కింగ్ మేకరేం ఖర్మ మనమే కింగ్ అని పాట పాడుకున్న జేడీఎస్ నేత కుమార స్వామి పాట చెల్లుబాటు కాలేదు. పాత మైసూరులో మనల్ని కొట్టే మొనగాడు ఇంత వరకు పుట్టనే లేదని ఆయన పెట్టుకున్న ధీమాను కాంగ్రెస్ తన్ని తరిమేసింది. కాంగ్రెస్-బిజెపిలలో ఎవరికీ మెజారిటీ రాకుండా చూడమని ముక్కోటి దేవతలను మొక్కుకున్నారు కుమార స్వామి. హంగ్ వస్తే కోటి కొబ్బరికాయలు కొడతానని కూడా మొక్కి ఉండచ్చు కానీ దేవుళ్లు వినలేదు హంగ్ రాలేదు.
పిట్ట పోరు పిల్లి తీర్చినట్లు ఎన్నికల్లో కాంగ్రెస్-బిజెపిల్లో ఎవరికీ పూర్తి స్థాయి మెజారిటీ రాకపోతే మరోసారి చక్రం తిప్పేది తానే అని కుమారస్వామి ఎన్నికల ముందు అనుకున్నారు. కాంగ్రెస్-బిజెపిలు మ్యాజిక్ ఫిగర్ ను అందుకునే పరిస్థితులు ఉండవని కూడా కుమారస్వామి అంచనాలు వేసుకున్నారు. బిజెపి పట్ల ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ పూర్తిగా తనకు అనుకూలంగా మలుచుకోలేదని కుమార స్వామి అనుకున్నారు. పాత మైసూర్ ప్రజలు జేడీఎస్ కే పట్టం కడతారని నమ్మారు. 30కి పైగా స్థానాలు సంపాదిస్తే కింగ్ మేకరేం ఖర్మ మనమే కింగ్ అయిపోవచ్చునని కలలుగన్నారు. తనను ముఖ్యమంత్రిని చేయడం మినహా కాంగ్రెస్ బిజెపిలకు మరో ప్రత్యామ్నాయమే ఉండదని లెక్కలు వేసుకున్నారు. కానీ ఏదీ అనుకున్నట్లు జరగలేదు. చివరకు తమ సంప్రదాయ ఓటు బ్యాంకు అయిన వొక్కళిగలు కూడా గంప గుత్తగా జేడీఎస్ కు ఓటు వేయలేదని తేలిపోయింది.
ఎప్పుడూ పాత మైసూర్ లోనే జేడీఎస్ కు కావల్సిన స్థానాలు వచ్చేసేవి. ఈ సారి 20 లోపు స్థానాలకు పడిపోయింది జేడీఎస్. పాత మైసూర్ ప్రజలు గత ఎన్నికల్లో జేడీఎస్ కు 29 స్థానాలు కట్టబెట్టారు. మిగతా రాష్ట్రమంతా కలిసి మరో ఎనిమిది స్థానాలు దక్కించుకన్న జేడీఎస్ 37 స్థానాలతో నిలిచింది. కాంగ్రెస్-బిజెపిలకు మెజారిటీ లేకపోవడంతో కుమార స్వామిని ముఖ్యమంత్రి యోగం పట్టింది. అయితే ఏడాది తిరిగే సరికి హార్స్ ట్రేడింగ్ తో బిజెపి అధికారంలోకి వచ్చింది. బహుశా దీన్ని చూసే కావచ్చు ఈ సారి ప్రజలు జేడీఎస్ ను గెలిపించడం కన్నా కాంగ్రెస్ ను గెలిపిస్తేనే బెటరనుకుని ఉంటారు. కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ వస్తే సుస్థిర పాలనకు అవకాశాలుంటాయని భావించి ఉంటారు. వాటికి తోడు తమ సామాజికవర్గ నాయకుడైన డి.కె.శివకుమార్ ముఖ్యమంత్రి అయినా తమ ప్రయోజనాలె నెరవేరుతాయి కదా అన్న అంచనాకు వచ్చి ఉంటారు. అందుకే ఈ ఎన్నికల్లో జేడీఎస్ కు జెల్ల కొట్టి కాంగ్రెస్ కు జై కొట్టారు. పాత మైసూర్ లో మెజారిటీ స్థానాలు దక్కించుకోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధ్యమైంది. అదే జేడీఎస్ కొంప ముంచింది. మరో అయిదేళ్ల వరకు కర్నాటక రాజకీయాల్లో జేడీఎస్ చేయడానికి ఏమీ లేదు. అయిదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుకోవడం మినహాయిస్తే చక్రాలు తిప్పగలిగేది లేదు. కింగ్ మేకర్ రోలూ లేదు. ఈ ఎన్నికలు కుమారస్వామి పార్టీకి చాలా పెద్ద నిరాశ కలిగించాయి.