేశం ఆయనకు లేదు. వెంటనే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అధికారికంగా ఆమోదముద్ర పడిన కొద్ది రోజులకే తెలంగాణ కొత్త సెక్రటేరియట్‌లో కేసీఆర్ కొలువుదీరే అత్యంత విలాసవంతమన ఆరో అంతస్తులో ఆయనకో చాంబర్ రెడీ అయిపోయింది. అక్కడే బాధ్యతలు కూడా తీసుకున్నారు. ఆరో అంతస్తులో సీఎంతో పాటు చీఫ్ సెక్రటరీ ఉంటారు. మరో ఇద్దరు మాజీ సీఎస్‌లు సలహాదారులుగా ఉంటారు. వారే రాజీవ్ శర్మ, సోమేష్ కుమార్. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరు చూస్తే సీఎస్‌గా పని చేసిన వారందరికీ ఏదో ఓ పదవి ఇవ్వాల్సిందేనన్నట్లుగా ఉంటున్నారు. అలాగే డీజీపీలుగా పని చేసిన వారికి కూడా. సీఎంలు కావాలని ఇస్తున్నారా లేకపోతే ఆ అధికారులు బ్లాక్ మెయిలింగ్‌కు దిగుతున్నారా అ్నది ఇక్కడ మొదటగా అందరికీ వస్తున్న సందేహం.

ముఖ్యమంత్రి రాజ్యాంగపరంగా సీఎం. ఆయన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు చట్టపరంగా రాజ్యాంగపరంగా ఉండే అమలు చేయాల్సిన బాధ్యత సీఎస్ పై ఉంటుంది. అంటే నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. అలా నడుచుకుంటే ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డపేరు రాదు. ఓ రకంగా సీఎం నిర్ణయం తీసుకుకున్నా అమలు చేయాల్సింది సీఎస్ మాత్రమే. అందుకే ఆ పోస్టుకు ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఇటీవలి కాలంలో ప్రభుత్వ అధికారుల తీరు అనేక విమర్శలకు కారణం అవుతోంది. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సీఎం ఆయన కుటుంబం లేదా వ్యాపార సన్నిహితులకు మేలు చేసేలా వ్యవహరిస్తున్నారని సీఎం కేసీఆర్ ప్రాపకం కోసమే ఇదంతా చేస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి. తెలంగాణ సీఎస్ గా రాజీవ్ శర్మ ఉన్నప్పుడు అనేక వివాదాస్పద అంశాలపై నిర్ణయాలు జరిగాయి. తర్వాత ఆయనకు చీఫ్ అడ్వయిజర్ పోస్టు వచ్చింది. సోమేష్ కుమార్ తీరు అయితే మరీ వివాదాస్పదం. ధరణి దగ్గర్నుంచి ఆయన తీసుకున్న ప్రతీ భారీ నిర్ణయం వెనకు స్కెచ్ ఉందని స్కాం ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కారణం ఏదైనా ఆయన కేంద్రం ఆగ్రహానికి గురై పదవి కోల్పోక తప్పలేదు. అయితే కేసీఆర్ ఆయనను దగ్గరే పెట్టుకున్నారు. ఎందుకు ఇంత ఇంత ప్రాధాన్యత ఇస్తున్నరన్నది తర్వాత చెప్పుకుందాం. తర్వాత రిటైల్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి కూడా కేబినెట్ హోదాతో ఓ పదవి ప్రకటించబోతున్నారని ఇప్పటికే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో చీఫ్ సెక్రటరీగా పని చేసిన నీలం సాహ్ని పదవి కాలాన్ని వీలైననన్ని సార్లు పొడిగించిన సీఎం జగన్ రిటైరవగానే అత్యంత కీలకమైన ఎపీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పోస్ట్ ఇచ్చారు. ఇది రాజ్యాంగబద్దమైనది. అలాగే డీజీపీ రిటైరవ్వక ముందే బలవంతంగా రిటైర్ చేయించి మరీ గౌతం సవాంగ్‌కు ఎపీపీఎస్సీ బోర్డు చైర్మన్ పదవి ఇచ్చారు. అంతకు ముందు చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని అత్యంత అవమానకరంగా బయటకు పంపేశారు. నిజానికి ఎన్నికల ఫలితాలు రాక ముందే జగన్ ఆదేశాలు అమలు చేసిన చరిత్ర ఆయనకు ఉంది. అందుకే ఎన్నికల సంఘం సీఎస్ గా నియమించినప్పటికీ తర్వాత ఆయననే జగన్ కొనసాగించారు. కానీ మధ్యలో సలహాలు ఇచ్చే ప్రయత్నం చేశారని బయటకు పంపేశారు. తెర వెనుక ఏం జరిగిందో తెలియదు కానీ చెప్పినట్లుగా చేసి ఉంటే మాత్రం ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా ఇప్పుడు అడ్వయిజర్‌గా ఉండేవారనడంలో సందేహం లేదు.

