కన్నడ క్షేత్రంలో బీజేపీ వ్యూహాలు వర్కవుట్ కాలేదు. లింగాయత్ లు దూరం కావడం, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబికడంతో పార్టీకి చాణక్య-చంద్రగుప్తల్లాంటి షా-మోదీల ప్రచారం కూడా అద్భుతాలు చేయలేకపోయింది. మోదీ ప్రచారం పుణ్యమా అని బెంగళూరులో కాస్త సత్తా చాటిన బిజెపిని ఆంజనేయ స్వామి కూడా కాపాడలేకపోయాడు. జై బజరంగ్ బలి నినాదం గాలికి కొట్టుకుపోయింది. మొత్తానికి సార్వత్రిక ఎన్నికలకు ఏడాది దూరంలో ఉన్న తరుణంలో బిజెపికి ఇది షాకింగ్ డిఫీట్ అని చెప్పక తప్పదు. భారతీయ జనతా పార్టీ వ్యూహాలు కానీ ప్రణాళికలు కానీ ఎత్తుగడలు కానీ ఒక్కటి కూడా వర్కవుట్ కాలేదు కర్నాటకలో. ఎన్నికల్లో చాలా పకడ్బందీగా వ్యూహరచన చేసి పక్కాగా అమలు చేసే కమలనాధులు ఎందుకనో కానీ కర్నాటకలో ఘోరంగా విఫలమయ్యారు ఏదీ కలిసి రాలేదు. బొమ్మయ్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతే ప్రధానంగా పార్టీని ముంచింది. ఎన్నికల్లో బొమ్మయ్ పాలనలోని అవినీతినే కాంగ్రెస్ పార్టీ ప్రధానాస్త్రంగా మలుచుకుంది. దాన్ని తిప్పికొట్టడం మాట దేవుడెరుగు కనీసం వివరణ ఇచ్చుకోవడంలోనూ బిజెపి నాయకత్వం సరియైన ప్రణాళికలు రూపొందించుకోలేదు. ఉన్న వ్యతిరేకత చాలదన్నట్లు లేనిపోని వివాదాలు రాజేసుకోవడం ద్వారా చేజేతులారా వివిధ వర్గాలను దూరం చేసుకుంది బిజెపి. హిజాబ్ వివాదాన్ని అనవసరంగా పెద్దది చేసింది బిజెపియే. దాంతో పాటు మైనారిటీ ముస్లింల రిజర్వేషన్లు తొలగిస్తామన్న నినాదంతో ముస్లింలు పూర్తిగా బిజెపికి దూరం అయ్యారు. ఈ రిజర్వేషన్లను లింగాయత్, వొక్కళిగలకు పంచుతామన్న హామీని ఆ సామాజిక వర్గాలు నమ్మలేదు.