అయితే సీఎంలు రిటైరైన సీఎస్, డీజీపీలను ఎందుకు సలహాదారులుగా పెట్టుకుంటున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వారుసీఎంలను బ్లాకమెయిల్ చేసి పదవులు పొందుతున్నరాని విశ్లేషిస్తున్నారు. నిజానికి ఇది కొట్టి పారేయదగ్గ విషయం కాదు. సీఎస్‌లు, డీజీపీలుగా ఉన్న వారు ముఖ్యమంత్రుల రాజకీయ ప్రయోజనాలు కాపాడటానికి నిబంధనలు ఉల్లంఘిస్తారు. ఆ కిటుకులు స్కాంలు అన్నీ వారికి తెలుసు. ఇప్పుడు కనుక వారిని బయటకు వదిలేస్తే అంతకు మించిన డ్యామేజ్ చేస్తారన్న భయం ముఖ్యమంత్రుల్లో ఉందని చెప్పుకోవచ్చని అంటున్నారు. గత పదేళ్ల కాలంలో చీఫ్ సెక్రటరీలు, డీజీపీలుగా పని చేసిన వారి ట్రాక్ రికార్డు చూస్తే వారిపై వచ్చే ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వంలో నిగూఢంగా జరిగే వ్యవహారాలు మొత్తం వారికి తెలిసే జరుగుతాయి. ఉదాహరణకు తెలంగాణలో భూముల వ్యవహారాల్లో ప్రతీ గజానికి సంబంధించిన అంశం సోమేష్ కు తెలుసు. ఆయనను కేసీఆర్ ఎలా పక్కన పడేయగలరు.

ఐదేళ్ల పదవికాలంలో చంద్రబాబు కూడా సీఎస్‌లుగా పని చేసిన వారికి పదవుల ఇచ్చారు. కానీ వారి నుంచి ఆయనకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. కొత్త రాష్ట్రం తొలి సీఎస్ గా నియమితులైన ఐవైఆర్ కృష్ణారావుకు చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన రిటైరైన తర్వాత ఆయన కోరిక మేరకు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏడాదికి రూ. వెయ్యి కోట్లు కేటాయించారు. కేటాయింపే కాదు విడుదల చేశారు కూడా. ఆ నిధులతో ఐవైఆర్ చేయాలనుకున్నది చేశారు. కానీ ఆయన మరింకేదో పదవి ఆశించే సరికి చంద్రబాబు పట్టించుకోలేదు. దాంతో ఆయనకు వ్యతిరేకమయి తాను సీఎస్ గా ఉండగా తీసుకున్న అమరావతి రాజదాని అంశాన్ని వైసీపీ వ్యూహాలకు అనుగుమంగా కులపరం చేశారు. దాని వల్ల టీడీపీకి జరిగిన డ్యామేజ్ అంతా ఇంత కాదు. ఆయనే కాదు మరో సీఎం గా పని చేసిన అజయ్ కల్లం అలియాస్ కల్లం అజయరెడ్డికి రిటైరైన తర్వాత ఎలాంటి పదవులు ఇవ్వకపోవడం కనీసం పొడిగింపు కూడా ఇవ్వకపోవడంతో ఆయన వైసీపీ కోసం లేనిపోని ప్రచారాలు చేశారు. విద్యుత్ ఒప్పందాల మీద ఇతర విషయాల మీద అజయకల్లాం చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో చీఫ్ అడ్వయిజర్ గా చేరారు. లక్షల జీతం తీసుకుంటున్నారు. తాను టీడీపీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణనలు నాలుగేళ్లలో నిరూపించలేకపోయారు. కానీ ఆయనకు మాత్రం లబ్ది కలిగింది.

ఇలా సీనియర్ బ్యూరోక్రాట్లు రాజకీయ నేతల్ని బెదిరించి రిటైరైన తర్వాత కూడా పెద్ద ఎత్తున లక్షల జీతాలతో పదవులు పొందుతున్నారన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. ఈ లెక్క ప్రకారం చూస్తే రాజకీయ నేతలను వీరు ఓ ఆట ఆడుకుంటున్నారని అనుకోవచ్చు. ఇది మన ప్రజాస్వామ్యంలో కొత్త కోణం. ఇంకెన్ని మార్పులు వస్తాయో.