మొదట్నుంచీ బిజెపికి అండగా ఉంటూ వచ్చిన లింగాయత్ సామాజిక వర్గం మనోభావాలను బిజెపి దెబ్బతీసింది. లింగాయత్ ల ప్రియతమ నాయకుడు అయిన యడ్యూరప్పను దూరం పెట్టడం ద్వారా లింగాయత్ లను దూరం పెట్టుకున్నట్లు అయ్యింది. యడ్యూరప్పను దూరం పెట్టినా బిజెపి గెలిస్తే లింగాయత్ నేతనే ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇవ్వాల్సిందిగా లింగాయత్ లు బిజెపి అగ్రనేతలను ఓ భేటీలో డిమాండ్ చేశారు. అయితే నాయకత్వం స్పష్టమైన హామీ ఇవ్వలేదు. పైగా బిజెపి అగ్రనేత సంతోష్, ప్రహ్లాద్ జోషీలు కలిసి లింగాయత్ ల స్థానంలో బ్రాహ్మణులను ముఖ్యమంత్రి చేయడానికి పావులు కదుపుతున్నారని ప్రచారం జరగడంతో లింగాయత్ లు మండిపడ్డారు. బిజెపి వైఖరిపై కోపంతో లింగాయత్ లు అమాంతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఇది కాంగ్రెస్ కూడా ఊహించింది కాదు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో బజరంగ్ దళ్ ను నిషేధిస్తామన్న హామీని ఎండగడుతూ జై బజరంగ్ బలీ నినాదాన్ని తెరపైకి తెచ్చింది బిజెపి. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీయే నాడు రాముణ్ని అడ్డుకున్నారు ఇపుడు హనుమంతుడి భక్తులను అడ్డుకుంటున్నారు అంటూ ఆంజనేయ స్వామిని రాజకీయాల్లోకి తీసుకు వచ్చి హిందూ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేశారు. ప్రతీ సభలోనూ జై బజరంగ బలీ అంటూ నినాదాలు చేశారు. బిజెపికి చెప్పుకోడానికి ఇక ఏ అంశమూ లేకనే బజరంగ బలి నినాదం అంది పుచ్చుకున్నారని ప్రజలు భావించారు. బొమ్మయ్ పై వచ్చిన ఫార్టీ పెర్సంట్ కమిషన్ సిఎం ఆరోపణను కూడా బిజెపి తిప్పికొట్టలేకపోయింది. మౌనం అర్ధాంగీకారం అన్నట్లు కాంగ్రెస్ ఆరోపణలను బిజెపి ఖండించకపోవడాన్ని బిజెపి నాయకత్వం ఆ ఆరోపణలను అంగీకరించినట్లుగా ఓటర్లు భావించారు. చాలా రాష్ట్రాల్లో మోదీ-షాల కాంబినేషన్ అద్భుతాలు సాధించింది. కానీ కర్నాటకలో అది ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఒక్క బెంగళూర్ నగరంలో మాత్రం మోదీ విస్తృత ప్రచారం కాస్త వర్కవుట్ అయ్యింది. రాష్ట్రంలోని మిగతా అన్ని ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ ప్రభంజనం వీచింది. మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్, సావది వంటి సీనియర్లు పార్టీకి గుడ్ బై చెప్పినా వారిని బుజ్జగించి రాజీనామాలు చేయకుండా నిలువరించడంలో నాయకత్వం విఫలమైంది.
కర్ణాటక స్థానిక బిజెపి నాయకత్వం బలంగా లేదు. పూర్తిగా నరేంద్ర మోదీ కరిష్మా పైనే కన్నడ బిజెపి ఆధార పడింది. ఇక బొమ్మయ్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్న ఆరోపణలూ ఉన్నాయి. బెంగళూరు నగరంలో సరియైన రోడ్లు కూడా లేవు. వర్షం వస్తే చాలు గుంతల రోడ్లతో జనం నరకయాతన పడుతున్నారు. ఆ పరిస్థితిని చక్కదిద్దడంలోనూ బొమ్మయ్ ప్రభుత్వం విఫలమైంది. ఎంత సేపు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడాని మాత్రమే మోదీ ప్రసంగాలు పరిమితం అయ్యాయి. మళ్ళీ అధికారం ఇస్తే ప్రజలకు ఏం చేస్తామన్నది బిజెపి చెప్పుకోలేకపోయింది. తమంతట తాము పూర్తి మెజారిటీ సాధించలేకపోయినా అతి పెద్ద పార్టీగా అవతరిస్తామని, ఆ తర్వాత జేడీఎస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని బిజెపి భావించింది. అయితే పాత మైసూరు లో జేడీఎస్ ఓటు బ్యాంకుకు కాంగ్రెస్ గండి కొట్టడంతో ఇటు బిజెపితో పాటు అటు జేడీఎస్ కు కూడా కోలుకోలేని షాక్ తప్పలేదు. మొత్తానికి అన్నీ కలిసి బిజెపిని నిండా ముంచాయి.